Nancharaiah Merugumala….. వంగవీటి రంగా హత్యానంతరం జరిగిన బెజవాడ అల్లర్లు అప్పట్లో కొందరు హైదరాబాద్ తెలుగు జర్నలిస్టులకు ‘పోస్టుమాడ్రన్ హింస’గా కనిపించాయి!
………………………………………………..
బెజవాడ నుంచి, కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చేసి పాతికేళ్ళు దాటిపోయినా 1988 డిసెంబర్ 26 నాటి ‘రంగా గారి యాజిటేషన్’ మాలాంటి ఆంధ్రోళ్లను ఇంకా వెంటాడుతూనే ఉంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కాటూరులో పుట్టాడని చెప్పే వంగవీటి మోహనరంగారావు గారిని తెలుగు జనం మర్చిపోకుండా గత కొన్నేళ్లుగా యూట్యూబ్ చానళ్లు కాపాడుతున్నాయి. ‘‘రంగా గారిని దేవినేనోళ్లూ చంపలేదు. కమ్మవాళ్లూ హత్య చేయలేదు. ఆయనను చంపేంతటి శక్తిసామర్ధ్యాలు నెప్పల్లి నుంచి వచ్చిన దేవినోనోళ్లకు లేవు. వాళ్ల కులపోళ్లకూ లేవు,’’ అంటూ రంగా బంధువులమని ప్రకటించుకునే కొందరు ఈ యూట్యూబ్ చానళ్లకు చెప్పడం వల్ల కోస్తాంధ్రలో కమ్మలు, కాపుల మధ్య పాత విద్వేషాలు, అపార్ధాలు పూర్తిగా తొలగిపోయాయా? అనే మంచి అనుమానం వస్తోంది.
Ads
1981 విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కృష్ణ లంక డివిజన్ నుంచి పోలీసుల నిర్బంధంలో ఉండగా నామినేషన్ వేసి గెలిచారు రంగా. అయితే, 1985 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ ఎన్నికల్లో అప్పటి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసిన రంగా– తెలుగుదేశం తరఫున నిలబడిన లయోలా కాలేజీ లెక్చరర్ యార్లగడ్డ రాజగోపాలరావును కేవలం 3130 ఓట్లతో ఓడించడం మాలాంటి కొత్త జర్నలిస్టులకు ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి తనకన్నా వయసులో చిన్నవాడైన దేవినేని రాజశేఖర్ ఉరఫ్ నెహ్రూ అప్పటికి రెండేళ్ల క్రితమే టీడీపీ టికెట్ పై గెలిచాక బ్రాహ్మణుల ఓట్లు బాగా ఉన్న నియోజకవర్గం నుంచి రంగా గెలవడంలో ఆశ్యర్యపడాల్సిందేమీ లేదు.
అసెంబ్లీకి ఎన్నికైన రెండు నెలలకే వంగవీటి రంగాను అప్పుడు నేను పనిచేస్తున్న ‘ఉదయం’ పత్రిక ఆఫీసుకు తీసుకొచ్చారు సీనియర్ జర్నలిస్టు కూచి గోపాలకృష్ణ గారు. డెస్క్ లో కూర్చున్న నాకూ, తోటి సబ్ ఎడిటర్లకు రంగాను గోపాలకృష్ణ గారు పరిచయం చేశారు. ‘నాంచారయ్య గారూ, మీరెప్పుడూ కాంగ్రెసోళ్లను తిడతా ఉంటారు కదా! ఇప్పుడు ఎమ్మెల్యే రంగా గారికి ఏమైనా మంచి మాటలు లేదా సలహాలు చెప్పండి,’ అనగానే రంగా చిరునవ్వుతో నాతో కరచాలనం చేశారు. తెల్ల చొక్కా, ప్యాంటు వేసుకుని అనుకున్న దాని కన్నా కాస్త తక్కువ సైజులో కనిపించిన ఆయనతో నేనేమీ అప్పుడు మాట్లాడలేదు. మళ్లీ ఎప్పుడూ రంగాను చూసే సందర్భం రాలేదు.
