Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చమురు మంటల నేపథ్యంలో… నాటి రామర్ పిళ్లై బాపతు ఓ జ్ఞాపకం…

April 7, 2026 by M S R

.

Bhavanarayana Thota … రామర్ పిళ్లై హైదరాబాద్ సన్మానం వెనుక…
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య గుర్తున్నాడా? ఏ మాత్రమూ గుర్తురాని వాళ్లకైనా కరోనా మందు ఆనందయ్య అంటే కచ్చితంగా గుర్తుకొస్తాడు. కోవిడ్ రెండో వేవ్ టైమ్ లో ఆయన తన ఆయుర్వేదపు మందుతో వార్తల్లోకెక్కిన సంగతి తెలుసుగా! అందరికీ అందటం కోసం ఆన్ లైన్ లో కూడా పంపిణీ చేయటం, ఆ తరువాత కొంత మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గానికి మందు స్పాన్సర్ చేయటం కూడా చూశాం.

అలా పాపులారిటీ, డబ్బు సంపాదించిన ఆనందయ్య ఒక దశలో రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనతో వాళ్ళ కులసంఘం నాయకులతో చర్చించినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఎప్పటి కప్పుడు కొత్త వార్తల వెంటబడే మీడియా ఆ ఆనందయ్య సంగతి మరచిపోయింది. ఇలాంటి హడావిడితో పోల్చదగిన ఒక వ్యక్తి గురించి చెప్పటానికే ఈ పోస్ట్.

Ads

అప్పుడు మద్రాసు ‘వార్త’లో పనిచేస్తున్నా. 1996 వినాయక చవితి రోజు. ఆఫీసుకు కాస్త ఆలస్యంగా వెళదామనుకుంటూనే నాతోబాటు పనిచేసే ఇంకో రిపోర్టర్ బొల్లాం రాజుకు ఫోన్ చేశా. ఏమైనా ఇంపార్టెంట్ వార్తలున్నాయా అని. సెక్రటేరియట్ లో సీఎం ఆఫీసులో రామర్ పిళ్ళై తన పెట్రోల్ తయారీ డెమో ఇస్తున్నాడని, కరుణానిధి అతనికి సహాయం ప్రకటించే అవకాశం ఉందని చెప్పాడు. అతన్ని బయలుదేరమని చెప్పటంతోబాటు నేను నేరుగా వస్తున్న సంగతి కూడా చెప్పా. నేనంత హడావిడి చేయటానికి కారణం చెప్పాలంటే ఈ కథలో కాస్త వెనక్కి వెళ్ళాలి.

దక్షిణ తమిళనాడులోని మదురైకి దక్షిణాన రాజపాళయం పరిసర ప్రాంతాల్లో ఒక కుర్రాడు ఆకుల నుంచి పెట్రోల్ తయారు చేస్తున్నాడని చెప్పుకునేవాళ్ళు. బైక్ లు, స్కూటర్ల వాళ్ళు ధైర్యం చెయ్యలేదు గాని పొలాల్లో నీళ్లు పెట్టుకునే ఇంజన్ల వాళ్ళు మాత్రం నాలుగో వంతు రేటుకే దొరుకుతున్న ఈ ద్రవాన్ని కొనటం మొదలుపెట్టారు.

పదో తరగతి కూడా చదవని ఈ కుర్రాడు వారానికి వంద లీటర్ల దాకా తయారు చేయటం, ఆ చుట్టుపక్కల ఊళ్లలో అమ్మటం జరిగిపోతున్నా దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒకటీ అరా పత్రికల్లో వేసినా, సైంటిస్టులు చివాట్లు పెట్టటంతో ఆ వార్తలు కూడా ఆగిపోయాయి. అయితే, ఈ విషయం అప్పటి ప్రధానికి ముఖ్య శాస్త్రీయ సలహాదారు అబ్దుల్ కలాం గారి దృష్టికెళ్లింది. దీని ప్రాధాన్యాన్ని అంచనా వేయటానికి ఆయనకు అర సెకను కూడా పట్టలేదు. ఎంత కాదనుకున్నా, తమిళుడు అనే అభిమానం కూడా ఎక్కడో ఒక మూలన లాగుతూనే ఉంటుందిగా.

