నిన్నో మొన్నో కదా అనుకున్నది… సినిమా హీరో ఎవరైనా సరే… సీనియర్లు, జూనియర్లు తేడా లేదు… వచ్చిన సినిమా వచ్చినట్టు ఫట్ అని పేలిపోతోంది… థియేటర్ల వైపు వెళ్లడానికి జనం చీదరించుకుంటున్నారు… ఎస్, టికెట్ రేట్లు, క్యాంటీన్ రేట్లు, పార్కింగ్ రేట్లు, వచ్చీపోయే టైమ్, మనీ, పొల్యూషన్ అన్నీ కారణాలే కావచ్చుగాక… కానీ అసలు కారణం, తెలుగు సినిమా పంథా మారకపోవడం… అదే చెత్తా హీరోయిజం…
ఓ దిక్కుమాలిన చిన్న పాయింట్ తీసుకుని, దానిచుట్టూ హీరోయిజం కాలర్ మాసిపోకుండా, చొక్కా మడత నలగకుండా ఓ పిచ్చి కథనాన్ని బిల్డప్ చేయడం… ఇంకెన్నాళ్లు..? అందుకే పోతినేని రాము, గోపీచందు, వరుణ తేజ, చిరంజీవి, నాగ చైతన్య ఎట్సెట్రా అందరి సినిమాలు తన్నేశాయి ఈమధ్య… మహేష్, వెంకటేష్ చావుతప్పి కన్నులొట్టబోయింది… మరో ముగ్గురు నలుగురికీ ఈ వాతలు తప్పవని అనుకుంటున్నదే కదా…
ఈసారి వంతు అలాంటి పిచ్చి హీరోయిజానికి అడ్రస్‌గా మారిన రవితేజ… సినిమా పేరు రామారావు ఆన్ డ్యూటీ… కారణం సేమ్… అదే ఫార్ములా, అదే బిల్డప్, అదే రొటీన్, అదే వాసన, అదే టేస్టు… ఎస్, ఈ ఫలితం సరైనదే… ఈమధ్య తెలుగు ప్రేక్షకుడికి పిచ్చి క్లారిటీ వచ్చింది… ఏది థియేటర్‌లో చూడాలి, ఏది వదిలేయాలి, ఏది ఓటీటీలో చూడాలి… పర్‌ఫెక్ట్ జడ్జిమెంట్… ఈ రామారావు ఓటీటీకి కూడా పనికిరాడు…
Ads
నిజానికి మన దర్శకనిర్మాతలు ప్లస్ దైవాంశ సంభూతులైన హీరోల పైత్యమే ఈ సంక్షోభానికి కారణం… హీరోయిజం లుక్కులో, ఫైట్లలో, డాన్సుల్లో, బీభత్సమైన బిల్డప్పులో రాదు… ప్రేక్షకుడికి అక్కరలేదు… ఉదాహరణకు రంగస్థలం… హీరో బేకార్ లుక్కు, పైగా సౌండ్ ఇంజనీర్… మొహంపై పౌడర్ కూడా చల్లి ఉండరు… కానీ కథనంలో వైవిధ్యం, హిట్ పాటలు, కొత్త క్లైమాక్స్ పాయింట్ ఎట్సెట్రా సినిమాను సూపర్ హిట్ చేశాయి… సేమ్, పుష్ప… రఫ్ లుక్కు, కలపదొంగ, ఈడుస్తూ నడుస్తాడు… రొటీన్ డాన్సులు కూడా చేయడు హీరో… కానీ ఖతర్నాక్ ట్రీట్‌మెంట్‌తో బంపర్ హిట్…
రామారావు ఆన్ డ్యూటీలో ఏం చేస్తాడు..? అవే ఫైట్లు చేస్తాడు… హీరో కదా… కేంద్రంలో కేబినెట్ సెక్రెటరీ పాత్ర ఇచ్చినా సరే తెలుగు హీరో రౌడీలతో బజారు ఫైటింగులు చేయాల్సిందే… పైగా ఇద్దరు హీరోయిన్లు దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్… ఎందుకున్నారో తెలియదు… ఒకప్పటి తెలుగు నటుడు వేణు రీఎంట్రీ… రిలీజుకు ముందు హైపు… తీరా చూస్తే సినిమాలో అంత సీను లేదు…
పాటలు థియేటర్ వదిలాక గుర్తే ఉండవు… కథనం ఎటెటో తిరిగి మంగుళూరు మీదుగా శేషాచలం అడవుల్లోకి వస్తుంది… పైగా ఓ డిప్యూటీ కలెక్టర్ ఏమిటో… ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏమిటో… ఈ యాక్షన్ సీన్లు ఏమిటో… నడుమ ఓ మసాలా సాంగ్ ఏమిటో… ఏమైనా వీసమెత్తు వైవిధ్యం కనిపించదు… మనం పదే పదే చెప్పుకున్నదే… బేస్ కథ మంచిదే కావచ్చుగాక… కానీ దాన్ని ప్రజెంట్ చేసే విధానంతోనే సినిమా హిట్టా ఫట్టా అని తేలేది…
అదే రవితేజ… అదే మ్యానరిజం… పదేళ్లుగా చూసీచూసీ జనానికి బోర్ కొట్టేసింది… ఐనా ఎవడో నిర్మాత దొరుకుతూనే ఉంటాడు… రవితేజ జనం మీదకు వదులుతూనే ఉంటాడు… కొన్నిచోట్ల మార్నింగ్ షోలకు కూడా జనం థియేటర్లలో నిండలేదు అంటే రవితేజ మరోసారి తన కెరీర్ ఏమిటో సమీక్షించుకోవాల్సిన అగత్యం ఏర్పడినట్టే… లేకపోతే… ఒక నేలటికెట్టు… ఒక డిస్కో రాజా… ఒక ఖిలాడీ… ఒక రామారావు ఆన్ డ్యూటీ… ఇక ఇంతే…
చివరగా :: ఓ మిత్రుడు రామారావు ఆన్ డ్యూటీకి షార్ట్ ఫామ్ చెప్పాడు… ROD… నిజమే… రాడ్డే…!!
Share this Article