ఇంటి సందులో బాల్య మిత్రుడి సాయంతో ‘కాపుల నిర్బంధం’ తర్వాత ఇంటికి చేరా
…………………………………………………………………………………………
ఉదయం పేపర్లో 1980ల చివర్లో నేను పనిచేస్తుండగా మేం విజయవాడ పటమట రంగారావు వీధిలో అద్దెకుండేవాళ్లం. ఆ సందులో కాపులు ఎక్కువ. గొల్లలు వీధి చివర్లో తక్కువ మంది ఉండేవారు. మేం అద్దెకున్న కోమట్ల ఇంటి పక్కన ఉండే కాపు కుటుంబానికి రంగాతో మంచి సంబంధాలుండేవి. మాణిక్యమ్మ అనే ఆ ఇంటావిడ వీధి మొదట్లో రిక్షాపై నిలబెట్టిన చిన్న ట్యాంకు నుంచి కిరోసిన్ అమ్మేది. పొద్దున తెల్లారగానే ‘రంగా గారిని చంపేశారు,’ అన్న ఆమె మాటలతో నిద్రలేచాను. ఆ రోజు రాత్రి జర్నలిస్టు మిత్రుడు, ప్రముఖ కవి ఖాదర్ మొహియుద్దీన్ గారిని నేనూ నా మరో కలీగ్ వడ్డే సీతారామ ప్రసాద్ బెజవాడ రైల్వేస్టేషన్ లో తిరుపతి రైలెక్కించి తెల్లవారు జామున 3 గంటలకు రిక్షాలో కూర్చుని రంగా నిరాహార దీక్ష శిబిరం మీదుగా ప్రయాణించి ఇంటికొచ్చి పడుకున్నాం. మా పక్కింటి మాణిక్యమ్మ గారి అరుపులతో నిద్రలేచి స్నానం చేసి బయటికొచ్చాం.
వీధి చివరి కొచ్చి బెంజి సర్కిల్ వైపు వస్తుండగా అప్పటికే ‘ఈనాడు’ ఆఫీసుకు నిప్పంటించడం, అది కొంత తగలబడడం పూర్తయింది. ఆ రోజు రాత్రి నుంచి మేం నైట్ డ్యూటీ చేసి ఇంటికి పోయేటప్పుడు అసలు సమస్య ఎదురయ్యేది. కర్ఫ్యూ అమలులో ఉండడంతో పాసులు కూడా లేని మా వంటి జర్నలిస్టులను పోలీసోళ్లు బాగా సతాయించేవారు. ఒక రోజు రాత్రి డ్యూటీ చేసి ఇంటికొస్తుండగా, మా వీధిలోని వంగవీటి రంగా కాపు అనుచరుడు రామాయణపు దానయ్య చిన్న కొడుకు తన కుర్రాళ్లతో కలిసి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కాపలాకాస్తున్నాడు. ఇంటికి నడుచుకుంటూ పోతున్న నన్ను ఈ ప్రసాద్ అడ్డుకుని నిలబెట్టేశాడు.
నేను ఏడాదిన్నర నుంచి ఈ సందులోనే అద్దెకుంటున్నాని చెప్పినా అతను వినలేదు. ‘నిన్నెప్పుడూ ఈ వీధిలో చూడ లేదు. అసలు నువ్వెవ్వరో చెప్పు. లేకపోతే ఇంటికి నిన్ను పోనివ్వం,’ అని ఆ రామాయణపు ప్రసాద్ నన్ను బెదిరించాడు. అప్పుడే దగ్గర్లోని ఓ ఇంటి లోపలి నుంచి వచ్చి ఈ గుంపులో చేరాడు నాకు పరిచయస్తుడైన నాగేశ్వర్రావు అనే టైలర్. గుడివాడలో మా ఇంటి పక్కనే కొంత కాలం అద్దెకున్న కంసాలి బ్రహ్మం గారి కొడుకే ఈ టైలర్ నాగేశ్వర్రావు. అప్పటికి నన్ను చూసి పన్నెండేళ్లు దాటినా అతను నన్ను గుర్తుపట్టి, ‘ఇతను నా పాత ఫ్రెండు నాంచారబాబు. మనోడే,’ అనడంతో ఆ రంగా అనుచరుడి కొడుకు నా వైపు తిరిగి ‘ఇక పో’ అనే రీతిలో చేయి ఊపుతూ నన్ను ఇంటికి పోనిచ్చాడు. ఇలాంటి అవమానంతో మిళితమైన ఇబ్బందికర పరిస్థితి ఇంకెప్పుడూ నాకు ఎదురవ్వలేదు.
