Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈమెను కారల్ రంగనాయకమ్మ అనే పిలవాలి… తెలుగు సాహిత్యంలో విలక్షణి…

July 13, 2023 by M S R

Bharadwaja Rangavajhala…. రంగనాయకమ్మగారు చాలా సీరియస్సుగా ఉండటమే కాదు … యమ సీరియస్సు రచనలూ చేస్తారు. నేను ఆవిడను కారల్ రంగనాయకమ్మ అని పిలుస్తాను. నిజానికి రంగనాయకమ్మ మార్క్స్ అని పిలవాలిగానీ దానికంటే కూడా కారల్ రంగనాయకమ్మ అంటేనే బాగుంటుంది.

నేను లైబ్రరీ నుంచీ రోజుకో పుస్తకం తెచ్చి చదివేసిన రోజుల్లో అనగా 80 నుంచీ 82 దాకా … ఎక్కువ చదివింది రంగనాయకమ్మ, రావి శాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావుల రచనలే.

మా అమ్మమ్మా వాళ్ల ఊళ్లో అంటే కృష్ణా జిల్లా మానికొండ అన్నమాట. అక్కడ సైదా మాస్టారని ఉండేవారు. ఆయన శ్రీకాకుళ సాయుధ పోరాట కాలంలో ఆ వైపు వెళ్లి ఆ తర్వాత తిరిగొచ్చేసి మానికొండలో అర్జునరావు గారని కమ్యునిస్టు అభిమాని ఇంటి వసారాలో ప్రైవేట్లు చెప్పుకునేవారు.

Ads

ఆయన దగ్గర చదువుకోడానికి చేరాను నేను. ఆయనే మాకు చలం, రంగనాయకమ్మ రచనలను అలవాటు చేసింది. ఆ తర్వాతెప్పుడో … పాపం మావో రచనలు ఐదో భాగం కావాలని నా దగ్గరకొచ్చారాయన.

రంగనాయకమ్మగారి రచనల్లో సీరియస్ సెటైర్ నాకు చాలా ఇష్టంగా ఉండేది. జానకి విముక్తి నవలలో వెంకట్రావును గురించి రాస్తున్న సందర్భాల్లో కట్టలు తెంచుకునే అసహ్యాన్ని అదుపు చేసుకుంటూ రాసినట్టుంటుంది. పేక మేడలు, స్వీట్ హోమ్ తదితర రచనలన్నిట్లోనూ ఆవిడలో ఉన్న మరో కోణాన్ని ఆవిష్కరించేవే. అంటే మంచి సెలైర్ రాస్తారావిడ.

రచన పరంగా ఆవిడ ఎంత సీరియస్సో ప్రత్యేకం చెప్పనక్కర లేదు. తన మనసుకు నచ్చని, తను మంచి అనుకుంటున్న సిద్దాంతానికి విరుద్దంగా జరిగిందనుకున్న ఏ అంశాన్నీ ఆవిడ క్షమించరు. వారెవరైనా సరే తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టేస్తారంతే.

పురాణం వారు జానకి విముక్తి మధ్యలో ఆపేయడం వల్ల కావచ్చు… రంగనాయకమ్మ గారు మెయిన్ స్ట్రీమ్ లో ఫిక్షన్ రాయడం తగ్గించేశారు. ఆ రచన ఆపేయడంలో పురాణం వర్షను … కథ కన్నా పొలిటికల్ డిస్కషన్స్ ఎక్కువైపోతున్నాయనే.

జానకిని పీడిత ప్రజలకు నమూనా పాత్రగా తీసుకుని వెంకట్రావును దోపిడీ భూస్వామ్య వర్గాలకు ప్రతినిధిగా తీసుకుని … జానకి అన్న పాత్రను చారు మజుం‘దారిలో ఉన్న విప్లవకారులకు ప్రతినిధిగా తీసుకుని … అతని మిత్రుడి పాత్ర ద్వారా తాను చెప్పదల్చుకున్న విషయం చెప్తూ రంగనాయకమ్మ గారు అప్పటి వామపక్ష ఉద్యమ చర్చను చేసేశారు.

