.
మనం ఇంతకుముందు కథనంలో పెట్టుడు జనన ముహూర్తాలు, అనుకూల సమయంలో సిజేరియన్లు.., పెరిగిపోతున్న కొత్త దందా, కృత్రిమ ముహూర్తాలతో జాతకాలు మారతాయా అనే అంశాల్ని ముచ్చటించుకున్నాం కదా…
ఇలా పెట్టుడు ముహూర్తాల భ్రమలో ఉన్న తల్లిదండ్రుల కోసం ఓ కథ చెప్పుకుందాం… రావణాసురుడికిి జ్యోతిష శాస్త్రం మీద మంచి పట్టుంది… అఫ్కోర్స్, సకల విద్యాపారంగతుడు… మంచి పాలకుడు కూడా… కాకపోతే అహం తనను ఎప్పుడూ దారితప్పిస్తుంది…
Ads
తన కొడుకు మేఘనాథుడు… ఇంద్రజిత్ అని కూడా పిలుస్తాం… తను పుట్టే సమయానికి రావణుడు ఓ ఆలోచన చేశాడు… సరిగ్గా జనన సమయానికి నవగ్రహాలన్నీ జాతకచక్రంలో 11వ ఇంటిలోకి వచ్చి కూర్చోవాలి… 11వ ఇల్లు శుభసూచకం కదా… సో, ఆదేశించాడు… ఆ సమయానికి అన్ని గ్రహాలూ 11వ గడిలోకి వచ్చేయాలి అని…
రావణుడు ఆదేశిస్తే తలొంచని గ్రహమేముంది జగత్తులో… కిక్కుమనకుండా వచ్చేశాయి… ఐదో గడిలో కేతువును ప్రవేశపెట్టాడు… ఇవన్నీ తన కొడుక్కు అత్యంత బలమైన జాతకాన్ని సమకూరుస్తాయనీ, తను అమరుడు అవుతాడనీ, అజేయుడు అవుతాడనీ రావణుడు అంచనా వేశాడు… అన్నీ అలాగే జరిగితే అదీ జరిగేదేమో… కానీ..?
శని గ్రహం ఎదురు తిరిగింది… తను ఎవరి మాటా వినడు కదా… వీలు కాదు, నేను పన్నెండో గడిలో ఉంటాను, అన్నాడు, ఆ సమయానికి ఆ గడిలోనే ఉన్నాడు… ఆ గడి అశుభసూచిక కదా… పైగా కొలువుదీరిన శని… జ్యోతిషశాస్త్రంలో పన్నెండో గడి చెల్లించాల్సిన కర్మ ఫలాలకు (కర్మరుణం) సూచిక… దీంతో తన ప్లాన్ వర్కవుట్ కాలేదనే కోపంతో శనిని తన సింహాసనం కింద బందీగా ఉంచేస్తాడు రావణుడు…
సింహాసనం కింద నక్కి కూర్చోవడం ద్వారా శని తల కిందకే చూస్తుంటుంది… అందుకని శని వక్రదృష్టి తన కొడుకుపై గానీ, తనపై గానీ, తన రాజ్యంపై గానీ పడకూడదని రావణుడి చర్య వెనుక ఆలోచన… కానీ శని చూపు కాదు కదా ముఖ్యం, శని ప్రభావం చూపుకి అతీతం కదా… అసలే రావణుడి అహం, పైగా శని కోపం…
దాంతో అదుపు తప్పాడు… సీతను అపహరించడం తన ఆలోచనల వక్రగతి… అదే రామరావణ యుద్ధానికీ, రావణుడి వినాశనానికీ దారితీసింది… అమరుడు, అజేయుడు అవుతాడనుకున్న మేఘనాథుడు లక్ష్మణుడి చేతిలో మరణిస్తాడు…
ఈ రావణుడి కథలో చూపబడినట్లుగా, జ్యోతిషశాస్త్రం విధిని నియంత్రించడానికి ఒక సాధనం కాదు, కానీ విధి ఆటలో ఉన్న విశ్వ శక్తులను అర్థం చేసుకోవడానికి ఒక మార్గదర్శి… ఎస్, వ్యక్తి జనన సమయం ఏదైనా గానీ… ఆ సమయంలోని గ్రహస్థితి ఆ వ్యక్తుల జాతకాన్ని, భవిష్యత్తును నిర్దేశిస్తుంది… కృత్రిమ జనన ముహూర్తాలు జాతకాల్ని మార్చలేవు…
Share this Article