పోలింగ్ ప్రారంభమైంది కదా… ప్రలోభాలు, పంపకాల దశలు దాటి వచ్చేశాం కదా… ఇప్పుడు చెప్పుకుందాం… రాత నీతి వేరు… క్షేత్ర నీతి వేరు… రాత నీతి అంటే రాతల్లో కనిపించే, వినిపించే, ప్రబోధించబడే నీతులు… సూక్తులు… క్షేత్ర నీతి అంటే ఫీల్డ్ రియాలిటీ… మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై చాన్నాళ్లు చివుక్కుమనిపిస్తూనే ఉంటుంది…
తెలంగాణ మునుపెన్నడూ ఎరుగనంతగా ప్రలోభాలు, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు, ఖజానా నుంచే వోటర్లను పొల్యూట్ చేసే పథకాలు, విపరీతంగా డబ్బు… కనీవినీ ఎరగనట్టుగా మద్యం, మాంసం, పార్టీలు, కానుకలు… వాట్ నాట్..? వోటరు పూర్తిగా పొల్యూట్ అయిపోయాడు… కానీ వోటరు తప్పా..? ఏమీ లేదు… నా హక్కు అంటున్నాడు… నా వాటాకు రావల్సిన డబ్బు ఏదిరా, లేకపోతే వోటు వేయను అంటున్నాడు… దురదృష్టం కొద్దీ వాడికీ జస్టిఫికేషన్ ఉంది…
‘‘ఎవడి అవసరానికి ఈ ఎన్నిక తీసుకొచ్చారు..? మేం అడిగామా..? మీరే వచ్చారు, మందు పోస్తున్నారు, మటన్ పెడుతున్నారు… జాతర చేస్తున్నారు… ముక్కుచీమిడి తీస్తున్నారు, ముడ్డి కడుగుతున్నారు..? మేం అడిగామా..? ఐనా ఎవడూ వాడి జేబులో నుంచి ఖర్చు పెట్టడం లేదుగా… ఎవడూ చెమటోడ్చి సంపాదించిన డబ్బేమీ కాదుగా… కంట్రాక్టుల్లో కొట్టేసిన డబ్బే… ఆ డబ్బు ఎవరిది..? మాది కాదా..? మా డబ్బు మేం తీసుకుంటే మధ్యలో ఈ నీతులు చెబుతారేం..? మేమేమీ బిచ్చం అడగడం లేదు… మీ అవసరానికి మీరే వచ్చి మా జేబుల్లో కుక్కుతున్నారు…’’ ఈ వాదనకు విస్తుపోవడమే మన వంతు…
Ads
కట్నం తీసుకోకూడదు… సరే… వ్యభిచారం నేరం… సరే… లంచాలు అడిగితే నేరం… సరే… అలాగే వోటుకు నోటు పాపం… కొత్తగా ఈ నీతి కూడా ప్రభుత్వ పాఠశాలలో గోడ మీద రాసిపెట్టండి… మాకేమీ బాధలేదు… మీ లెక్కలు మీకుంటే, మా లెక్కలు మేం వేసుకుంటున్నాం… అంటున్నాడు ఇప్పటి వోటరు… ఇదే ఇలా ఉంటే, ఇక రాబోయే జనరల్ ఎలక్షన్స్ మాటేమిటి..? అసలు వోటరు మాట వింటాడా..? వినకుండా చేసింది పార్టీలే కదా…!!
పోనీ, నిజాయితీగా ఉంటాం… రూపాయి తీసుకోం… మందు పోస్తే సీసాలు పగులగొడతాం… మటన్ పెడితే చెప్పుతో కొడతాం… ఎవడో నచ్చినవాడికి వోటేస్తాం… గెలిచినవాడు అంతే నిజాయితీగా ఉంటున్నాడా..? కబ్జాలు, అక్రమాలు, కంట్రాక్టులు, పెత్తనాలు… జనంలో ఉండేవాడెవడు..? జనం కోసం ఉండేవాడెవడు..? మాకేనా నీతులు..? ఇది మరో కోణంలో వాదన…
ఒకప్పటి తెలంగాణ ఎన్నికలు వేరు… ఇప్పటి తెలంగాణ ఎన్నికలు వేరు… మొన్నమొన్నటిదాకా హుజూరాబాద్ ఓ ఉదాహరణ… ఇంతకుమించిన ఉపఎన్నిక ఇక ఈ దేశమే చూడబోదేమో, అంతటి కలుషిత రాజకీయం అనుకున్నారు అందరూ… కానీ మునుగోడు నాలుగు రెట్లు ఎక్కువ… పైగా బట్టలు కాల్చి మీద వేసుకోవడాలు, పనికిమాలిన ఎమ్మెల్యే కొనుగోలు వ్యూహాలు, ప్రచారాలు… అసలు ఈ ఉపఎన్నిక ఎందుకు..? ఈ ప్రశ్నకు మాత్రం ఎవరి వద్దా జవాబు లేదు…
ఎత్తుగడలు అట, వ్యూహాలు అట, రాజకీయాలు అట… ఎవడికి కావాలి ఇవి..? మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల అతిరథులు తిష్ట వేశారు… టెంట్లు వేసి మరీ ‘ప్రచార యుద్ధం’ చేశారు… కౌంటింగ్ ముగిశాక మళ్లీ ఒక్కడూ కనిపిస్తే ఒట్టు… తుపాకీ గుండుకు కూడా దొరకరు… సో, మా వోట్లతో మీరు ఏదో ఆట అడుకుంటున్నారు… ఆ ఆటలో పావుగా మారిన నాకేంటి ఫాయిదా అని నేను అడుగుతున్నాను… సహజ న్యాయమే కదా… ఇదీ సగటు వోటరు మనోగతం…
ఒకాయన ఎదుటోడి దగ్గర తులం బంగారం తీసుకుని మాకు వోటేయండీ అని చెబుతున్నాడు… కానీ ఆ ఎదుటోడు ఏమీ ఇవ్వలేదు, మరి నువ్వేం ఇస్తావో చెప్పు, లేకపోతే వోటేసేది లేదు, వోటుకు వెలకట్టేది మీరే కదా… బహిరంగంగానే చెబుతున్నారు కదా… మళ్లీ వోటర్లు బాగా తెలివిమీరారు, మస్తు డబ్బు తింటున్నారు అని బదనాం చేయడం దేనికి..? ఒక్క నోటు కదలకుండా కట్టడి చేయండి, అదెందుకు చేతకాదు..? ఐనా ఇప్పుడంతా డిజిటల్ ట్రాన్స్‌ఫర్లే కదా… ఆ సోర్సుల్ని బద్ధలు కొట్టడం ఎందుకు చేతకావడం లేదు..? ప్చ్… ప్రచారవ్యవధి ఇంకాస్త ఉంటే బాగుండు… ఉత్త పుణ్యానికి సుఖపడే జాతర వస్తే మాకెందుకు బాధ..?
Share this Article