ఆయన సూచన మీద 1996లో ఢిల్లీలో ఒక ప్రదర్శన ఏర్పాటైంది. శాస్త్ర వేత్తల సమక్షంలో రామర్ పిళ్ళయ్ నీళ్ళు మరగ కాస్తూ రహస్యంగా తెచ్చుకున్న ఆకులు, ఇంకేదో పొడి అందులో వేశాడు. కాసేపటికే తన పెట్రోల్ తయారైందన్నాడు. దాన్ని ఒక టూవీలర్‌లో పోసి స్టార్ట్ చేసి నడిపి చూపాడు ….. నడిచింది. కొద్దిపాటి పొగ వచ్చింది. అయినా సరే, ప్రయోగ స్థాయిలో తప్పు పట్టాల్సినంత ఏమీ లేదన్నారు.

కొంతమంది మాత్రం ఒప్పుకోవటానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. హైడ్రో కార్బన్లు నీళ్లలో కలవటమేంటన్న బేసిక్ క్వశ్చెన్ నుంచి వాళ్ళు పక్కకు జరగటానికి ఇష్టపడటం లేదు. మరికొన్ని ప్రయోగాలతో దాని ప్యూరిటీ పెంచుతానని చెప్పటంతో అతనికి సహాయం చేయటానికి ఆ ప్రభుత్వ సంస్థ ముందుకొచ్చింది. మొత్తానికి జాతీయ స్థాయిలో రామర్ పిళ్ళై పేరు మారు మోగింది.

రెండో రోజుకే తమిళనాడు సీఎం కరుణానిధి కూడా అతణ్ని పిలిచి సన్మానం చేయాలని నిర్ణయించారు. అందుకే ఢిల్లీ నుంచి నేరుగా సెంట్ జార్జ్ ఫోర్ట్ (తమిళనాడు ప్రభుత్వ సచివాలయం ఉన్న భవన సముదాయం) చేరుకున్నాడు. అదీ ఆ సందర్భం.

ఇంత గుర్తింపు పొందాడు కాబట్టి తెలుగు వాళ్ళ కోసం ఆ వార్త బాగా కవర్ చేయాలనుకున్నాం. ఆలా వెళ్ళినప్పుడు కరుణానిధి సమక్షంలో ఇంకో డెమో, సన్మానం, అతని పరిశోధనకు అవసరమైన భూమి కేటాయింపుకి హామీ ఇవ్వటం కూడా .. చక చకా జరిగిపోయాయి. రామర్, అతని పెంపుడు తల్లిదండ్రులు, వాళ్ళ కూతురు ఒక బృందంగా అక్కడికి దగ్గరలో చేపాక్ క్రికెట్ స్టేడియం పక్కనే ఉన్న గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కు బయలుదేరారు.

నేనూ బొల్లం రాజు కూడా వాళ్ళను అనుసరిస్తూ గెస్ట్ హౌస్ కి వెళ్లి చిన్నపాటి ఇంటర్వ్యూ చేశాం. మేం బయలు దేరుతున్నప్పుడే వాళ్ళు కూడా సర్దుకొని రైల్వే స్టేషన్ కి బయలుదేరారు. మేం ఆఫీసుకొచ్చి వార్త, ఇంటర్వ్యూ విడివిడిగా పంపాం.

ఐదు నిమిషాలు గడవక ముందే ఎడిటర్ ఏబీకే గారూ, ఎండీ గిరీష్ సంఘీ లైన్లోకి వచ్చారు. మోడెమ్ లో మాట్లాడటం అప్పట్లో అలవాటే. ఆ వార్తకు ఏబీకే గారు చాలా ప్రాధాన్యమిస్తున్నట్టు అర్థమైంది. సంఘీ గారు ఆసక్తి చూపటం నాకార్థం కాలేదు. ఆయన హడావిడిగా నా మీద ఒక బాధ్యత పెట్టారు. అదేంటంటే, రామర్ ను వార్త తరఫున సన్మానానికి ఒప్పించి హైదరాబాద్ తీసుకు రావాలి. అది కూడా వీలైనంత త్వరగా జరగాలని చెప్పారు.

