Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రామోజీరావు… ఆ పేరే ఓ విశేషణం… వేరే ఏ విశేషణాలు దేనికి..?

June 8, 2024 by M S R

అక్షరమథనంలో పుట్టే అమృతాన్ని అస్మదీయులకు, హాలాహలం తస్మదీయులకు ఇచ్చి, తాను మంధరుడిలా మిగిలాడు… రామోజీరావుపై ఓ నెటిజన్ వ్యాఖ్య ఇది… (మంధరుడి కథ తెలిసినవాళ్లకు దీని అర్థం సరిగ్గా బోధపడుతుంది)… మరో మిత్రుడి వ్యాఖ్య మరింత ఆప్ట్… రామోజీరావు గురించి రాయడానికి ఏమేం విశేషణాలున్నాయో వెతికాను, కాసేపటికి వెలిగింది, అసలు రామోజీరావు పేరే ఓ విశేషణం కదా, కొత్తగా ఇంకేం యాడ్ చేయాలి అని…

నిజమే, తన గురించి రాస్తూ పోతే పేజీలు సరిపోవు, స్పేస్ సరిపోదు… నెగెటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు… తనది తెలుగు జాతి చరిత్రలో ఓ పేజీ… అతిశయోక్తి కాదు… కొన్నేళ్లపాటు రామోజీ ఆలోచనలు, ఆకాంక్షలు, అడుగులే తెలుగు జాతి అడుగులుగా, ఆలోచనలుగా, ఆకాంక్షలుగా చెలామణీ అయ్యాయి… అదీ రామోజీరావు అంటే… ఎక్కడో కృష్ణా జిల్లాలో ఓ రైతు కుటుంబంలో పుట్టి, ఓ యాడ్ ఏజెన్సీలో చిరుద్యోగిగా మొదలైన ఆయన జీవితం ఈ పద్మవిభూషణ స్థితికి రావడం వెనుక ఏ పెద్ద ప్రస్థానమే ఉంది… కేంద్ర హోం మంత్రి, ముఖ్యమంత్రులు సహా పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఆయన్ని దర్శించుకుని, ఆయన ఎదుట వినయంగా కూర్చున్న దృశ్యాలే అనేకం…

ramoji

Ads

మోడీ మొదటి ప్రమాణస్వీకారం గుర్తుంది కదా… చంద్రబాబు ఎక్కడో నాలుగో వరుసలోనో అనామకంగా కూర్చుని ఉంటే రామోజీరావు మొదటి వరుసలో… న్యాయమూర్తులు, ఇతర వీవీవీఐపీ ప్రముఖుల్లాగే తన వాహనానికి దగ్గర దాకా ప్రవేశం… దటీజ్ రామోజీరావు… మొదటి వాక్యాల్లోనే చెప్పుకున్నట్టు తన జీవితానికి నెగెటివ్ కోణం లేదా..? ఎందుకు లేదు..? ఖచ్చితంగా ఉంది… మనకు నచ్చినా నచ్చకపోయినా తను అనుకున్న తోవలో తలెత్తుకుని, ఇంకెవరూ సాటిరారు అన్న రీతిలో సాగిపోయి, తనకంటూ ఓ చరిత్ర లిఖించుకోవడమే రామోజీరావు జీవితవిశేషం…

ramoji

కేవలం మీడియా మొఘల్, అక్షరయోధుడు అని రాస్తున్నారు గానీ… నిజానికి తన జీవితంలో ఈనాడు ఓ పార్ట్, అంతే… కాకపోతే తన విస్తరణకు ఈనాడు ఉపయోగపడి ఉండవచ్చుగాక… తను మంచి వ్యాపారి, తను జర్నలిస్టు, తను ఇన్‌ఫ్లుయెన్సర్, తను కింగ్ మేకర్, తను సినిమా నిర్మాత… ఏది కాదు..? ఏం తక్కువ..?

