.
రామం రాఘవం… ఈ సినిమా మీద రివ్యూయర్ల ఆసక్తి ఉండానికి కారణం… ధన్‌రాజ్… బలగం వేణుగా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ వేణు సమకాలీనుడు ధన్‌రాజ్… ఒక జబర్దస్త్ కమెడియన్ నుంచి బలగం వంటి ఎమోషనల్ సినిమా రావడం విశేషమే… సినిమాలో ఆ దమ్ముంది…
అలాగే ధన్‌రాజ్ కూడా ఓ మంచి సినిమాను ప్రజెంట్ చేశాడేమో అనేదే ఆసక్తి… తను కూడా జబర్దస్త్ కమెడియనే ఒకప్పుడు, తరువాత ఇతరత్రా కామెడీ షోలు చేశాడు, కొన్ని సినిమాలు చేశాడు… కానీ తనలో ఓ దర్శకుడున్నాడు…
Ads
ఎలాగోలా ఎవరినో ఒప్పించి దర్శకుడయ్యాడు… తను ప్రధాన పాత్రధారి… రెండు బరువులనూ మోస్తూనే బలగం అంత బెటర్ ఔట్‌పుట్ కాకపోయినా సరే, తీసిపారేయలేని ఓ సినిమాను ప్రజెంట్ చేశాడు… పాస్ మార్కులు పడ్డట్టే…
ఆమధ్య ప్రిరిలీజ్ ప్రోగ్రాంకు సుడిగాలి సుధీర్ వచ్చాడు… హాస్పిటల్‌లో ఉండి కూడా తన కోసం వచ్చాడని చెప్పాడు ధన్‌రాజ్… సుధీర్ ఎందుకు హాస్పిటల్ పాలయ్యాడు, ఏమైంది అనేది ఒక ప్రశ్న… జబర్దస్త్ మొదట్లో ధన్‌రాజ్ సుధీర్‌కు కొంత ఎంకరేజ్‌మెంట్ ఇచ్చాడనే కృతజ్ఞతతో వచ్చినట్టున్నాడు… వ్యక్తులతో సుధీర్ రిలేషన్స్ ఎప్పుడూ బాగానే ఉంటాయి…
ఈ సినిమా విషయానికి వస్తే సముద్రఖనిని తండ్రి పాత్రకు ఒప్పించడంతోనే ధన్‌రాజ్ సగం మార్కులు కొట్టేశాడు… కొడుకు పాత్రలో తను అంత పర్‌ఫెక్షన్ చూపకపోయినా సరే, సముద్రఖని నటన పలు సీన్లలో మెప్పిస్తుంది… సహజంగానే తను మంచి నటుడు, ఎమోషన్ బేస్డ్ పాత్ర దొరికాక ఇక ఆగుతాడా…?
ఓ నిజాయితీపరుడైన ప్రభుత్వ ఉద్యోగి తండ్రి… చెడబుట్టిన అల్లరి చిల్లర పాత్రలో కొడుకు… ఏదో తప్పు చేస్తే కొడుకును ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తాడు తండ్రి… దాంతో తండ్రినే హతమార్చి, ఆ బీమా సొమ్ము ప్లస్ కారుణ్య నియామకం కింద తండ్రి పోస్టు కొట్టేయాలనుకుంటాడు కొడుకు…
సరే, మొదట్లో చాలా అనాసక్తంగా, ఫక్తు ఓ రొటీన్ స్టోరీగా బాగానే విసిగించినా… చివరి అరగంట, ముప్పావుగంట ధన్‌రాజ్ దర్శకత్వం పలు సీన్లలో మెప్పిస్తుంది… ఎమోషన్ సీన్లు బాగానే వచ్చాయి… ప్రేక్షకుడు అప్పుడు కనెక్టవుతాడు… పర్లేదు… లవ్ ట్రాక్ శుద్ధ దండుగ… తెలుగు సినిమా కాబట్టి ఏదో ఓ పిచ్చి లవ్ ట్రాకైనా ఉండాలనే నియమం ఉన్నట్టుంది…
సత్యా కామెడీ జస్ట్, వోకే… పాటలు కుదరలేదు… దాని మీద ధన్‌రాజ్ దృష్టి పెట్టనట్టుంది… మిగతా నటీనటులు ఉన్నారంటే ఉన్నారు… ఎటొచ్చీ సముద్రఖని, ధన్‌రాజ్ తండ్రీకొడుకుల్లాగా గాకుండా అన్నాదమ్ముళ్లలాగా కనిపిస్తారు… కాస్త మేకప్ తేడా చూపించాల్సింది… సరే, మొత్తానికి పర్లేదు ధన్‌రాజ్… నువ్వు పాస్, ఈసారి ఫస్ట్ క్లాస్ కోసం ట్రై చేయి, ఆల్ ది బెస్ట్…
Share this Article