అతికష్టం మీద అదే రాత్రికి ట్రెయిన్ కి టికెట్ సంపాదించుకొని రాజపాళయం బయలుదేరా. ఈలోపు అక్కడి దినమణి (ఇండియన్ ఎక్స్ ప్రెస్ తమిళ పత్రిక) రిపోర్టర్ రామకృష్ణతో మాట్లాడి నా పని గురించి చెప్పా. అదేమంత పెద్ద పని కాదన్నాడు. మాట్లాడిస్తానని చెప్పటంతో ధైర్యంగా రైలెక్కా.

ఉదయం స్టేషన్లో రిసీవ్ చేసుకొని ఆర్ & బి గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళాడు. ఆ రోజు రాత్రికి అక్కడికి దగ్గరలో ఉన్న శ్రీవిల్లిపుత్తూరులో రామర్ పిళ్ళైని కలెక్టర్ సన్మానిస్తున్నాడని, అక్కడే తనతో మాట్లాడదామని చెప్పి గంటలో మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు రామకృష్ణ. కచ్చితంగా గంటకల్లా వచ్చి రాజపాళయంలో స్థిరపడ్డ తెలుగు రాజులను పరిచయం చేస్తానన్నాడు.

అక్కడికెళితే వాళ్ళు మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఏళ్ల తరబడి దూరంగా ఉన్న చుట్టాన్ని చూస్తున్నట్టుంది వాళ్ళ తీరు. కూడబలుక్కొని తెలుగులో మాట్లాడ్డమే కాదు.. మనం వాడటం మానేసిన చాలా మాటలు వాళ్ళ సంభాషణల్లో దొర్లాయి. నేను ఊహించలేనంత ఆప్యాయత చూపించటంతో బాటు అద్భుతమైన భోజనం పెట్టారు.

వాళ్ళందరూ అక్కడ సిమెంట్, టెక్స్ టైల్స్ వ్యాపారాల్లో బాగా స్థిరపడ్డవాళ్ళే. సాయంత్రం పెందలాడే శ్రీవిల్లిపుత్తూరు బయల్దేరదీశాడు రామకృష్ణ. అక్కడ ఆండాళ్ గుడి చూపించి ఆ తరువాత నన్ను ఆ సన్మానం జరుగుతున్న ఆడిటోరియం దగ్గరికి తీసుకెళ్ళాడు. రామర్ పిళ్ళయ్ తోబాటు కలెక్టర్ ను కూడా పరిచయం చేశాడు.

ఆ ప్రోగ్రామ్ ఇంకా మొదలు కాలేదు. నేను వచ్చిన విషయం కలెక్టర్ సమక్షంలోనే రామర్ కి చెప్పాడు. హైదరాబాద్ రావటానికి రామర్ పిళ్ళై ఒప్పుకున్నాడు. మరుసటి రోజు వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నాడు. ఎలాగూ వార్త సండే కోసం ఒక స్టోరీ చేద్దామన్న ఆలోచన ఉంది కాబట్టి సరేనని చెప్పి వచ్చేశాం. మరుసటి రోజు 10 గంటలకల్లా బయలుదేరాం.

ఇడయాంకుళం అనే ఊళ్ళోకి వెళ్లబోతుంటే GRADUATES VILLAGE అనే బోర్డు కనబడింది. అదేంటని రామకృష్ణను అడిగితే ఆ ఊళ్ళో కనీసం ఇంటికో గ్రాడ్యుయేట్ ఉంటాడని, అందుకే గర్వంగా అల్ బోర్డు పెట్టుకున్నారని చెప్పాడు. మరి రామర్ పిళ్లై ఎనిమిదో తరగతి వరకే చదివాడు కదా అని అడిగితే ఆ ఊరికి దత్తత మీద వచ్చినట్టు చెప్పాడు.

రామర్ పిళ్లైని ఆ ఇంట్లో వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు. ఒక గది అతని లాబ్. దగ్గర్లో ఉన్న చిన్నపాటి అడవి నుంచి మూలికలు సేకరించి తెచ్చుకుంటానని చెప్పాడు. అక్కడే ఒక గోతాం చూపించాడు తప్ప ఆకులు కనబడనివ్వలేదు. తన గురించి, తన పరిశోధన గురించి చెప్పాడు. దాదాపుగా అవే విషయాలు మద్రాసు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. కాకపోతే ఇక్కడ ప్రత్యక్షంగా చూడగలిగా. అతడి జీవిత విశేషాలు మొదలుకొని ఇది కనిపెట్టటంలో కృషి దాకా అడిగి అన్నీ నోట్ చేసుకున్నా.

