సాక్షి జగన్‌కు బలమా..? బలహీనతా..? ఇది ఓ సంక్లిష్టమైన ప్రశ్న… దాన్నలా వదిలేస్తే తను దారుణంగా ఫెయిలైన వెంచరా..? కాదా..? ఇదీ కాస్త జవాబు కష్టసాధ్యమైన ప్రశ్నే… కొన్ని ప్రయోజనాలు విజిబుల్ కావు, రొటీన్ లాభనష్టాల లెక్కల్లోకి రావు కాబట్టి..! కానీ, ఒకటి మాత్రం నిజం… ఏ ఈనాడును కొట్టాలనే లక్ష్యంతో మొదలైందో ఆ గోల్ సాధనలో అడ్డంగా ఫెయిలైంది… జస్ట్, ఓ పార్టీ కరపత్రికగా ఉనికిలో ఉంది అంతే… ఆ పాత సంగతులు వదిలేస్తే, తాజాగా ఏమిటి అంటారా..? అధికారంలో ఉన్నాం, డబ్బుకు కొదవేముంది అనుకుని నేలను విడిచి ఆకాశంలో తిరగడం స్టార్ట్ చేసింది… నష్టాలు నషాళానికి అంటి, నాన్ స్టాప్ తుమ్ములు దగ్గులు స్టార్టయ్యేసరికి… తత్వం బోధపడేసరికి… హఠాత్తుగా నేలమీదికి దిగి గింగరాలు తిరుగుతోంది… పోనీ, ఇప్పటికైనా సరైన దోవలో తన నొప్పిని తగ్గించుకునే పనిలో పడిందా అంటే అదీ లేదు… సేమ్, ఇన్నాళ్లు ఏ పాలసీ ఫెయిల్యూర్స్ దాన్ని ముంచాయో… ఈరోజుకూ అదే… జగన్‌కు అర్థం కానిదీ అదే… సాక్షి పెద్దలు జగన్‌కు అర్థం కానివ్వని అంశమూ అదే…
ఎడాపెడా ప్రభుత్వ యాడ్స్ వస్తున్నయ్… కోట్లకుకోట్లు వచ్చిపడుతున్నయ్… ఇంకేముంది..? మొన్నమొన్నటిదాకా ఎక్కువ పేజీలు, టాబ్లాయిడ్లు గట్రా నడిచాయి… తరువాత కళ్లుతెరిచి ఈమధ్యే పది పేజీలకు కుదించేసి, మిగతా కంటెంటు అంతా డిజిటల్ ఫార్మాట్లోకి మార్చేసింది… నెట్లో చదువుకోవాలి, అంతే… సేమ్, ఈనాడు బాట… అది చాలారోజుల క్రితమే చేసింది ఈ పని… ఎంతైనా రామోజీరావు చూపిన బాటలోనే కదా ఏ పత్రికైనా నడవాల్సింది… సాక్షి అయినా సరే… ఏ ఈనాడును టార్గెట్ చేసి ప్రారంభింపబడిందో, అదే ఈనాడును దిక్కులేక అనుసరిస్తూ…!! ఈనాడు టాబ్లాయిడ్లను ఎప్పుడో తీసిపారేసింది… సాక్షి గొప్పలకు పోయి, టాబ్లాయిడ్లతో మస్తు సర్క్యులేషన్ సాధిస్తానని తప్పుడు కలలు గని, చేతులు, మూతులు కాల్చుకుని, తాజాగా వాటిని తీసేసి, మెయిన్ పేజీలో కలిపేసింది… సేమ్, ఈనాడు బాట… (టాబ్లాయిడ్ల అసలు దెబ్బ ఇంకా నమస్తే తెలంగాణకు తగల్లేదు, బాకీ ఉంది, దాని సర్క్యులేషన్ కలలూ భగ్నమయ్యాక గానీ అసలు తత్వం బోధపడదు…)
Ads
లేఆఫ్ పద్ధతిలో ఉద్యోగుల ఉసురు పోసుకుంటూ ఈనాడు జీతాల కోతను ఏనాటి నుంచో అమలు చేస్తోంది… ఇక సాక్షి కూడా అదే బాట… వంద మంది దాకా తీసేసే కసరత్తులో పడింది… ఆల్రెడీ ఉద్యోగులకు చెప్పేశారని నిన్నటి సోషల్ మీడియా ప్రచారం… కాదు, ఇంకా తుదినిర్ణయం జరగలేదు, కానీ ఇక తప్పదు అనేది ఆంతరంగిక సమాచారం… ఇక్కడ మళ్లీ జగన్ ఫెయిల్యూర్ ఏమిటో చూద్దాం…
- సపోజ్, ఒక స్టాఫ్ రిపోర్టర్‌ను కాస్ట్ కటింగులో తీసేయాలి అనుకున్నారు… కానీ చేస్తున్నదేమిటి..? తనను రెగ్యులర్ ఉద్యోగుల రోల్స్ నుంచి తీసేసి, ఏ ఆర్సీ సెంటర్ ఇన్చార్జిగానో కంటిన్యూ చేస్తారు… అంటే సేవింగ్ కాసింతే… అలాగే ఒక సబ్ఎడిటర్ను తీసేస్తారూ అనుకుందాం… సాక్షిలో ఇచ్చేదే తక్కువ జీతాలు… ఇలా వంద మందిని తీసేస్తే మిగిలేది ఎంత..? ఈమాత్రం దానికి జగన్ బదనాం అయ్యేది ఎంత..?
- ఒకవైపు ఏపీలో వేలకువేల కోట్లు అప్పులు తెచ్చి మరీ.., అడగకపోయినా జనం నోళ్లలో రకరకాల సంక్షేమ పథకాలు కుక్కుతున్నవేళ… ఈ వందమంది తలలు తెగనరకాలా..? జగన్ తత్వానికే వ్యతిరేకం ఇది… నిజానికి సాక్షి పెద్దలు ‘‘మరే ఇతర సమర్థ పనితీరు’’ చూపించలేక, ఇది జగన్ మీద రుద్దుతున్నారు…
- వాస్తవంగా సంస్థకు పెనుభారంగా మారి, భారీగా జీతాలు తీసుకుని, నిరర్థక ఆస్తులుగా మారిన నలుగురైదుగురు పెద్దల్ని తొలగించుకుంటే చాలు… ఈ వంద మందినీ తీసేయాల్సిన అవసరం లేదు… కానీ జగన్‌కు అదెవరు చెప్పాలి..? చెప్పనివ్వరు… (కొందరిని రీసెంటుగా అటూఇటూ బదిలీ చేశారు, దాని మీద నెగెటివ్‌గా సోషల్ మీడియాలో ఏదేదో రాయిస్తున్నారెవరో… కానీ ఏ సంస్థలోనైనా అవి సహజం, ప్రతి బదిలీ వెనుక ఓ రీజన్ ఉంటుంది, దానిపై గాయిగత్తర వేస్ట్)
అప్పట్లో దీన్ని ఉద్దరించడానికి ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కదాని ఓ దైనిక భాస్కరుడిని తెచ్చారు… ఫ్లాప్… ఒకావిడకు మొత్తం హెచ్ఆర్ బాధ్యతలు అప్పగించి, కొరడా ఇచ్చారు… తుస్… తరువాత ఓ పెద్ద రెడ్డి గారిని తీసుకొచ్చి, ఇక మొత్తం నీదే బాధ్యత… కృష్ణాలో ముంచుతావో, గోదావరిలో తేల్చుతావో, నీ దయ, మా ప్రాప్తం అన్నారు… ప్చ్… ఎక్కడో ఏదో భారీ తేడా ఉంది… నిర్దాక్షిణ్యంగా నిరర్థక ఆస్తుల్ని వదిలించుకోలేని అసహాయత, మొహమాటంలో ఉంది ఆ తప్పు… జగనన్నా… టీకూపన్ల దగ్గర ఆదాలు, చిరుద్యోగులపై కత్తులు కాదు… కాలసర్పాల్లా చుట్టేసి, సాక్షిని వదలని కొన్ని పెద్ద తలకాయలపై దృష్టి పెట్టు… ఖర్చు ఆదా చేసి, ఆదాయం పెంచే బోలెడు మార్గాలు దొరుకుతాయ్ చూడు… ఈ వందమంది జీవితాల ఉసురు పోసుకోనక్కర్లేదు… గ్యారంటీ…! ప్రతి విషయంలోనూ రామోజీరావు బాటే కరెక్టనే భ్రమ నుంచి బయటపడాలన్నా…!!
Share this Article