……. రచన :: ఇమాం షఫీ…… రాజాధిరాజా.. నరసాపురం కాజా… అసలే అక్కడ కుర్చీలో ఉన్నది పుట్టలో ఎవరన్నా వేలెడితే కుట్టకుండా వదిలిపెట్టని నాయకుడు. కొందరి విషయంలో వేలెట్టేద్దాకా కూడా ఆగట్లేదు. అందుకే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఇప్పటిదాకా రాజుగారికి ఎన్నో లైఫ్లైన్లు ఇచ్చింది పార్టీ అధినాయకత్వం. అయినా ఆయన అన్ని లైన్లూ దాటేసరికి ఇక లాభం లేదనుకుని బర్త్‌డే రోజు ముహూర్తం పెట్టేసుకుంది. మోదీ రెండోసారి అధికారంలోకొచ్చాక దేశద్రోహం కేసులు కొత్తగా తెరపైకొచ్చినట్లే… ఏపీలో జగన్ ఏలుబడిలో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారన్న కేసులు నమోదవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్‌పై చంద్రబాబు అసత్యప్రచారం చేశారని మొన్న ఆయనకు నోటీసులిచ్చేందుకు గడపదాకా వెళ్లారు. ఇప్పుడు రఘురామకృష్ణంరాజుని ఆ తరహా కారణాలతోనే అరెస్ట్ చేశారు సీఐడీ అధికారులు.
రఘురామకృష్ణంరాజు సాంకేతికంగా వైసీపీ ఎంపీ అయినా ఆయన ఎప్పుడో వైరివర్గం జాబితాలో చేరిపోయారు. జగన్ పార్టీ నేతల దృష్టిలో ఏపీలో టీడీపీకి ముగ్గురు ఎంపీలు కాదు… నరసాపురం రాజావారితో కలిపి నలుగురు… వైసీపీ జెండాతో గెలిచినా ఏనాడూ పార్టీ ఎజెండాని లెక్కచేయలేదు రఘురామకృష్ణంరాజు. బీజేపీ ప్రాపకం కోసం ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారంటే ఆయన లెక్కలు వేరు. ఆయన విమర్శల జోరు టీడీపీని మించిపోయింది. డైరెక్ట్ జగనే టార్గెట్. అక్రమాస్తుల కేసులో జైలు జీవితాన్ని కూడా గడిపిన జగన్ బెయిల్‌మీద బయటున్నారు. ఆయన్ని మళ్లీ కటకటాల వెనక్కి పంపించాలన్నంత కసితో రగిలిపోతున్నారు రఘురామకృష్ణంరాజు…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్‌ని రద్దుచేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషనేశారు నరసాపురం ఎంపీ. అక్రమాస్తుల కేసులో సాక్షుల్ని పదవులిచ్చి ప్రలోభపెడుతున్నారని, ఏ2ని ఏకంగా రాజ్యసభ సభ్యుడిని చేశారని పిటిషన్లో ప్రస్తావించారు. బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టుని కోరడమే కాదు.. త్వరలోనే సంచలన తీర్పు రాబోతోందంటూ జగన్ అండ్‌కోని కొన్నాళ్లుగా మరింత ఇరిటేట్ చేస్తున్నారు ఆ పార్టీ ఎంపీ… ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రఘురామకృష్ణంరాజు ఎంపీ పోస్ట్ పీకేయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది వైసీపీ. అయినా పందేల రాజు కాలు దువ్వడం ఆపకపోవటంతో ఇక లాభం లేదని అరెస్ట్ చేసింది.
Ads
ప్రభుత్వ ప్రతిష్టని భంగం కలిగిస్తున్నారంటూ ఒకటికి మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టి ఎంపీని అరెస్ట్ చేసింది జగన్ సర్కార్. కేసు నిలబడుతుందా లేదా అన్నది తర్వాత. మొత్తానికి ఆ జుత్తు చెదరకుండా, కడుపులో చల్ల కదలకుండా పంచ్లేస్తున్న ట్రిపుల్Rని లోపలేశామనే సంతృప్తి మిగిలింది వైసీపీకి. ఇంతకీ రాజుగారు బీజేపీ కనుసన్నల్లో మెదలుతున్నారా, టీడీపీ మౌత్‌పీస్‌గా మారిపోయారా అన్నది చిదంబర రహస్యం. నాతో పెట్టుకుంటే మడతడిపోద్దన్నట్లు రాజు ఎక్కడా రాజీ పడటం లేదు. జగన్ బెయిల్ రద్దు మీద సీబీఐ కోర్టులో పిటిషన్‌కి ముందు నుంచీ వైసీపీ గాలి తీసే పన్లోనే ఉన్నారు నరసాపురం ఎంపీ.
రఘురామకృష్ణంరాజు రోషానికి పోయి రాజీనామా చేస్తే నరసాపురంలో ఓడించి తడాఖా చూపాలనుకుంటోంది వైసీపీ. రోషాలు పౌరుషాలు కోళ్లపందేల దగ్గర గానీ.. పదవితో గాంబ్లింగ్ ఆడొద్దనేది రాజు స్ట్రాటజీ… ఎంపీగా గెలిచినప్పట్నించీ ఢిల్లీ లాబీయింగ్‌లో తలపండిపోయారాయన. మనోడు అనుకునేలా బీజేపీ పెద్దల ముందు వినయ విధేయ రాముడినిపించుకున్నారు. అందుకే ఎంతమందినైనా పంపు షేర్‌ఖాన్ అన్నట్లుగా.. వైసీపీ నుంచి ఎందరు నేతలు దాడికి దిగినా కూల్‌గా కౌంటర్లిచ్చుకుంటూ వస్తున్నారు… జగన్ బొమ్మతో గెలిచావని వైసీపీ నేతలు అంటుంటే.. నా ఫేస్ వాల్యూతోనే మీరంత గట్టెక్కారంటారు రాజుగారు. సిగ్గుంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని వైసీపీ నేతలు టెంప్ట్ చేసినా.. బతిమాలితేనే వైసీపీలోకి వచ్చానని కాలు దువ్వుతున్నారు. కెలుక్కుంటే కంపేనని ఓపిక పట్టీపట్టీ చివరికి జగన్ తన రివెంజ్ ఎలా ఉంటుందో చూపించారు. నన్ను మర్డర్ చేయడానికి పులివెందుల గూండాల్సి దించారని ఆరోపించేదాకా వెళ్లిన నరసాపురం రాజు.. తన అరెస్ట్ దాకా వచ్చాక ఏ వ్యూహంతో ముందుకెళ్తారో చూడాలి. జగన్‌ని జైలుకి పంపేదాకా నిద్రపోనంటాడా? ప్లగ్గులో వేలుపెడితే ఏమవుతుందో తెలిసింది కాబట్టి సైలెంటైపోతాడా?
Share this Article