ఇది వాణిశ్రీ సినిమా . ఆమే షీరో . సినిమా అంతా ఆమే కనిపిస్తుంది . బాగా నటించింది . గ్రామంలో మంత్రసానిగా , అందరికీ తల్లో నాలికలాగా , ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ జీవించే పాత్ర . ఆ ఊళ్ళోకి టీచరుగా వచ్చిన రంగనాధ్ , ఆమె మనసులు ఇచ్చిపుచ్చుకుంటారు .
టీచర్ గారి పెళ్లి ఆ ఊరు మునుసబు గారమ్మాయితో జరగటంతో భగ్న ప్రేమికురాలు అయి , ఆ టీచర్ గారబ్బాయిని రక్షించే క్రమంలో చనిపోతుంది . బహుశా వాణిశ్రీ చనిపోవటం ప్రేక్షకులకు నచ్చి ఉండదు . భరించలేకపోయి ఉండవచ్చు .
మన రామచిలుక సినిమా తమిళంలో కమర్షియల్ గా సక్సెస్ అయిన అన్నక్కిలి సినిమాకు రీమేక్ . తమిళ సినిమాలో వాణిశ్రీ పాత్రను సుజాత , రంగనాధ్ పాత్రను శివకుమార్ పోషించారు . తమిళంలో సుజాత చనిపోవటం తెలుగులో వాణిశ్రీ చనిపోవటం ఒకటి కాదు కదా ! వాణిశ్రీని బతికించి ఆ ప్రమాదంలో ఫటాటప్ జయలక్ష్మి పాత్రను చంపి ఉంటే సినిమా సక్సెస్ అయి ఉండేదేమో ! ఐడియాలు రావాలంటే నిర్మాతకు ధన ప్రాప్తి ఉండాలిగా !
Ads
సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు చాలా చాలా శ్రావ్యంగా ఉంటాయి . పాటలను అన్నీ వేటూరి వారే వ్రాసారు . అద్భుతంగా వ్రాసారు ఎప్పటిలాగానే . ముఖ్యంగా రామచిలకా పెళ్ళికొడుకెవడే మాఘమాసం మంచిరోజు మనువాడ పెళ్ళికొడుకెవడే పాట సూపర్ హిట్ సాంగ్ . యస్ జానకి పాడింది .
సినిమాలో సముద్రాల జూనియర్ డైలాగులు కూడా చాలా బాగుంటాయి . కధను కూడా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు బాగానే నడిపించారు . నటీనటులు అందరూ చాలా బాగా నటించారు . అయిననూ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు .
వాణిశ్రీ , రంగనాధ్ , చంద్రమోహన్ , రావు గోపాలరావు , సాక్షి రంగారావు , ఫటాఫట్ జయలక్ష్మి , రాధాకుమారి , కాంతారావు , రావి కొండలరావు , మణిమాల ప్రధాన పాత్రలలో నటించారు .
సుందర్ లాల్ నహతా నిర్మించిన ఈ సినిమా ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణంలో షూట్ చేయబడింది . చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం లోని దండుమిట్ట గ్రామంలో షూటింగ్ చేయబడింది . An emotion filled musical movie . చూడబులే .
ముఖ్యంగా వాణిశ్రీ అభిమానులకు , సంగీత ప్రియులకు బాగానే నచ్చుతుంది . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . ఆసక్తి కలవారు చూడవచ్చు . రామచిలకా పెళ్ళికొడుకెవడే పాట వీడియోని మాత్రం అస్సలు మిస్ కావద్దు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article