ప్రజలకన్నా ముందు నడవడమూ ప్రజల వెనుక నడవడమూ రెండూ తప్పే అనీ … ప్రజలతో పాటు నడుస్తూ వారిలో చైతన్యాన్ని నింపుతూ సాగాలనే ఆలోచనను విస్తారంగా చర్చించిన నవల జానకి విముక్తి.

రామాయణ విష వృక్షంలో కూడా రంగనాయకమ్మ గారిలో ఉన్న సెటైరికల్ పవర్ రేంజ్ ఏమిటో కనిపిస్తుంది. కుటుంబరావు లాంటి వాళ్లు కాస్త విసుక్కున్నా … తనలోని ఆగ్రహం లెవల్ అది.

రచనలూ రచయిత సైద్దాంతిక నిబద్దత విషయంలో ఎవర్నీ క్షమించలేదావిడ. కుటుంబరావును సైతం రేవెట్టేసిన చరిత్ర ఆవిడది. ఆవిడ రచనా శైలి చాలా సరళంగా సూటిగా సుత్తి లేకుండా ఉండడంతో అద్భుతంగా కనెక్ట్ అయ్యేది కూడా. జనసాహితి నుంచీ తాను బయటకు వచ్చినప్పుడు రాసిన పుస్తకం, ఓల్గా తదితరులతో తన విబేధాల గురించి రాసిన పుస్తకం ఆవిడ కొంచెం పెద్ద బోల్డు ఓవర్ యాక్షన్ చేసినట్టనిపించినా … ప్రస్తావించాల్సిన అంశాలు వాటిలోనూ కొల్లలుగానే దొరుకుతాయి.

కార్మిక వర్గ విముక్తికి ప్రతిపాదిత మూడు అద్భుత ఆయుధాల్లో ఒకటైన పార్టీని ఆవిడ ఎన్నడూ ఖాతరు చేయలేదు. అందులో ఉంటూనే యుద్దం చేయవచ్చని ఆవిడ ఎన్నడూ అనుకోలేదు. నిర్మాణాలను దూరంగా ఓ మార్క్సిస్టు రచయితగా ప్రధానంగా విమర్శకురాలిగా ఉండిపోయారు. భారత కమ్యునిస్టు పార్టీ (ఎమ్.ఎల్. ఆర్) అని పార్టీ పెట్టొచ్చు కదా ఈవిడ అనిపించేది. ఆర్ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా…

రంగనాయకమ్మగారిలో మరో ముఖ్యమైన గొప్ప లక్షణం … తన రచనల పునర్ముద్రణల సందర్భంలో ఆ రచన చేసినప్పటి తన ఆలోచనల్లో దొర్లిని అవగాహనా లోపాలను … అభివృద్ది నిరోధన ఆలోచనలనూ తానే ఎండగట్టి .. తన ప్రస్తుత జ్ఞానంతో సదరు రచనలను తనే సమీక్షించి ఇప్పుడు చదవండి అని చెప్పడం.

రంగనాయకమ్మగారు ఎంత సీరియస్సో చెప్పడానికే ఇంత సుత్తేశానన్నమాట. అలాగే ఆవిడలో ఎంత హ్యూమరుందో … చెప్పడానికీ ప్రయత్నించా. ఇదంతా ఎందుకంటే … ఆవిడ రాసిన కుట్ర అనే కథ గురించి గుర్తు చేయడానికే … అప్పుడే కాలేజీలో చేరి ఇంటర్ మీడియట్ నడుపుతున్న రోజుల్లో చదివిన కథ అది.

కొందరు విప్లవ రచయితల మీద ప్రభుత్వం కుట్ర కేసు పెడుతుంది. వారు వారి రచనల్లో ప్రజలను రెచ్చగొట్టే అభిప్రాయలను వ్యక్తీకరరించారని వ్యవస్థను దెబ్బతీసే భావజాలం వెదజల్లుతున్నారనేవి అభియోగాలు. రచయితల మీద కోర్టులో ట్రయలు మొదలవుతుంది. జడ్జిగారు సంచలనాత్మక తీర్పు ఇస్తారు.

విప్లవాన్ని ప్రేరేపిస్తున్నారంటూ పోలీసులు ఆరోపణలు చేసిన వారి రచనలన్నీ నేను పూర్తిగా పరిశీలించాను. ఒక్కొక్కటి ఒకటికి రెండు సార్లు చదివాను. నాకు ఒక్క ముక్క అర్ధం కాలేదు. చాలా కష్టపడితే తప్ప ఒకటి రెండు వాక్యాలు అర్ధం చేసుకోలేకపోయాను.

ఇంత జటిలంగా ఉన్న ఈ రచనలు నా లాంటి వాడికే అర్ధం కాలేదంటే … మీరు చెప్తున్న అణగారిన అన్నార్తులకూ దీన జనులను బడుగులకూ ఎలా అర్ధం అవుతాయని న్యాయమూర్తి ప్రశ్నిస్తాడు. ఎవరికీ అర్ధం కాని విధంగా రాయబడిన ఈ రచనల వల్ల ప్రజలు మేలుకొని ప్రభుత్వాన్ని ఏదో చేస్తారనే ఆరోపణలో వాస్తవం లేదని కోర్టు భావిస్తున్నట్టు ప్రకటిస్తాడు.

కేసు కొట్టేస్తున్నట్టు చెప్తూనే భావాలను సరళంగా ఎలా చెప్పవచ్చో తెలిపే కొన్ని రచనలను తనే ప్రిస్క్రైబ్ చేసి వాటిని చదివి ఆకళింపు చేసుకోడానికి గాను రెండు నెలల జైలు శిక్ష విధిస్తాడు. అయితే కొన్ని సైద్దాంతిక అంశాలను చెప్పేటప్పుడు భాషలో కొంత గాఢత ఉంటుంది. వ్యక్తీకరణలో కూడా అది కనిపిస్తుంది. అది అనివార్యం. వీటిని అర్ధం చేసుకోడానికి అటువైను నుంచీ కూడా కృషి అవసరమే. అయితే రంగనాయకమ్మగారు ఇలా భావించరు.

తనకు అనిపించింది చెప్పేయడమే ఆవిడ పద్దతి. అలా అనుకునే ప్రజలందరికీ అర్ధమయ్యేలా ఉండాలనే దాస్ కాపిటల్ ను పరిచయం చేశారావిడ. చాలా కాన్షస్ గా సైద్దాంతిక అంశాలనే ఎంత సరళంగా చెప్పొచ్చో … ప్రయత్నం చేశారు. అలాగా ఆవిడ పరిచం చేసిన స్పార్టకస్ కూడా. నిజానికి తరువాత రోజుల్లో హెచ్.బి.టి వారు స్పార్టకస్ పూర్తి నవల అనువాదం అచ్చేసినా కూడా రంగనాయకమ్మగారు చేసిన పరిచయమే బాగుంటుంది.

ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ … తెలుగు సాహిత్య చరిత్రలో చాలా విలక్షణ వ్యక్తిత్వం ఉన్న రచయిత్రిగా రంగనాయకమ్మ ఒక మైలురాయే. నిన్న ఏదో పుస్తకం కోసం వెతుకుతూ … నా పాత పుస్తకాల పెట్టెలో చేయి పెడితే … రంగనాయకమ్మగారి స్పార్టకస్ పరిచయం కనిపించింది. అది చూసిన ఆవేశంలో ఇలా ….జరిగింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!
  • అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!
  • ఓ ప్రధాని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసినట్టు… రోడ్రిగో కథే వేరు…
  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions