( Raj Madiraju ) కొంచెం చాలా పెద్ద పోస్టు.. ఓపికుంటే చదవండి.. ఇరవయ్యేళ్ళక్రితం లగాన్ ఆస్కార్లకు నామినేట్ అయినప్పుడు అమీర్ ఖాన్ దానికి గట్టి బందోబస్తుతోటే వెళ్ళాడు.. రెండుమిలియన్ డాలర్ల బడ్జెట్టుతో (అప్పటి విలువ ప్రకారం సుమారు పదికోట్ల రూపాయలు – సినిమా బడ్జెట్లో నలభై శాతం) దాదాపు రెండున్నర నెలలు అక్కడే తిష్టవేసి వాళ్ళనీ వీళ్ళనీ కలిసి, తన ఫ్రెండ్స్‌తో హాలీవుడ్ డైరెక్టర్లు స్పీల్‌బర్గు, స్కోర్సీసి లాంటివాళ్లకు సినిమా చూడమని ఫోన్లు చేయించి, చూశాక వాళ్ళతో అక్కడా ఇక్కడా చెప్పించి..
ఇంతా చేస్తే అవార్డు రెడ్ కార్పెట్లో విలేకరులు అమీరుని “మీ ఏజెన్సీ ఎవరు..” అనడుగుతే తనదైన స్టైల్లో “సారీ.. మర్చిపోయాను..” అని అన్నాడంట.. అవార్డు రాలేదు కానీ అమెరికన్ మార్కెట్లో అతని పేరు బాగా తెలిసింది.. అయితే అప్పట్లో ఒక స్ట్రాంగ్ రూమరేంటంటే, లాబీయింగు ఇంకా బలంగా చేసి ఉంటే లగానుకి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డు వొచ్చి ఉండేదని..
ఇప్పుడు బడ్జెట్లు పెరిగాయి.. అయిదు నుంచి పది పన్నెండు మిలియన్ డాలర్ల బడ్జెట్ పెట్టుకుంటారు స్టూడియోలు ఆస్కార్ క్యాంపెయినింగు కోసం.. టోరంటో, కాన్స్, సన్‌డాన్స్ లాంటి ఫిలిం ఫెస్టివళ్ళలో ప్రదర్శించడం, అక్కడ ప్రెస్సు సినిమా గురించి కవరేజి ఇవ్వడం, అలాగే ఆస్కార్ వోటింగు మెంబర్లు ఎలాగైనా ఆ సినిమా చూసేట్టు చేయడం ఈ క్యాంపెయిన్లో ఒక భాగం..
Ads
అక్కణ్ణుంచి ఇంటికి తిరిగి వెళ్ళిన వోటింగు మెంబర్లను ఆకర్షించడం కోసం స్పెషల్ స్క్రీనింగులు, డిన్నర్లు, గెట్టుగెదర్లు ఏర్పాటు చేయడం.. ఆ తరవాత విస్పరింగ్ క్యాంపెయిన్లు.. అంటే అతని ఫ్రెండ్ ఎవరో ఒకరు అనుకోకుండా అతని చెవిలో “అరే ఈ సినిమా చూశావా..” అని గుసగుసలాడడం.. ఇవికాక ఎడ్వర్టైజుమెంట్లు, మెయిలర్లు, పార్టీలు..
ఇదో పరిశ్రమ.. ఎంతగా అంటే ఒక్కో డిన్నర్లో వొచ్చే గెస్టులు, వాళ్ళకిష్టమైన రంగుల్లో వెల్కం బోర్డులు, ఇష్టమైన వంటకాలతో మెనూలు, డ్రింకులు, చుట్టూ అమ్మాయిలు (బహుశా అబ్బాయిలు కూడా..) ఎలా ఉండాలో ఏజెన్సీలు డిజైన్ చేసేంతగా.. చివరికి ఎదుటివాడి గురించి బురద చల్లేంతవరకూ.. కేసీ ఎఫ్లెక్ అనే యాక్టరుకి నామినేషన్ రాగానే అతని ఎనిమిదేళ్ల క్రితం గర్ల్‌ఫ్రెండ్స్ ఇద్దరు తమను ఎలా హింసించేవాడో బైటికొచ్చి చెప్పారు.. (అది పనిచేయలేదు, అతను ఆ యేడాది బెస్ట్ యాక్టరు అవార్డు గెలిచాడు.. అది వేరే సంగతి..)
అన్నీ కళాత్మక దృష్టితో సినిమా తల్లికి సేవ చేయడానికి, ఒక నిజమైన కళాకారుడికి సినిమాకి చేయూతనివ్వడానికి జరుగుతున్నట్టే బిల్డప్ ఇవ్వడం.. మొత్తం మీద దాదాపు పది వేల మంది వోటర్లు.. వేరువేరు కేటగిరీల్లో వాళ్లకిష్టమైన సినిమాలు చూసి వోటు చేస్తారు.. అందులో సాధ్యమైనంతమందికి తమ సినిమా చూపించాలని, వాళ్ళ వోటు సంపాదించాలని ఈ ప్రొడ్యూసర్ల/ స్టూడియోల తాపత్రయం..
