బ్రహ్మానందం లేని సినిమా అంటూ ఉండేది కాదు… తెలుగు సినిమాకు బ్రహ్మి ఓ సెంటిమెంట్‌గా వెలిగిపోయాడు కొన్నాళ్లు… విపరీతమైన డిమాండ్… రాజబాబు తరువాత ఎందరో కమెడియన్లు వచ్చిపోయినా బ్రహ్మి ఓ స్టార్‌డం ఎంజాయ్ చేశాడు… మధ్యమధ్య సునీల్ కామెడీ ఆకట్టుకునేది… మొనాటనీతో బ్రహ్మానందం కామెడీతో విసిగిపోయిన ప్రేక్షకుల మీదకు నిర్మాతలు, దర్శకుడు వెన్నెల కిషోర్‌ను రుద్దారు… బ్రహ్మీ తెరమరుగయ్యాడు…
తను మెరిట్ ఉన్న నటుడే అయినా ఓ మూస పాత్రలు, మూస నటన… చూసీ చూసీ జనానికి బోర్ కొట్టేసింది… అడపాదడపా జబర్దస్త్ నటుల్ని కామెడీ పాత్రల్లోకి తీసుకొస్తున్నా ఎవరూ పెద్దగా క్లిక్ కాలేదు… కమెడియన్ సత్య చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా బాగా పేరొచ్చిన సినిమాలు కనిపించవు… ఏదో హీరో పక్కన కనిపించడమే అన్నట్టుండేది… అలాంటిది రంగబలి అనే సినిమాలో ఒకరకంగా హీరో తనేనా అన్నట్టుగా కుమ్మేశాడు సత్య…
నిజానికి హీరో నాగశౌర్య అయినా సరే, సినిమాలో బలంగా ఆకట్టుకునేది, సినిమా నిలబడింది కేవలం సత్య వల్లే… తనకు ఈ సినిమాలో లభించిన పాత్ర, దర్శకుడు ఇచ్చిన ప్రయారిటీ, తనకన్నా సత్యకే ఎక్కువ స్కోప్ లభిస్తున్నా ఇగో కనబర్చని నాగశౌర్య… అన్నీ సత్య అదృష్టం… ప్రత్యేకించి ఫస్టాఫ్ మొత్తం సత్యే హీరో అన్నట్టుగా సాగుతుంది… సత్యకు అభినందనలు… ఈమధ్య మంచి ఫామ్‌లో ఉన్నాడు… ఈమధ్య ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వివిధ ఇంటర్వ్యూల స్పూఫ్‌లు చేశాడు కదా, బాగా అభినందనలు దక్కాయి ఆ వీడియోలకు…
Ads
ఇక సినిమా విషయానికొస్తే… ఆమధ్య ఏదో ఇంటర్వ్యూలో నాగశౌర్యను ఇంటర్వ్యూ చేసినాయన ఓ ప్రశ్న అడిగాడు… ‘‘ఇదేం పేరయ్యా, బాగా హిట్టయిన రంగస్థలం నుంచి రంగను, బాహుబలి నుంచి బలిని తీసుకుని రంగబలి అని పేరు పెట్టారా..? అసలు దానికేమైనా అర్థముందా..?’’ ఇదీ ప్రశ్న… నాగశౌర్య కన్విన్సింగ్ జవాబు ఏమీ ఇవ్వలేదు… కానీ సినిమా చూసిన వారికి కూడా ఇదేం సినిమార భయ్ అనిపిస్తుంది… ఓ ఆవారా టైపు హీరో పాత్ర…
ఫార్మసీ చదవడానికి సిటీ వెళ్లి ప్రేమలో పడటం, రంగబలి సెంటర్ పేరు వినగానే అమ్మాయి తండ్రి హడలిపోయి, పెళ్లి కుదరదుపో అనేయడం గట్రా పెద్దగా కనెక్టింగ్ అంశాలు కావు… ఓ రొటీన్ ప్రేమ… పైగా రంగబలి అంటే హీరోయిన్ తండ్రి బెదిరిపోవడం, దాంతో హీరోకు లింక్, దాన్ని హీరో పరిష్కరించుకునే తీరు పెద్ద బలంగా లేవు… దీనికితోడు నాసిరకం పాటలు… ఏదో ఇంటర్వ్యూలో నాగశౌర్యే అంగీకరించాడు… ‘‘నా రీసెంట్ నాలుగు సినిమాలు నిరాశపరిచాయి… నేను సిగ్గరిని, రొమాంటిక్ సీన్లలో వీక్… అందుకని డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్నాను’’
జానర్ కాస్త మార్చారు, కాస్త యాక్షన్ యాడ్ చేశారు తప్ప ఇదీ పెద్ద డిపరెంట్ మూవీ ఏమీ కాదు… సో, ఇది వరుసగా ఐదో నిరాశాపూరిత సినిమా కాబోతోంది… హీరోయిన్ సోసో… హీరో నటనకు వంక పెట్టే పనేమీ లేదు… కానీ ఆ పాత్రే ఫక్తు రొటీన్… అందుకే ఈ సినిమా ప్రేక్షకుడిని కనెక్ట్ కావడం కష్టం… నిష్ఠురంగా అనిపించినా నిజం మాత్రం ఇదే…
Share this Article