అయితే ‘రంగా గారి యాజిటేషన్’ పేరుతో జరిగిన అల్లర్లు, హింసాకాండ, దుర్మార్గమైన దాడులు, ఒక కులం వారిని, ఒక రాజకీయపార్టీ వారిని ఇతర పార్టీ, ఇతర కులం వాళ్లు టార్గెట్ చేయడాన్ని అప్పట్లో హైదరాబాదులో ఉంటున్న నా తెలంగాణ జర్నలిస్టు మిత్రులు కొందరు–‘పోస్టు మాడ్రన్ హింస’ అంటూ వర్ణించడం, వాటిపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాయడం నాకిప్పటికీ చిరాకుపుట్టే జ్ఞాపకమే. రాష్ట్రం విడిపోయి పదేళ్లు నిండుతున్నా కోస్తాంధ్ర పరిణామాలు శానా మంది తెలంగాణ ఆలోచనాపరులకు సరిగా అర్ధం కావు. అలాగే కొద్దిగా గెడ్డం పెంచుకుని, మెడ చుట్టూ తెల్ల పొడవాటి తుండు గుడ్డలు కప్పుకునే ఆంధ్రా మేధావులు చాలా మందికి హైదరాబాద్ లేదా తెలంగాణ విషయాలపై ఎన్నటికీ పూర్తి అవగాహన కలగదు. అందుకేనేమో మరి రంగా హత్య జరిగిన పాతికేళ్లకు తెలుగు రాష్ట్రం మరోసారి రెండయింది.
యాజిటేషన్ కు బెజవాడ జనం కొత్త నిర్వచనం–అల్లర్లు, విధ్వంసకాండ
………………………………………..
–1980ల చివరి నాటికి విజయవాడ, కృష్ణా జిల్లా ప్రాంతాల్లో జనంలో రాజకీయ అవగాహన, ఇంగ్లిష్ పరిజ్ఞానం కాస్త తక్కువగా ఉన్న కారణంగా వంగవీటి రంగా హత్య తర్వాత విజయవాడ ప్రాంతంలో జరిగిన అల్లర్లను అక్కడి సదువుకున్నోళ్లు సైతం ‘రంగా గారి యాజిటేషన్’ పిలవడం అప్పట్లో వింతగా వినిపించేది. 1972–73 మధ్య మొదట హైదరాబాద్‌లో ముల్కీ నిబంధనల రద్దుకు, తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం కాంగ్రెస్, భారతీయ జనసంఘ్ నాయకత్వంలో విద్యార్థులు, ఎన్జీఓలు నడిపిన హింసాత్మక ఆందోళనకు ‘జై ఆంధ్రా యాజిటేషన్’ అనే పేరుండేది.
ఈ ఉద్యమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల దహనం, ధ్వంసంతోపాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలపై, వారి ఇళ్లపై హింసాత్మక దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో రంగా గారి చావు తర్వాత హైదరాబాద్ నుంచి ఒక కేంద్ర మాజీ మంత్రి సహా కొందరు కాంగ్రెస్ పెద్ద నేతల దర్శకత్వంలో విజయవాడ కేంద్రంగా కోస్తా జిల్లాల్లో ‘నిర్వహించిన’ అల్లర్లను కాపు సోదరులు ‘రంగా గారి యాజిటేషన్’ అని ఇప్పటికీ ముద్దుగా పిలుచుకోవడం కోస్తా జిల్లాల జనం పాక్షిక చైతన్యానికి నిదర్శనం…. (ఫోటో: అల్లర్లలో కాలిపోతున్న ఎన్టీఆర్ తమ్ముడి సినిమా హాలు కల్యాణ చక్రవర్తి)
Share this Article