ramoji

తను ఉండటానికి ఓ దుర్బేధ్యమైన రాచకోట… చుట్టూరా ఉద్యానవనాలు… లక్షల కోట్ల సంపద… ఉద్యోగులు… కలవడానికి వచ్చే విశేష ప్రముఖులు… పద్మభూషణ్… తను పలకరిస్తే, తనతో సెల్ఫీ దిగితే, తనతో భేటీ అయితే జన్మధన్యం అయినట్టు భావించే లక్షల స్వజనం… చాలామందికి తనంటే పడదు, చాలామందికి నచ్చని పనులూ, ఆయన స్థాయికి తగని పనులూ ఆయన ఖాతాలో ఉన్నయ్… ఐతేనేం, తను నిర్నిరోధంగానే తన బాటలో తను ఎప్పటికప్పుడు ఎదుగుతూ సాగిపోవడమే కదా జీవన సార్థకత… అలా సార్థకజీవనం రామోజీరావుది…

rfc2

చాలామంది జాతకంలో ఈ తరహా మహర్దశ కనిపించదు… కానీ తను దేవుడినీ, జాతకాల్నీ నమ్మడు… తనది ఓ విశిష్టమైన శైలి… పదీఇరవై ఏళ్ల తరువాత ఎలా ఉండబోతుందో అంచనా వేస్తాడు, అటువైపు ఇప్పటి నుంచే అడుగులు వేస్తాడు, అదీ తన విజయరహస్యం… ఏ రంగంలో ఉన్నాసరే, ఆక్కడ పాతుకుపోయిన ఛాందస సంప్రదాయ రీతులను మొదట బద్ధలు కొడతాడు, ధిక్కరిస్తాడు, తలెగరేసి దూకుడుగా వెళ్తాడు…

rfc1

ఈనాడే తీసుకొండి… తను వచ్చిన కొత్తలో సంప్రదాయ రచన శైలి, పామరులకు అంతుపట్టని భాష… బద్ధలు కొట్టాడు… వ్యవహార భాషలోకి వచ్చింది పాత్రికేయం… కొత్త టెక్నాలజీ, తెల్లారేసరికి ఇంటి ముందు పత్రిక, ఆకట్టుకునే శీర్షికలు, వార్తారచనలో కొత్త పుంతలు, విస్తారమైన నెట్‌వర్క్, ఈరోజు వార్త రేపటి పత్రికలో కనిపించాల్సిందే… సినిమా నిర్మాతగా కూడా అంతే కదా… ఒక ప్రతిఘటన, ఒక మయూరి, ఒక మౌనపోరాటం, ఒక అశ్విని… అన్నీ యథార్ధ గాథలే… చిన్న చిన్న వార్తల్ని పట్టుకుని, ప్రత్యేకంగా రాయించి, స్పూర్తిదాయకంగా సినిమాలుగా మలిచినవే కదా… చివరకు ప్రియ పచ్చళ్లు కూడా ఓ సక్సెస్ స్టోరీయే కదా…

ramoji

ఐతే అడుగుపెట్టినవన్నీ విజయాలేనా..? కాదు… ఒక న్యూస్‌టైమ్, కాలగతిలో అస్తమించిన సితార, విపుల… ఫిలిమ్ సిటీ కూడా అంత జోష్‌తో నడుస్తున్న ప్రాజెక్టేమీ కాదు, ఉషాకిరణ్ మూవీస్, మయూరి డిస్ట్రిబ్యూటర్స్ వంటివి షట్ డౌన్… సోమా కూల్‌డ్రింక్… ఇలా అనేకం… కానీ తనను నిలబెట్టినవీ, పడిపోకుండా కాపాడినవీ మార్గదర్శి, ఈనాడు… అవీ ఒడిదొడుకుల్లో ఉన్నవే… రిలయెన్స్ ముఖేషుడి భాగస్వామ్యం ఎంతో తెలియదు గానీ… ఇన్నేళ్లు తన విశాల ఆర్థిక, ప్రభావశీల సామ్రాజ్యాన్ని తన నేతృత్వంలో కాపాడుకోగలిగాడు… ఇకపై తన సామ్రాజ్యం ఏమిటనేది అతి పెద్ద ప్రశ్న..!! ముందే చెప్పాను కదా, రాస్తూ పోతే తరగదనీ, ఒడవదనీ… ఆ సముద్రం ఒడ్డున నేనూ ఆల్చిప్పలు, గవ్వలు ఏరుకున్నవాడినే… ఆయనకు నా ఘన నివాళి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions