ఫ్యాన్స్ కావచ్చు, కాకపోవచ్చు… మామూలు నెటిజనం కావచ్చు… చాలా వార్తల్ని, ఫోటోల్ని ఎంత నిశితంగా గమనిస్తున్నారో చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది… ప్రత్యేకించి సినిమా సెలబ్రిటీల ఫోటోల్ని, వీడియోల్ని, కొత్త సినిమా పాటల్ని, సీన్లను, పోస్టర్లను గమనిస్తున్నారు… తప్పుల్ని వెతుకుతున్నారు… అవి గతంలో ఎక్కడి నుంచి కాపీ కొడుతున్నారో క్షణాల్లో పట్టేస్తున్నారు… ఇంకేం… మీమ్స్, పోస్టులు, వెటకారాలు, విమర్శలు ఇక కుప్పలు తెప్పలు…
అప్పుడప్పుడూ ఆ ఫోటోల పరిశీలనలో వాళ్లకు భలే ఆసక్తికరమైన పాయింట్స్ దొరుకుతాయి… ఉదాహరణకు ఈ ఫోటోయే… కాంతార సినిమా సూపర్ హిట్ తరువాత దర్శకుడు కమ్ హీరో కమ్ రైటర్ రిషబ్ శెట్టిని పలు భాషల అగ్రహీరోలు, దర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు… రమ్మని పిలిస్తే రిషబ్ రజినీకాంత్ ఇంటికి వెళ్లాడు మొన్నామధ్య…
ఆ ప్రైవేటు మీటింగుకు సంబంధించిన నాలుగు ఫోటోలను కూడా ట్వీట్ చేశాడు రిషబ్… సార్, కాంతార సినిమాకు మీ ప్రశంస మాకు అమూల్యం.., మా కృషిని మీరు ఒక్కసారి పొగిడితే మేం మీ ఇన్నేళ్ల శ్రమకు వందసార్లు పొగడాలి… అని అణకువగా, విధేయంగా, మర్యాదగా రాసుకొచ్చాడు… ఆ ఫోటోల్ని చూసిన ఫ్యాన్స్‌కు అందులో రెండు విషయాలు ప్రధానంగా కనిపించాయి…
Ads
- రిషబ్ శెట్టికి ఓ బంగారు గొలుసును రజినీకాంత్ బహూకరించాడు… తను ఇంట్లోకి వచ్చినప్పటి ఫోటోల్ని, శాలువా కప్పకముందు, శాలువా కప్పిన తరువాత ఫోటోల్ని పోల్చడం ద్వారా… (రిషబ్‌కు గోల్డ్ చెయిన్ వార్త రాసింది సోషల్ మీడియాయే…)
- రజినీకాంత్ ఇంట్లో సైడ్ టేబుల్ పైన ఓ దోమల్ని చంపే బ్యాట్ ప్లగ్ ఇన్ చేయబడి ఉంది… మరో బ్యాట్ సెంటర్ టేబుల్ కింద కనిపించింది…
అసలు రజినీకాంత్ ఇంట్లోకి ప్రవేశించేంత సాహసం చేస్తాయా దోమలు..? వాటీజ్ దిస్..? పైగా రెండు బ్యాట్లు… అని ఆశ్చర్యపోతూ కొన్ని కామెంట్లు…. హమ్మయ్య, దోమలు రజినీకాంత్ ఇంట్లో కూడా ఉన్నాయంటే, తను కూడా మనలాగే ఓ వంద రూపాయల మస్కిటో బ్యాట్ వాడుతున్నాడు అంటే పెద్ద రిలీఫ్‌గా ఉంది… దోమలు కేవలం మధ్యతరగతి బాధ అనుకున్నాం, కానీ ఆయనకే తప్పలేదు, మనమెంత..? అని కొన్ని కామెంట్లు….
అనుకుంటాం గానీ… రజినీకాంత్ అయితేనేం, చివరకు స్టాలిన్ అయితేనేం… చెన్నైలో దోమల బెడద లేని ఇల్లెవరిది..? ఎన్నిరకాల కెమికల్ ప్రొసీజర్లు, పెస్ట్ కంట్రోల్స్ చేయించినా సరే… దోమలు ఝుయ్ అంటూ ఎగురుతూనే ఉంటయ్… నిజానికి పెస్ట్ కంట్రోల్స్ ఎక్కువగా బొద్దింకలు, ఈగలు గట్రా రాకుండా ఉపయోగపడతాయి తప్ప దోమలు వాటిని కూడా నిరోధకశక్తిని సంపాదించుకున్నయ్… ఫాగింగ్, స్ప్రేలు పనిచేయడం లేదు…
నిజానికి ఇది చెన్నై సమస్య మాత్రమే కాదు, దేశంలోని ముఖ్య నగరాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి… మస్కిటో నెట్, మస్కిటో బ్యాట్, మస్కిటో హిట్ కనిపించని ఇల్లెక్కడ ఉంటుంది..? కాకపోతే అపార్ట్మెంట్లలో ఎగువ అంతస్థుల్లో ఉన్నవాళ్లకు కొంత రిలీఫ్… మొత్తానికి నెటిజనం ఆ ఫోటోలో రజినీకాంత్ ఇంట్లో మస్కిట్ బ్యాట్లను గుర్తించి భలే చర్చ పెట్టేశారు… నెటిజనుల నిశిత పరిశీలన అన్నిసార్లూ ట్రోలింగ్ వైపే దారితీయదు…!!
Share this Article