సభలో వందన సమర్పణ కూడా అయిపోలేదు… జనం తిరుగుముఖం కూడా పట్టలేదు… లక్షల మంది సభికుల్లో సభ సక్సెస్ తాలూకు జోష్ అలాగే కనిపిస్తోంది…. హరీష్, కేటీయార్ ట్వీట్లు దిష్టితీసినట్టుగా అనిపించాయి… రాహుల్, కాంగ్రెస్‌లను విమర్శిస్తూ… రాహుల్ ప్రస్తావనలకు యమర్జెంటు ఖండనలు… తెల్లవారే పత్రికల్లో రాహుల్ వార్తతోపాటు తమ ఖండనలూ పబ్లిషయి, బ్యాలెన్స్ అయిపోవాలని..! టీవీల్లో లైవ్ వస్తుంటే దిగువన తమ వ్యాఖ్యలు స్క్రోల్ కావాలని…!
కేసీయార్ ప్రభుత్వ వైఖరి ఏమాత్రం హుందాగా, సంస్కారయుతంగా లేదు… రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని మర్యాదలు పాటించాలి… కేసీయార్‌లో అవేవీ కనిపించడం లేదు… ఎవరూ సభ జరుపుకోవడానికి వీల్లేదా..? గతంలో కోదండరాంను ఎలా సతాయించారో చూశాం… ఆయనే కాదు, ప్రతి ఒక్కరి పట్లా అదే ధోరణి… ఇప్పుడు రాహుల్ సభపై కూడా సేమ్ ధోరణి… ఐతేనేం, లక్షల జనం హాజరై, కాచుకో కేసీయార్ అని నినదించారు…
హఠాత్తుగా అధికారులకు వాహనాల లైసెన్సులు గుర్తొస్తయ్… జరిమానాలు వేస్తామంటారు… సీజ్ చేస్తామంటరు… ఎవరినీ వాహనాలు ఇవ్వవద్దంటూ వాళ్లే బీఆర్ఎస్ కార్యకర్తలయిపోతారు… మరిపెడలో కావచ్చు బహుశా ఏకంగా కాంగ్రెస్ వాళ్లపై బీఆర్ఎస్ కార్యకర్తలు భౌతికదాడులు చేస్తారు… ఏం సాధించినట్టు కేసీయార్..? తన రాజకీయ సంస్కార రాహిత్యాన్ని తను బయటపెట్టుకోవడం మినహా… కానీ నవ్వొచ్చే విషయం ఏమిటంటే… సభ పూర్తగాకముందే కేటీయార్, హరీష్ రావు ఖండనల ట్వీట్లు… ఎందుకంత ఉలికిపాటు..?
Ads
అన్నింటికన్నా దారుణం… నమస్తే తెలంగాణ అనే పత్రిక… సారీ, పత్రిక అని ప్రస్తావించినందుకు…! హరీష్, కేటీయార్ ఖండనలకు ఫస్ట్ పేజీ ఇండికేటర్స్ పెట్టారు… లోపల వివరంగా వాళ్లిద్దరి ఖండనల్ని కాలాల కొద్దీ పరిచేశారు… పొరపాటున నాలాంటివాడు కేవలం నమస్తే తెలంగాణను మాత్రమే కొంటున్నాడు అనుకుందాం… ఇప్పుడు వీళ్లద్దరి ఖండనల్ని చదివితే, ఓహో, రాహుల్ మీటింగ్ జరిగిందా, ఏం మాట్లాడాడబ్బా అని ఆ వివరాలు తెలుసుకోవడానికి నేను తప్పకుండా వేరే పత్రికలు కొనాలా..? అసలు నమస్తే తెలంగాణ పత్రిక అనిపించుకుంటుందా..? చివరకు సాక్షి కూడా అప్పుడప్పుడూ కాస్త ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ చూపిస్తుంది… కానీ నమస్తే..?
తెలంగాణలో కాంగ్రెస్‌కు బలమైన ప్రత్యర్థి బీఆర్ఎస్… జాతీయ స్థాయిలో బీజేపీ… రాహుల్ తెలివిగా రెండింటినీ కలిపి కొట్టాడు… అంతేకాదు, కేసీయార్ అవినీతికి మోడీతో లంకె పెట్టాడు… అంటే మోడీ ఈ అవినీతిలో భాగస్వామి అని కాదు… కేసీయార్ అవినీతికి మోడీ సపోర్టర్ అని..! ప్రతిపక్షాల మీటింగుకు కేసీయార్‌ను ఆహ్వానించకూడదని మేమే చెప్పామనీ, ఆయన వస్తే మేం రాలేం అని ఖండితంగా చెప్పామని రాహుల్ చెప్పుకొచ్చాడు… ఇది సరైన స్క్రిప్ట్ కాదు…
కేసీయార్‌కూ, మాకూ ఎలాంటి సంబంధాలు లేవని పదే పదే చెప్పడం తెలంగాణ రాజకీయాల వరకు వోకే… కానీ ఇవన్నీ వాస్తవంలో పొల్లుమాటలు… గత ఎన్నికలప్పుడు కేసీయార్ కాంగ్రెస్‌కు ఆర్థిక సాయం చేయలేదా..? రేప్పొద్దున కేంద్రంలో అవసరపడితే మళ్లీ కేసీయార్ కాంగ్రెస్ వైపు పరుగులు తీస్తూ రాడా..? ఇదే రాహుల్ దూతలు హైదరాబాద్ వైపు ఉరికి రారా..? అంతెందుకు..? కేసీయార్ బీజేపీ మనిషి అంటున్నారు కదా… మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనను నిలువునా చీల్చేసిన బీజేపీ రేప్పొద్దున తన గొడ్డలికి తెలంగాణలో పనిచెప్పదా..? మన బీటీమే కదా బీఆర్ఎస్ అనుకుని ఉపేక్షిస్తుందా..?
అలవిమాలిన వాగ్దానాలు చేసి, తీరా గద్దెనెక్కాక వాటిని ఎలా అమలు చేయాలో తెలియక కర్నాటక కాంగ్రస్ ఆపసోపాలు పడుతున్న తీరు చూస్తున్నాం కదా… ఇప్పుడిక తెలంగాణ కాంగ్రెస్ వంతు… ఆల్‌రెడీ 4 వేల పెన్షన్ ప్రకటింపచేశారు… రాను రాను కర్నాటకను మించిన హామీలు రాబోతున్నాయి… చేపలు పట్టేవాడు ఎరలు వేయడం కామన్… అఫ్‌కోర్స్ ఏ పార్టీ మినహాయింపు కాదు… అందరూ చేపలు పట్టేవాళ్లే…
ఉపసంహారం :: చెప్పడం మరిచిపోయా, ఖమ్మం కాంగ్రెస్ సభ సూపర్ హిట్… భట్టికి, పొంగులేటికీ సమప్రాధాన్యం ఇచ్చారు… కలిసి పనిచేస్తే ఫలితం ఏమిటో ఖమ్మం సభ చెప్పింది… (అఫ్‌కోర్స్, కాంగ్రెస్‌లో ఏకతారాగాలు తాత్కాలికమే అనుకొండి)… కర్నాటక ఎన్నికలు కూడా అదే చెప్పాయి… ఎటొచ్చీ ఆ ‘ఉత్త’మకుమార్‌రెడ్డిని రాహుల్ ప్రసంగానికి అనువాదకుడిగా పెట్టి ఉండాల్సింది కాదు… రాహుల్ మాట్లాడేది వేరు, ఈయన అనువాదం వేరు చాలాసార్లు… ఫాఫం రాహుల్…!! మళ్లీ ఉండవల్లి గుర్తొచ్చాడు… అన్నట్టు ఈ దిగువ వీడియో ఓసారి చూడండి సరదాగా…
Share this Article