ఎందుకు.. ఆస్కార్ల గురించి ఇంత తాపత్రయం.. ఆఫ్టరాల్ ఒక అవార్డేగా అది.. మన దేశం, సంస్కృతి గురించి ప్రపంచానికి తెలుస్తుందనే వాదనవైపే వెళ్ళను నేను.. ప్యూర్ కమర్షియల్స్ గురించే మాట్లాడతాను.. ఆస్కార్ బంప్ అనే మాట గురించి విని ఉంటే మీకు అర్ధమవుతుంది ఎందుకో.. సినిమాకు నామినేషన్ వొచ్చిన దగ్గరి నుంచీ అవార్డు వొచ్చేంతవరకూ తమ సినిమా వార్తల్లో ఉంటుంది.. ఒకవేళ అవార్డు గెలిచిందంటే అద్భుతమే.. కొత్త ప్రదేశాల్లో సినిమా విడుదల చేసుకోవచ్చు..
ఇప్పుడు ఆరారార్ బహుశా యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో విస్తృతంగా విడుదల చేయడానికి ప్లాన్స్ మొదలై ఉంటాయి.. అదికాక మళ్లీ ఇక్కడ ఇండియాలో రీరిలీజయింది.. అమెరికాలోనే ఇప్పటివరకు పదిహేను మిలియన్లు సంపాదించింది.. అవార్డొస్తే మరింత పెరిగే అవకాశం..
అయితే రాజమౌళి గేం ప్లాన్ ఇది అయ్యుండదు.. ఇంకా అగ్రెసివ్, ఫ్యూచరిస్టిక్ అని నా ఉద్దేశ్యం..
ఈ సినిమా చుట్టూ జరుగుతున్న చర్చ వల్ల, దొరికిన పబ్లిసిటీ వల్ల.. అవార్డు వొచ్చినా రాకపోయినా సరే.. రాజమౌళి, కీరవాణి, చరణ్, ఎన్‌టీయార్.. అందరికీ ఒక గుర్తింపు.. వీళ్ల ఫ్యూచర్ సినిమాలకి ఓ కొత్త మార్కెట్.. కొత్త క్రాసోవర్ స్టార్స్‌గా వీళ్ళకు వొచ్చిన గుర్తింపు, దానిని బేస్ చేసుకుని అల్లుకోబోయే కథలు, తీయబోయే సినిమాలు, రాబోయే రెవెన్యూలు..
అక్కడ అతని దృష్టి ఉందని అతని మార్కెటింగ్ ఆక్యుమెన్ తెలిసినవారెవరైనా గ్రహించగలరు.. వీళ్ళు నిజంగా పది మిలియన్ డాలర్లు (I cannot confirm this) క్యాంపెయిన్ ఖర్చు పెడుతున్నారంటే గుడ్డిగా ఏమీ పెట్టడంలేదు.. హైదరాబాదులో కూర్చుని ఒక తెలుగు సినిమా నైజాము, సీడెడు అని మనం లెక్కలేస్తోంటే న్యూయార్కులో కూర్చుని బ్రెజిలు, ప్యారిసు, న్యూజీలాండు లెక్కలు అతనేస్తున్నాడు.. మన దగ్గర ఎనభై కోట్లుంటే ఎనిమిదో ఎనభయ్యో సినిమాలు ఎలా తీయచ్చో అని ప్లాన్ చేస్తోంటే… ఆ ఎనభై కోట్లని అయిదేళ్ళలో ఎనిమిది వందల కోట్లు ఎలా చేయాలో లెక్కలు అతనేస్తున్నాడు..
మూడేళ్ల తరవాత ఒక సినిమా ఎలా ఆడబోతోందన్న లెక్కలేసి సినిమా అన్ని రోజులపాటు తీయగలిగిన మేధావి పదేళ్ళపాటు తన సినిమా ప్రపంచాన్ని ఎలా చూడబోతోందో లెక్కలేస్తున్నాడు.. పది కోట్ల తెలుగు ఆడియెన్సు నుంచి కొద్దిగా పైకి యాభై కోట్ల ప్రపంచ సినిమా ప్రేక్షకుల వైపుకి దృష్టి సారిస్తున్నాడు.. ఈ ప్రాసెస్సులో ప్రపంచ సినిమా మ్యాపులో రెవెన్యూ పరంగా ఒక శాతం కూడా లేని తెలుగు సినిమా అనే ఒక చిన్న బిందువుని స్పష్టంగా కనిపించేట్టు దిద్దుతున్నాడు.. మనం లోకలు.. అతను గ్లోబలు.. ప్రస్తుతానికి అభినందనలు చెబుదాం..
Share this Article