ఒక వీడియో బిట్ ఇంట్రస్టింగు అనిపించింది… ఎక్కడో దుబయ్‌లో సైన్స్ ఇండియా ఫోరం ఓ ప్రోగ్రాం నిర్వహిస్తోంది… బైజూస్ యాప్ వాడు స్పాన్సరర్… కల్పన చావ్లా పేరిట వుమెన్ అచీవర్స్ అవార్డ్స్ ఇవ్వనున్నాడు… సరే, మంచిదే, అభినందించాలి…
5 కేటగిరీల్లో అవార్డులు… ఒకరు మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవబడే మైల్ స్వామి, ఈయన ఫేమస్ ఇస్రో సైంటిస్టు… 2) మాజీ సినిమా నటి గౌతమి, 3) జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖ శర్మ, 4) దుబయ్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ ఈసా మహమ్మద్ బస్తకీ, 5) పద్మశ్రీ అనుపమ హస్కరే… వీళ్లతోపాటు మన హైదరాబాద్‌కు చెందిన వీణాగాయని వీణశ్రీవాణి…
మహిళా అచీవర్స్‌కు అవార్డులు అంటూ మళ్లీ మధ్యలో మైల్‌స్వామి, బస్తకీలకు దేనికి అనే ప్రశ్న, సందేహం వచ్చాయి సరే గానీ… మనం చెప్పేది శ్రీవాణి గురించి… ఎందుకంటే..?
Ads
ఒకప్పుడు సంగీత కచేరీ అంటే వీణ, మృదంగం తప్పనిసరి… వీణ లేని సంగీతం లేదు… కానీ ఇప్పుడు..? అసలు ఆర్కెస్ట్రాల నుంచి వీణ ఎప్పుడో మాయమైపోయింది… అక్కడక్కడా ఫ్లూట్ ఇంకా కనిపిస్తోంది… కానీ వీణ సాధన అంత సులభం కాదు… అందుకే ఎవరూ దానివైపు వెళ్లడం లేదు… ఐనా కీబోర్డ్ ఉంటే చాలు వీణలు, వయోలిన్లు, సకల వాయిద్యాలకూ అదే ఆధారం అయిపోయింది కదా ఇప్పుడు… అలాంటిది అక్కడెక్కడో దుబయ్‌లో ప్రోగ్రామ్‌కు ఒక వీణాగాయనిని గెస్టుగా పిలిచి, స్పెషల్ పర్‌ఫామెన్స్ ఇప్పించుకుంటున్నారంటే ఆశ్చర్యం కలిగించే విశేషమే కదా మరి…
వీణ, వీణ, వీణ… అదే లోకం ఆమెకు… వీణ కాలగతిలో అదృశ్యమైపోకూడదు… వీణ ప్రాచుర్యాన్ని కాపాడుకుందాం… ఇదే నినాదం ఆమెకు… అదే సాధన… మాస్ నుంచి క్లాస్ వరకు… అన్నిరకాల సినిమా పాటల్ని సాధన చేయడం, కచేరీలు ఇవ్వడం… ఇదే పని… వోకల్‌కు దీటుగా వీణను పలికించడం, అదీ తప్పులుపోకుండా… కష్టమే…
తన పేరులోనే వీణ అని పెట్టుకుంది… వీణ వేణువైన సరిగమ అన్న పాట పల్లవి తరహాలో… భర్త వేణుస్వామి ప్రోత్సాహం సరేసరి… ఇప్పుడు ఆమె పలు రాష్ట్రాలకు వెళ్తూ ప్రోగ్రామ్స్ ఇస్తోంది… అదే ఆశ్చర్యంగా ఉంది… మొన్న జీబంగ్లా వాళ్లు ఓ ఎపిసోడ్‌కు కోల్ కతాకు రమ్మన్నారు… అయిదారు షోలకు షాపింగులకు వెళ్తే ప్రతిచోటా ఆమెను గుర్తుపట్టి సెల్ఫీలు దిగారు… అంటే వీణ ప్రాచుర్యం కోసం, ఉనికి కోసం పాటుపడాలన్న ఆమె తన లక్ష్యం దిశలో సరిగ్గానే పయనిస్తోందన్నమాట…
అవును, జనంలో వీణ ఉంది… కానీ ఎటొచ్చీ శాస్త్రీయ సంగీతంలాగే దానికీ ఇప్పుడు అస్థిత్వ సమస్య వస్తోంది… నేర్చుకునేవాళ్లు లేరు… పాపులర్ మ్యూజిక్ వాతావరణంలో అది కనిపించకుండా పోతోంది… ఇదుగో ఇలా కొందరు మాత్రం ఇలాంటి స్వర వాయిద్యాలను అమితంగా ప్రేమిస్తారు… తమలో ఓ భాగం చేసుకుంటారు… శ్రీవాణి కూడా అంతే… ఆల్ ది బెస్ట్…!! ఆ దుబయ్ వేడి గాలుల్లో మన వీణ తీయని చల్లదనాన్ని నింపుగాక..!!
Share this Article