మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన పాటల మాంత్రికుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఓ పాట… దానికి ఇ‘లయ రాజా’ సంగీతం… పాటల చిత్రీకరణలో కింగ్ కృష్ణ వంశీ… పాపులర్ రంజని గాయత్రి సిస్టర్స్ గాత్రం… అసలు ఇంకేం కావాలి..? చెవుల తుప్పు వదిలిపోవాలి కదా… చాన్నాళ్లుగా తన నుంచి ఓ మంచి క్రియేటివ్ కంటెంట్ కోసం రసజ్ఞులైన ప్రేక్షకులు, శ్రోతలు ఆసక్తిగా, దప్పికతో ఎదురుచూస్తున్నవేళ……. కృష్ణవంశీ తుస్సుమనిపించాడు…!
రంగమార్తాండ సినిమా వీడియో పాట రిలీజ్ చేశారహో అని ఎక్కడో చదివి… గబగబా ఓపెన్ చేస్తే ఒక్కసారిగా నీరసం ఆవహించినట్టయింది… నిజానికి సినిమా పాటలు, సినిమా ప్రమోషన్ కోసం నాలుగు ఫోటోలు, మేకింగ్ వీడియో బిట్స్, సినిమాలోని ఒకటీ అరా బిట్స్ గట్రా అన్నీ కలిపి ఓ లిరికల్ సాంగ్ అంటూ యూట్యూబులో రిలీజ్ చేయడం పరిపాటే… కానీ కృష్ణవంశీ క్రియేటివిటీ శృతితప్పి చాన్నాళ్లయింది కదా, అదింకా దారిన పడలేదు…
ఇప్పుడు రిలీజ్ చేసిన నన్ను నన్నుగా పాటకు ఓ ప్రయోగం చేశాడు… జీవిత రాజశేఖర్ బిడ్డ శివాత్మిక తెలుసు కదా… ఆమె ఈ సినిమాలో ఉంది… ప్రకాష్ రాజ్, అనసూయ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ఆలీ రెజా, ఆదర్శ్‌తోపాటు పాటగాడు రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నాడు… ఆమె ఈ పాట పాడుతున్నట్టు… ఆమెతో రాహుల్ కలిసి చక్కర్లు కొడుతున్నట్టు… ఓ వీడియో చేసి, దానికి ఈ పాటను బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టి వదిలాడు… పాతకాలంలో ఫోటోస్టూడియోల్లో రెండు మొహాలు, నాలుగు మొహాలు, పన్నెండు మొహాలు వచ్చేలా ‘గ్రాఫిక్ ఫోటోలు’ తీసేవాళ్లు…
Ads
అచ్చు, అలాగే మైక్ ముందు పాట పాడుతున్న శివాత్మిక మొహాన్ని బహుసంఖ్యలో చూపించి విసుగెత్తించాడు… సినిమాలో ఆ పాట ఇలా ఉండదు… ఇది జస్ట్, ఓ క్రియేషన్… ఏమాత్రం బాగాలేదు…. టీవీల్లో వచ్చే సరిగమప, స్వరాభిషేకం, పాడుతా తీయగా, ఇండియన్ ఐడల్ షోలు నయం… కనీసం అప్పుడప్పుడూ జడ్జిలను, వాయిద్యకారులను చూపిస్తారు… ఈ నువ్వునువ్వుగా పాట వీడియోలో ఏమీ లేదు… జస్ట్, శివాత్మిక మొహం చూసి తరించాలి… అంతే… ఫాఫం, కృష్ణ వంశీ… ఇంకా బండి పట్టాలెక్కినట్టు లేదు… 2007 చందమామ తరువాత తన మార్క్ మెరుపులేవి..?
ఈ పాట సంగతికొద్దాం… ట్యూన్ పెద్దగా ఇంప్రెసివ్‌గా లేదు… ఇళయరాజా స్వరపరిచినట్టు మాత్రం అస్సలు లేదు… ఎవరో అసిస్టెంట్‌కు ఇచ్చేసి ఉంటాడు బాధ్యత… పాడింది మాత్రం రంజనిగాయత్రి సిస్టర్స్‌గా పాపులరైన ఫిమేల్ సింగర్స్‌లో గాయత్రి… బాగుంది… మెలోడియస్‌గా… శాస్త్రీయ ఆలాపనతో ఆరంభమై, మంద్రంగా, ఆర్ద్రంగా, చెవులకింపుగా సాగింది ఆమె గొంతు… సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ నటించి ఉండవచ్చుగాక, కానీ ఈ పాటలో తను గొంతేమీ చేసుకోలేదు… మరి శివాత్మికకు తోడుగా తనెందుకు ఈ వీడియోలో..? కేవలం పాటే రిలీజ్ చేయాలనుకుంటే ఆ గాయత్రి పాడినట్టు చూపిస్తే సరిపోయేది… కనీసం అనసూయ అయినా బాగానే ఉండేది…
లిరిక్‌లో ‘ఎందుకంటే నాకే నేను బానే ఉందిగా…’ అని పల్లవిలోనే ఉంటుంది… విచిత్ర వ్యక్తీకరణ… కనీసం నాకే నేను బానే ఉన్నానుగా అనైనా ఉండాలిగా… అక్కడే దారీ దరీ లేని ఆశ అనే వాక్యాలు బాగున్నాయి… ఎగసి నీ గుండెలో అనేంతవరకు వోకే… కానీ తరువాత వలసి వాలిందనీ అని పాడింది… అదేమిటో చెప్పడానికి సిరివెన్నెల లేడు, ఇళయరాజాకు అంత తెలుగు రాదు, కృష్ణవంశీకి ఓపిక లేదు… అలాగే సగిన తరుణమనుకున్నానో అంటుంది మరోచోట… అంటే ఏమిటో అర్థం..? తరువాత కొన్ని పదాలు తెలుగో కాదో కూడా అర్థం కాలేదు… ఇదీ ఆ పాట యూట్యూబ్ లింక్…
Share this Article