‘‘అంటే ఏమిటి..? అసలు నాతో మీకు ప్రాబ్లమేంటి..? సినిమాలు వదిలేసి వెళ్లిపొమ్మంటారా..? ఏమిటీ ట్రోలింగ్..?’’ అని బాధపడిపోతోంది రష్మిక… ఈమధ్య ఏదో ఇంటర్వ్యూలో బరస్ట్ అయిపోయింది… నిజంగానే ఆమె మీద ట్రోలింగ్ ఒక రేంజు దాటిపోయింది… ఆమె ఆగ్రహంలో ఆవేదన ఉంది… జరుగుతున్న నష్టమేమిటో తెలిసొచ్చి, సరిదిద్దుకునే ప్రయత్నాలేదో చేస్తోంది… కానీ ట్రోలర్స్ మాత్రం విడిచిపెట్టలేదు…
నిజంగా ఆమెను విమర్శించాల్సిన అంశాల్లో గాకుండా… చిన్న చిన్న అంశాల్లో కూడా ఆమెను టార్గెట్ చేస్తున్నారు… ప్రత్యేకించి కాంతార సినిమా చూడలేదు అని ఆమె ఎప్పుడైతే చెప్పిందో, అప్పట్నుంచీ స్టార్టయింది… ఆమె కూడా గోక్కుంటూ పోయింది తప్ప ఇండస్ట్రీని, మీడియాను, ట్రోలర్స్‌ను ఎలా టాకిల్ చేయాలో ఆలోచించలేదు… దాంతో మరింత బదనాం అయిపోయింది…
జరగాల్సిన నష్టం జరిగాక… ఇప్పుడు ‘‘నాకు కిరిక్ పార్టీ లైఫ్ ఇచ్చింది, రిషబ్ శెట్టే నన్ను మొదట లాంచ్ చేసింది’’ అని స్టేట్‌మెంట్లు ఇవ్వడం వల్ల వచ్చేదేముంది..? కొన్నాళ్లు నిశ్శబ్దంగా ఉంటే సరిపోయేది… కొన్నాళ్లు గోక్కోవడం, గోకించుకోవడం దేనికి..? తరువాత ఇలాంటి అనవసర లేపనాలు పూసుకోవడం ఎందుకు..?
Ads
ఇప్పుడు బాధపడిపోతోంది… కోపమొస్తోంది… కన్నీటిపర్యంతం అయిపోతోంది… ఇక్కడా తప్పే… నన్ను మానసికంగా హింసిస్తున్నారు అని బాధపడటం దేనికి..? ఆ హింసకు దూరంగా ఉండాలి… ఓ జర్నలిస్టు చానెల్ ప్రేమతో ఆమె ఇంటర్వ్యూ ఆమె బాధను వ్యక్తపరిచింది… ‘‘నేను బాగా జిమ్ వర్క్ చేస్తే మగాడిలా కనిపిస్తాను వీళ్లకు… జిమ్ చేయకపోతే లావు పర్సనాలిటీ అని ముద్రలేస్తారు… ఎక్కువ మాట్లాడితే వదరబోతును, తక్కువ మాట్లాడితే ఇగోయిస్టును… నేను ఊపిరి పీల్చుకున్నా తప్పుపడుతుంటే ఇంకేం చేయాలి..? ఈ ఫీల్డ్ వదిలి వెళ్లిపోవాలా..?’’ ఇదీ ఆమె బాధ…
‘‘ట్రోలర్స్ వాడే భాష, చేసే వ్యాఖ్యానాలు డిస్టర్బ్ చేస్తున్నాయి… అసలు నాతో వీళ్లందరికీ ఉన్న ప్రాబ్లమేమిటి..?’’ అనడుగుతోంది ఆమె… నిజమే… అయితే ఇక్కడ ఆమె కొందరిలా ఫరమ్‌గా, స్టబర్న్‌గా ఉండటం నేర్చుకోవాలి… అదే చేతకావడం లేదు తనకు… కాస్త తలవంచినట్టు కనిపిస్తే చాలు, మీడియా, సోషల్ మీడియా, ట్రోలర్లు అందరూ స్వారీ చేస్తారు… తలెగరేయాలి… తప్పులేదు, ఇగోయిస్టు అంటారు, నాలుగు రోజులకు అలవాటు పడిపోతారు… ఉదాహరణ కంగనా…
ఆమె తన ట్విట్టర్ ఖాతాను రద్దు చేస్తే వీసమెత్తు బాధపడలేదు… లైట్ తీసుకుంది… ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం కూడా అరుదుగా వాడుతుంది… ఎడాపెడా ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయదు… ఎవడికీ జవాబు చెప్పదు… అసలు ట్రోలర్స్ పోస్టులనే పట్టించుకోదు… తన మేనేజరే అవన్నీ చదివి, నవ్వి, డిలిట్ కొట్టేస్తాడు… ఆమెకు జరిగిన నష్టమేమిటట… ఆమె టెంపర్‌మెంట్ ఎలాంటిదంటే, దర్శకుడు, ఇతర కీలక టీం సభ్యులనే మణికర్ణిక సెట్ నుంచి తరిమేసింది…
నష్టం ఏం జరిగింది..? ఎంచక్కా తలైవి చేసింది, తరువాత ధాకడ్ చేసింది… ఫ్లాపులు అనేది వేరే సంగతి… తనే డబ్బులు పోగుచేసి ఎమర్జెన్సీ చేస్తోంది… తమిళ చంద్రముఖి మరో మంచిపాత్ర… అవి గాకుండా మరో రెండు సినిమాలున్నాయి… మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, బాలీవుడ్ మాఫియా తొక్కాలని చూసినా, తలెగరేసుకుని నిలబడింది…
ఎస్, ఆ టెంపర్‌మెంట్ కొన్నిసార్లు అనుసరణీయం… లేకపోతే KRK వంటి థర్డ్ రేట్ విమర్శకులు సైతం ‘‘నువ్వు వేస్ట్, భోజ్‌పురిలో ఎక్సట్రా కేరక్టర్లు బెటర్ నీకు, బాలీవుడ్ తన్ని తరిమేస్తుంది’’ వంటి పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తారు… లేదంటే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మరో ఉత్తమమైన మార్గం… ఎందుకంటే..? సోషల్ మీడియా ఎవరినీ ఎవరెస్ట్ ఎక్కించలేదు, పసిఫిక్ లోతుకు ముంచనూ లేదు… దాన్ని పట్టించుకుంటే తప్ప..!!
Share this Article