.
Murali Buddha….. *ఓయీ పౌరుడా… ? నీవు ఎవరవు… ? ఎందుకు అలా పరిగెడుతున్నావ్… ? ఆగుము అని పిలువగా … ఆ ఆగంతకుడు మా వద్ద ఉన్న తుపాకీ లాక్కొని మాపై కాల్పులు జరిపాడు … మేం ఆత్మ రక్షణ కోసం జరిపిన ఎదురు కాల్పుల్లో అతను మరణించాడు… *
ఎన్ కౌంటర్ పై పోలీసులు విడుదల చేసే ప్రకటన ఇలా ఉండేది .. Express లో జర్నలిస్ట్ మిత్రుడు బాలకృష్ణ ఈ భాషను అక్షరం అక్షరం బట్టిపట్టి వినిపించే వారు …
ఎవరైనా ఎవరినైనా ఓయీ పౌరుడా అని పిలవడం నాలుగు దశాబ్దాల జర్నలిజంలో ఎప్పుడూ వినలేదు …
1990 ప్రాంతంలో మెదక్ జిల్లా ( సంగారెడ్డి ) SP గా నండూరి సాంబశివరావు ఉండేవారు … విభజన తరువాత ఆంధ్ర DGP గా రిటైర్ అయ్యారు …
Ads
ఎన్ కౌంటర్ ఆ రోజుల్లో నిత్యకృత్యం … ఎన్ కౌంటర్ కాగానే పోలీసు ప్రత్యేక భాషలో ఎలా జరిగిందో చెప్పేవారు … అంటే ఓయీ పౌరుడా అని పిలవడం, తుపాకి లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం – ఎదురు కాల్పులు మరణం – గ్రామాల పేర్లు, మృతుల పేర్లు తప్ప మిగతా కథ ఒకటే …
ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిశాక, ఒక్కోసారి మూడ్ బాగుంటే పిచ్చాపాటిగా మాట్లాడితే, ఎలా లేపేశామంటే అని చెప్పేవారు …
YSR సీఎంగా ఉన్నప్పుడు వరంగల్ లో ఒక కేసులో ఒకడిని అరెస్ట్ చేయగానే, ఆంధ్రభూమిలో మిత్రులం వీడు ఆయుధాన్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తే పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారు అని ముందే మాట్లాడుకున్నాం… అలానే జరిగింది… షాద్ నగర్ అత్యాచారం కేసులోనూ ఇలానే ముందే అనుకున్నాం … జర్నలిస్ట్ లే కానవసరం లేదు, పాఠకులు కూడా ఎన్ కౌంటర్లను ముందే ఊహిస్తున్నారు …
ఇవన్నీ పాత కథలు… ఎంత మిస్సమ్మ, గుండమ్మ కథ సినిమాలైనా ఈ కథలు ఎక్కువ కాలం ఆసక్తి కలిగించవు … తెలుగు సినిమాల కథలు మారినట్టే ఎన్ కౌంటర్ కథలు కూడా మారుతున్నాయి … మారాలి, లేకపోతే జనానికి ఆసక్తి ఉండదు…
నారాయణ అని టీడీపీ చోటా లీడర్…. ఓ చిన్న పిల్లపై అత్యాచారం— పోలీసులు పట్టుకొని వెళుతుంటే తప్పించుకొని, నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు … ఇది చెరువు ఎన్‌కౌంటర్… గుడ్ క్రియేటివిటీ, ఇలా సినిమా రచయితల్లా కొత్త కథలు రాయాలి, చెప్పాలి, ఇదే ఎదుగుదల…
ఎన్ కౌంటర్ లో కొత్త మలుపు బాగుంది … కేసు విచారణ జరిగి తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు … విచారణ జరిగినన్ని రోజులు టీడీపీ లీడర్ అంటూ వార్తలు మాత్రం వస్తాయి… ఇవన్నీ అవసరమా ?
ప్రతి సమస్యకు బుల్ డోజర్ లోనే పరిష్కారం ఉందని భావించే ఉత్తర్ ప్రదేశ్ లో కారు బోల్తా పడి కూడా ప్రమాదంలో నేరస్తులు మరణిస్తారు … ఇది కొంత అనాగరికపు ఎన్ కౌంటరే … ఎప్పుడో చదివినట్టు గుర్తు, ఎక్కడో గానీ రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకోబడ్డాడు ఓ నేరస్థుడు…
అదీ, అలా కొత్త కథలు కావాలి… బట్, అన్ని ఎన్ కౌంటర్ కథల్లో ఈ ఆంధ్ర ఎన్ కౌంటర్ ఆత్మహత్య కొత్తగా ఉంది … సున్నితంగా ఉంది … ఆధునికంగా ఉంది … క్రియేటివ్‌గా ఉంది… మానవ హక్కుల కమిషన్ విచారణలో తూటాలకు లెక్కలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు … సాక్షుల అవసరం లేదు … పోస్ట్ మార్టం వీడియో షూటింగ్ గట్రా అసలే అవసరం లేదు… పోలీసులు కూడా ఎదుగుతున్నారండోయ్….
Share this Article