‘వార్త’ గురించి అడిగాడు. తెలుగులో సెకండ్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ అని, సంఘీ గ్రూప్ గురించి కూడా చెప్పాక అతను హైదరాబాద్ వచ్చే తేదీ కన్ఫర్మ్ చేశాడు. మాట్లాడుతూనే భోజనం ముగించి బయలుదేరాం. సాయంత్రం రాజపాళయంలో రైలెక్కటానికి ముందే గిరీష్ సంఘీకి ఫోన్ చేసి ఏ రోజు వస్తున్నాడో, వెంట ఎంతమంది ఉంటారో వివరాలు చెప్పా. టికెట్స్ బుకింగ్ లాంటి పనులన్నీ అప్పటికప్పుడే మద్రాసులో ఉండే సంఘీ టెక్స్ టైల్స్ ప్రతినిధికి అప్పజెప్పారాయన. సండే సప్లిమెంట్ కోసం ఫీచర్ పంపితే, అప్పటి దాకా ఆగలేక డెయిలీలోనే అరపేజీకి పైగా పరిచేశారు.

మొత్తానికి రామర్ పిళ్ళై హైదరాబాద్ రానే వచ్చాడు. అప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. భారతీయ విద్యాభవన్ లో డెమో ఏర్పాటైంది. గవర్నర్ కృష్ణకాంత్ వచ్చారు. IICT (తార్నాక) సైంటిస్టులు సహా చాలామంది ఈ చోద్యం దగ్గరగా చూడాలనుకున్నారు. అందరికీ అతనొక మెజీషియన్ లాగా కనబడుతున్నాడు.

ఒక పాత్రలో నీళ్ళు పోసాడు. కొన్ని ఆకులు మరగబెట్టాడు. ఇంకేదో పొడి వేశాడు. ఇరవై నిమిషాల తరువాత వడకట్టి ఆ ద్రావణాన్నే తన మూలికా పెట్రోల్ గా చెప్పాడు. అక్కడే సిద్ధంగా ఉంచిన టూవీలర్‌లో పోసి నడిపారు. రామర్ విజయగర్వంతో చూస్తుండగా అతణ్ణి ప్రశ్నలడిగే అవకాశం ఇచ్చారు. స్టేజ్ ముందు కూర్చున్న సైంటిస్టులు అడుగుతూ ఉంటే రామర్ జవాబులిచ్చాడు. నాది దుబాసీ పాత్ర. సైంటిస్టులు సంతృప్తి చెందలేదు. కానీ అక్కడ మూడ్ చెడిపోకుండా గిరీష్ సంఘీ హడావిడిగా సన్మానం, 50 వేల నగదు బహుమతి గవర్నర్ చేతులమీదుగా ఇప్పించి ముగించారు.

అక్కడి నుంచి సీన్ వార్త ఆఫీసుకి మారింది. అక్కడే భోజనాలయ్యాక ఏబీకే గారు ఎడిటోరియల్ మొదలుపెట్టారు. విమెన్స్ స్పెషల్ ‘చెలి’ పేజ్ చూసేవాళ్ళు అతనికి సహకారం అందించే యువతిని ఇంటర్వ్యూ చేయటం మొదలుపెట్టారు. మళ్ళీ నాదే దుబాసీ పాత్ర.

ఆ రోజు రాత్రికి సంఘీనగర్ లో రామర్ పిళ్లై గౌరవార్థం డిన్నర్ ఏర్పాటైంది. సంఘీ టెక్స్ టైల్స్ లో పనిచేసే ఒక మహిళకు తమిళం తెలుసుకాబట్టి నేను రానవసరం లేదని గిరీష్ సంఘీ సహాయకుడు ఉపేంద్ర, (ఇప్పుడు టి న్యూస్ లో ఉన్నారు) చాలా మర్యాదగానే నా చెవిన వేశాడు. అప్పటికే నా కోసం వచ్చిన మిత్రుడు వాళ్ళింటికి రమ్మని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాని నేను ఈ మాటతో అతనికే వోటేసి వెళ్ళిపోయా.

  • ఆ రాత్రికి అక్కడ జరిగింది కేవలం విందు కాదు. రామర్ పిళ్ళైతో చాలా ముఖ్యమైన ఒప్పందం. అతడు చెప్పే మొక్కలు సంఘీనగర్ భూముల్లోనే పెంచి ఒక పెట్రోల్ యూనిట్ అక్కడే పెట్టటం. Proof of Concept పూర్తయ్యాక భారీగా పెట్రోల్ తయారీ చేయటం.. ఆ విధంగా ప్రపంచాన్ని ఏలటం… ఇదీ ఆ ఒప్పందం లక్ష్యం.

అందరూ రామర్ పిళ్ళైని మెచ్చుకోవటానికే పరిమితమైన సమయంలో గిరీష్ సంఘీలోని వ్యాపారి ఎంత బాగా ఆలోచించాడో, ఎంత బాగా రామర్ పిళ్ళైని తన పెరట్లో కట్టేసుకున్నాడో అర్థమైనప్పుడు ఆశ్చర్యపోక తప్పలేదు. ఈ సత్కారం వెనుక ఆయన అసలు ఆలోచనను మెచ్చుకోకుండా ఉండలేం. నేను రానక్కరలేదని చెప్పించటానికి కారణం అప్పటికి గాని నాకర్థం కాలేదు.

అప్పటి నుంచి రామర్ పిళ్ళై జీవితం మారిపోయింది. ఆ రోజుల్లోనే మినరల్ వాటర్ తప్ప మామూలు నీళ్ళు తాగేవాడు కాదు. మద్రాసులో ఉన్న సంఘీ టెక్స్ టైల్స్ మేనేజర్ ఫుల్ టైమ్ జాబ్ రామర్ పిళ్లై బాగోగులు చూసుకోవటమే. షాపింగ్ ఖర్చంతా సంఘీ ఖాతాలోనే. రామర్ పిళ్లై రైలెక్కటం మానేశాడు. కార్లు, విమానాలే.

అనుక్షణం అతడి కదలికల మీద నిఘా ఉండేది. ఏది కావాలన్నా క్షణంలో అమర్చే బాధ్యత సంఘీ మేనేజర్ దే. సంఘీతో రామర్ పిళ్ళైకి ఒప్పందం కుదిరిందన్న వార్త తమిళనాడు అంతటా పాకింది. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారులు అసూయపడ్డారు. ఆ సంగతులు తెలిసే కొద్దీ పాదరసం లాంటి గిరీష్ సంఘీ బుర్రను మరింత మెచ్చుకోవాల్సి వచ్చింది. ( ఆ తరువాత ఏం జరిగిందో .. గిరీష్ సంఘీ లెక్క ఎక్కడ తప్పిందో ఇంకో పోస్ట్ లో ) – తోట భావనారాయణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చమురు మంటల నేపథ్యంలో… నాటి రామర్ పిళ్లై బాపతు ఓ జ్ఞాపకం…
  • యోగీ, హిమంత ‘బుల్‌డోజర్’ బాటలో… బెంగాలీ సువేందు అధికారి…
  • రాజకీయ విమర్శల్లో ఘాటు వోకే… కానీ జాతుల్ని కించపరచడం దేనికి..?
  • ప్రళయ్..! ఇక ప్రేక్షకులందరి చూపూ ఈ కొత్త సినిమాపైనే..!
  • ఇరాన్‌లో చిక్కుకున్న అమెరికన్ పైలట్‌ను కాపాడింది ఇదేనా..?!
  • ఏడేళ్ల ‘బాలీవుడ్ బాద్‌షా’ పీఠానికి ఎసరు..! తొలిసారి రణబీర్‌కు కిరీటం..!
  • కొబ్బరి బొండాం..! అప్పట్లో కామెడీ హీరో అంటే ఓన్లీ రాజేంద్ర ప్రసాద్..!
  • అర్చకుల విదేశీ ప్రయాణాలు నిషిద్ధమా..? శృంగేరీ చెప్పిందే ఆగమమా..?!
  • అసెంబ్లీ నక్సలైట్..! ముందస్తు జాగ్రత్తగా ఉపా కేసు వర్తిస్తుందా యువరానర్..!!
  • అన్నదాత చెమట చుక్కకు తెలుసు మెతుకు విలువ… అవమానించకండి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions