పార్ధసారధి పోట్లూరి ……… రంగ ప్రవేశం – ఆరం గేట్రం ! నేనేమీ భారతీయ నృత్య రీతుల గురుంచి ఇక్కడ చెప్పబోవడం లేదు! అంచేత ఖంగారు పడకండి ! విషయం ఏమిటంటే ఒకప్పుడు, అంటే 20 ఏళ్ల క్రితం వరకు వివిధ నృత్య రీతులకి వాటికి తగ్గ పేర్లు ఉండేవి. ఇక్కడ పేర్లు అంటే విశ్వవిద్యాలయం నుండి పట్టా పుచ్చుకునే సందర్భంలో జరిగే వేడుకలో విద్యార్ధులు తాము ఉత్తీర్ణులం అయ్యామని ఘనంగా చెప్పుకునే వారు కదా ? అలాగే భరతనాట్యం లేదా కూచిపూడి నృత్యం గురువు దగ్గర నేర్చుకున్నాక మొదటి సరిగా వేదిక ఎక్కి తాను గురువు దగ్గర నేర్చుకున్న విద్యని ప్రదర్శించి ఆహుతుల ఆశీర్వాదం తీసుకోవడం అనూచానంగా వస్తున్న సాంప్రదాయం !
భరతనాట్యం నేర్చుకున్న వారు తొలిసారిగా వేదిక మీద ప్రదర్శన ఇవ్వబోతున్నాను కాబట్టి ‘ఆరం గేట్రం‘ కి వచ్చి నా నాట్యాన్ని తిలకించి నన్ను ఆశీర్వదించండి అని ఆహ్వాన లేఖ ఇచ్చేవారు. కూచిపూడి నృత్యం నేర్చుకున్న వారు తొలిసారిగా వేదిక మీద ప్రదర్శన ఇవ్వబోతున్నాను కాబట్టి ‘రంగ ప్రవేశం‘ కి వచ్చి మీరు నా నృత్య ప్రదర్శనని తిలకించి ఆశీర్వదించండి అని ఆహ్వాన పత్రిక ఇచ్చేవారు. మరి ఇప్పుడో ?
Ads
నా ‘ఆరగేట్రం ‘ ఉందండీ వచ్చి చూసి ఆశీర్వదించండి అంటున్నారు ! ఓహో ! భరతనాట్యమా ? లేక కూచిపూడి నాట్యమా ? అని అడగాల్సి వస్తున్నది. అఫ్కోర్స్ మన నృత్య సాంప్రదాయాల గురించి ఇప్పుడు ఎవరికీ తెలియకుండా పోయింది అనుకోండి అది మన ఖర్మ ! ఆరం గేట్రం అంటే భరత నాట్యం అనీను , రంగప్రవేశం అంటే కూచిపూడి అనీను అర్ధం ఉండేది ఒకప్పుడు ! ఇప్పుడు అంతా కలిపేశారు ! ఆరం గేట్రం అనే అంటున్నారు కానీ రంగప్రవేశం అనే పదం వాడడం లేదు ! అలా అని ఆరంగేట్రం అనే తమిళ పదాన్ని వాడడాన్ని నేను వ్యతిరేకించట్లేదు కానీ అనూచానంగా వస్తున్న సాంప్రదాయాన్ని ఎందుకు వదిలేస్తున్నారు ?
ఆంధ్ర దేశంలోని కూచిపూడి అనే గ్రామం ఒకప్పుడు కూచిపూడి నృత్య సాంప్రదాయానికి నిలయంగా ఉండేది ! రాజులు రాజ్యాలు ఉన్నంత కాలం ఆంధ్ర దేశంలో కవులకి, కళాకారులకి అంతో కొంత ఆదరణ ఉండేది ! ప్రజాస్వామ్యం పరిఢవిల్లేసరికి కళలకి కరువు వచ్చింది ! తెలుగువారి భావ, సాంస్కృతిక దారిద్ర్యం వలన సంగీత, నృత్య సాంప్రదాయ కళలు వాటిని నేర్పించే గురువులు మద్రాసుకి వెళ్లిపోయారు ఆంధ్ర దేశం నుండి 70 ఏళ్ల కిందటే ! సహజంగానే మద్రాసులో భరత నాట్య గురువులు ఉండేవారు, వాళ్ళతో కూచిపూడి గురువులు తోడయ్యారు. అలా రంగ ప్రవేశం కాస్తా ఆరంగేట్రం అయిపోయింది !
శ్రీ సిద్ధేంద్ర యోగి గారు కూర్చిన నృత్యం కూచిపూడి ! ముద్రలు పట్టే విధం, ఆహార్యం, ఆహారం కూడా ఎలా ఉండాలో విధి విధానాలని నిర్దేశించారు శ్రీ సిద్ధేంద్ర యోగి గురువుగారు ! ముద్రలు, ఆహార్యం వరకు సరే మరి ఆహారం మీద ఎందుకు ? నృత్యం నేర్చుకునే వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి మరియు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు గురువు గారు ! ఆహార నియమం కనుక పాటించక పోతే శరీరం విల్లులా వంగదు మరి!
మాష్టారు మీరేం చెప్పాలి అనుకుంటున్నారో నేరుగా చెప్పకుండా ఇలా ‘గద ‘ తీయడం భావ్యమా ? అని మీరు అనుకోవచ్చు ! నా ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నందుకు అప్పుడప్పుడు ఇలా ‘గదా ఘాతాలు ‘ తప్పవు మరి ! పాయింట్ లోకి వచ్చేస్తా ! RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ రావడం మీద ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తాయి !
80 కోట్లు ఖర్చు పెట్టి లాబీయింగ్ చేసి, చివరకి ఒక పాటకి ఆస్కార్ అవార్డు సాధించారు అంటూ సినీ ప్రముఖులు కొందరు విమర్శలు చేయడం, దాని మీద ప్రతి విమర్శలు చేయడం జరిగింది ! రాజమౌళి ఆస్కార్ అవార్డ్ కొనుక్కున్నాడు ! మరే ! ఇలా విమర్శించేవారు ఎందుకు కొనుక్కోకూడదు ? ఎవరు ఆపారు మిమ్మల్ని ? కొనడం కూడా చేతనవలేదా?
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు అస్మదీయులకే దక్కుతాయన్నది బహిరంగ రహస్యం ! నీ కులం ఏమిటీ ? నీ ప్రాంతం ఏమిటీ ? నీకు అవార్డ్ ఇస్తే నాకేంటి ? ఇలా నంది అవార్డుల విషయంలోనే ఇన్ని అంశాల మీద ఆధారపడి ఇస్తుంటే, మరి ఆస్కార్ విషయంలో ఎంత ఉండాలి ? ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఏమన్నా నిష్పక్షపాతంగా ఇస్తున్నారా ? ఇక నేషనల్ అవార్డుల విషయంలో ఎన్ని వివాదాలు రాలేదు ?
మన రాష్ట్రంలో, మన దేశంలో ఇచ్చే అవార్డుల మీద విమర్శలు చేసే ధైర్యం లేని వాళ్ళు ఆస్కార్ విషయంలో రాజమౌళి మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? లాబీయింగ్ చేయనిదే ఆస్కార్ అవార్డ్ రాదు ! ఇది సత్యం ! సినిమా ఎంత బాగున్నా, ఎంత సాంకేతిక విలువలు ఉన్నా, ఆస్కార్ రాదు లాబీయింగ్ చేయనిదే !
2002 లో లగాన్ సినిమాకి ఆస్కార్ వస్తుంది అని అందరూ ఆశించారు కానీ రాలేదు. ఎందుకని ? అమీర్ ఖాన్ పూనుకొని మరీ లాబీయింగ్ చేసుకున్నాడు. అమీర్ ఖాన్ కి స్వంత శక్తివంతమయిన పబ్లిసిటీ సంస్థ ఉంది అప్పటికే. 2002 లో లగాన్ సినిమా ఆస్కార్ అవార్డ్ ప్రమోషన్ కోసం లాస్ ఏంజెల్స్ వెళ్ళాడు అమీర్ ఖాన్. లాస్ ఏంజెల్స్ లో ఉన్న ఇండియా టుడే విలేఖరి అమీర్ ని ఇంటర్వ్యూ చేశాడు. అమీర్ ఖాన్ ఇండియా టుడే విలేఖరితో మాట్లాడుతూ….
‘‘లగాన్ సినిమాని వీలున్నంత వరకు ఎక్కువమంది అవార్డ్ జ్యూరీ సభ్యులకి చూపించడానికి నేను లాస్ ఏంజెల్స్ వచ్చాను. నాకు తెలుసు ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అని. కానీ విజయవంతం అవుతానని అనుకుంటున్నాను. ఇది మొదటి దశ, అంటే వీలున్నంత వరకు ఎక్కువ మందికి చూపించాలి… ఆ తరువాత వాళ్ళు మొదటి 5 లేదా 6 చిత్రాలని అవార్డ్ ఎంపిక కోసం మళ్ళీ అందరూ కలిసి చూస్తారు. దీనికోసం కూడా చాలా ఖర్చు అవుతుంది. మొదటి 5 సినిమాలలో లగాన్ కూడా ఉంది. అంటే ఆ తరువాత ఓటింగ్ కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది…’’
ఇలా ఆస్కార్ అవార్డ్ ప్రమోషన్ కోసం అమీర్ చేసిన ప్రయత్నాలని ఇండియా టుడే విలేఖరికి వివరంగా చెప్పాడు. ఒక్కో సభ్యుడికి ఒక్కో రోజు ఖరీదయిన హోటల్ లో విందు ఏర్పాటు చేసి, సినిమా ప్రమోషన్ కోసం అభ్యర్ధించాలి. హోటల్ అంటే ఖరీదయిన స్కాచ్ విస్కీతో విందు ఉంటుంది.
2002 లో లగాన్ సినిమా ఆస్కార్ అవార్డ్ కోసం అమీర్ ఖాన్ లాబీయింగ్ కోసం చేసిన ఖర్చు అక్షరాలా 2 మిలియన్ డాలర్లు. ఇది 2023 అంటే రెండు దశాబ్దాల క్రితమే 2 మిలియన్లు, అంటే 20 లక్షల డాలర్లు ఖర్చు పెట్టినా లగాన్ కి ఆస్కార్ అవార్డు తెచ్చుకోలేక పోయాడు అమీర్ ఖాన్ ! మరింత వెనక్కి వెళ్తే… 1957 లో మహబూబ్ ఖాన్ తీసిన ‘మదర్ ఇండియా‘ కి మన దేశంలో ఆదరణ లభించింది. ఇప్పటికీ మదర్ ఇండియా ఒక క్లాసిక్ సినిమా !
మహబూబ్ ఖాన్ కూడా లాస్ ఏంజెల్స్ వెళ్ళి మదర్ ఇండియా సినిమా కోసం ప్రమోషన్ చేసుకున్నాడు . డబ్బు ఖర్చయ్యింది కానీ ఆస్కార్ అవార్డ్ రాలేదు. 2002 లో మహబూబ్ ఖాన్ కొడుకు షౌకత్ ఖాన్ తన చిన్నతనంలో తన తండ్రి మహబూబ్ ఖాన్ మదర్ ఇండియా సినిమా ప్రమోషన్ కోసం ఎంత ప్రయత్నం చేశాడో గుర్తుకు తెచ్చుకున్నాడు. షౌకత్ తన తండ్రి మాటలని గుర్తుకు చేసుకున్నాడు:.. నేను మదర్ ఇండియా సినిమా ప్రమోషన్ కోసం ప్రయత్నించాను కానీ అక్కడ మార్కెటింగ్ చేయాలి అని నాకు అప్పట్లో తెలియదు లేకపోతే మదర్ ఇండియా సినిమాకి ఆస్కార్ తెచ్చుకునే వాడినే అన్నాడు…
మదర్ ఇండియా, లగాన్ సినిమాలకి మధ్య 42 ఏళ్ల దూరం ఉంది. పరిస్థితులు మారాయి. అమీర్ ఖాన్ కి పవర్ఫుల్ పబ్లిసిటీ సంస్థ ఉంది. 2 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాడు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. అంటే దీనర్ధం ఏమిటీ ? మార్కెటింగ్ చేయడం కూడా ఒక కళ ! ఆ పని రాజమౌళి చేశాడు… అందులో తప్పేం ఉంది ? అక్కడ లాబీయింగ్ అంటే మార్కెటింగ్ సరిగా చేయడం తెలియకపోతే డబ్బు ఖర్చు అవుతుంది కానీ ఉపయోగం ఉండదు. ఒక్క భారతీయ సినిమాలకేనా లాబీయింగ్ చేయాల్సింది ? అది ఏ దేశపు సినిమా అయినా లాబీయింగ్ చేసుకోవాల్సిందే! హాలీవుడ్ సినిమాలకి అయినా లాబీయింగ్ చేయాల్సిందే !
అమీర్ ఖాన్ లగాన్ సినిమా లాబీయింగ్ కోసం అమెరికాలోని అన్ని ప్రధాన పత్రికలకి ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చాడు. ఒక్కో ఫుల్ పేజీ ప్రకటన కోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు ! నిజం ఇది అయితే రాజమౌళి డబ్బులతో ఆస్కార్ కొన్నాడు అనడం అవివేకం ! ఏ మాత్రం అక్కడి పరిస్థితుల మీద అవగాహన లేకుండా విమర్శలు చేశారు చేస్తున్నారు ఇంకా ! బాలీవుడ్ దగ్గర డబ్బు లేకనా ? సిగ్గు పడండి ! రాజమౌళి టీమ్ తమ సినిమా పాటని ప్రమోట్ చేసుకోవడంలో విజయం సాధించారు అది తెలుగు వాళ్లగా మనం గర్వపడాలి అంతే ! ఆస్కార్ వేదిక మీద ఒక తెలుగు పాట కనపడడం, వినపడడం దానికి డాన్స్ చేయడం అనేది పెద్ద విజయం !
నాటు నాటు పాటలో పెద్దగా చెప్పుకోదగ్గ సాహిత్య విలువలు లేవు ! కీరవాణి ఇచ్చిన ట్యూన్ కి అనుగుణంగా పాట వ్రాశాడు చంద్ర బోస్ ! నాటు నాటు పాట కంటే మంచి సాహిత్యపు విలువలు ఉన్న పాటల్ని చాలానే వ్రాశాడు చంద్ర బోస్. హాలీవుడ్ వాళ్ళకి ‘ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైనా.. జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన… అని తెలుగులో చెప్పినా అర్ధం కాదు. పోనీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చెప్పినా తెలుగులో ఉన్న అర్ధం వాళ్ళకి చేరదు!
ఎటొచ్చీ డాన్స్ మరియు పాటని చిత్రీకరించిన విధానం వాళ్ళకి నచ్చింది ! మొదట్లోనే చెప్పానుగా అది భరతనాట్యం కాదు కూచిపూడి కాదు. పోనీ భారతీయ నృత్యం అందామా అంటే అదీ కాదు. యూరోపు, మధ్య ప్రాచ్యపు నృత్య రీతుల కలయిక అది. మనతో పాటు వాళ్ళకీ నచ్చింది. అమెరికాలోని సినిమా హాళ్లలో ప్రేక్షకులు కుర్చీలలో నుండి లేచి మరీ స్క్రీన్ ముందు డాన్స్ చేయించేలా చేశాడు రాజమౌళి !
అసలు తెలుగు సినిమాల్లో ఆస్కార్ రేంజ్ లో ఉన్నవి చాలానే ఉన్నాయి ! మాయాబజార్, పాతాళ భైరవి, సాగర సంగమం ! మాయా బజార్ లో అయితే ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ గా SV రంగారావు గారు అర్హుడు. పాతాళ భైరవి సినిమా కూడా ఆర్ట్ [కళ ] విభాగానికి ఆస్కార్ అర్హత ఉంది ! అదే సినిమాలో ఉత్తమ విలన్ విభాగంలో మళ్ళీ SV రంగారావు గారికి అర్హత ఉంది ! నర్తనశాల సినిమాకి ఉత్తమ విలన్ కూడా SVR అర్హత ఉంది !
ఇక సాగర సంగమం సినిమా అయితే ఉత్తమ డైరెక్షన్, ఉత్తమ సంగీతం, ఉత్తమ కధ, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాలకి ఆస్కార్ అర్హత ఉంది ! K. విశ్వనాథ్, వేటూరి సుందరరామమూర్తి గారు, మ్యూజిక్ మెస్ట్రో లయ రాజా ఇళయ రాజకీ ఆస్కార్ అర్హత ఉంది !
ఇలా మదర్ ఇండియాకి గాను మెహబూబ్ ఖాన్, లగాన్ సినిమాకి అమీర్ ఖాన్, సాగర సంగమం సినిమాకి నిర్మాత ఏడిద నాగేశ్వర రావు, విశ్వనాథ వారు ఎవరూ కూడా తమ సినిమాలని ఆస్కార్ కోసం మార్కెటింగ్ చేసుకోలేక పోయారు. దానిని రాజమౌళి సాధించాడు. ఆస్కార్ వేదిక మీద తెలుగు పాటని వినిపించడం, కనిపించడం అనేవి చేయగలిగాడు ! సముద్ర తీరంలో చింతపండు దొరకదు, అడవిలో ఉప్పు దొరకదు ! సముద్ర తీరంలో ఉప్పు అమ్మడానికి ప్రయత్నించినా, అడవిలో చింతపండు అమ్మడానికి ప్రయత్నించినా అది వృధా ప్రయాస అవుతుంది! మార్కెటింగ్ అంటే ఇదే ! అది తెలుసుకొని మార్కెటింగ్ చేసుకున్నాడు రాజమౌళి ! అభినందిద్దాం ! సినిమా తీయడం కాదు దానిని ఎలా మార్కెటింగ్ చేయాలో కూడా తెలిసి ఉండాలి ఇప్పటి రోజుల్లో ! రాజమౌళి అదే చేశాడు !
(జాతీయ అవార్డు విన్నర్, తమిళ దర్శకుడు వెట్రిమారన్ విసారనై సినిమాకు అవార్డు కోసం కోట్లకుకోట్లు ఖర్చుచేశాడు అమెరికాలో లాబీయింగ్ కోసం… తను చాలా మంది పత్రికలవారికి చెప్పాడు, ఆస్కార్ రావాలంటే ఎంతగా ఖర్చుపెట్టాలో… మొన్న బీబీసీ కూడా అదే రాసింది… సో, అవార్డు అంటేనే లాబీయింగు తప్పదు… తప్పదు…)
Share this Article