ఒలింపిక్స్ అనగానే… అదొక అంతర్జాతీయ వేడుక, అంతా నాగరికంగానే జరుగుతుంది అనుకుంటే అది మన భ్రమ… ప్రతి ఆటా మరీ మడత నలగని ఫైట్లేమీ కాదు… ఒళ్లు హూనమయ్యేవీ బోలెడు… కానీ ఇది మరో టైపు… అనాగరికం అనే పదం సరిపోదు, ఇంకేదో వెతకాలి… పేరుకు మనం క్రీడాస్పూర్తి, తొక్కాతోలూ అని మాట్లాడుతూ ఉంటాం… ఒక్కసారి ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది కొందరు క్రీడాకారులు ఎంత కచ్చగా వ్యవహరిస్తారో… ఇది చూస్తే ప్రతి క్రీడాభిమాని మనసు శూన్యమవుతుంది ఒక్కసారిగా… ఇదేం క్రూరత్వమో, ఒలింపిక్స్ అధికారులు ఎందుకు ఊరుకున్నారో తెలియదు… ఇదీ ఆ ఫోటో…
నిన్న రెజ్లింగులో మన రవి దహియా కజకిస్థాన్ ఆటగాడు సనయెవ్ మీద గెలిచాడు కదా… ఫైనల్స్‌కు వెళ్లాడు… మొదట్లో 2-9 తో వెనకబడినా సరే, చివరలో పుంజుకుని, ప్రత్యర్థిని ఊపిరాడకుండా చేసి, వరుసగా పాయింట్లు సాధించాడు… చివరకు ప్రత్యర్థిని మ్యాట్ మీదకు పూర్తిగా వంచేసి, విజయాన్ని కైవసం చేసుకున్నాడు… ఓ దశలో సనయెవ్ కచ్చగా రవి భుజాన్ని (బైసెప్స్) ఎంత గట్టిగా కొరికాడూ అంటే… ఈ ఫోటోలో చూడండి, లోతుగా దిగబడ్డయ్… ఇలాంటి ఉద్దేశపూర్వక చర్యలకు జరిమానాలో, మ్యాచుల నిషేధాలో విధించాలి కదా… మనవాళ్లేమీ ఫిర్యాదులు చేసినట్టు లేరు… ఒలింపిక్స్ అధికారులు కూడా ఏమీ పట్టించుకోలేదు… నిజానికి మ్యాచ్ అయిపోయాక ఇలాంటిది ఏదో జరిగినట్టు మనవాళ్లు బయటికి చెప్పనేలేదు… తరువాత వీడియోల్లో బయటపడింది… రవి రోబో టైపు కదా, కనీసం మొహంలో పెయిన్ కూడా కనిపించలేదు… సింపుల్‌గా ప్రత్యర్థిని మ్యాట్ మీదకు ఒత్తిపారేశాడు… తాపీగా పైకి లేచి నిలబడ్డాడు, అంతే… తన ఉద్వేగరహిత కేరక్టర్ మనం నిన్న చెప్పుకున్నాం కదా… ఇదీ లింక్…
Ads
అచ్చం తెలుగు హీరో ఫైట్..! చివరి క్షణాల్లో ప్రత్యర్థిని ఊపిరి కూడా పీల్చనివ్వడు..!!
మ్యాచ్ అయిపోయాక మన కోచ్ ఆ గాయం మీద ఐస్ ప్యాక్ పెట్టాడు, రక్తం ఏమీ కారలేదు… పెద్దగా పెయిన్ లేదు, ఉన్నా రవి పట్టించుకోడు… ఫైనల్‌కు రెడీగా ఉన్నాడు… కానీ ఆటల్లో క్రుయాలిటీ మీద చర్చ జరగాలి… అయితే ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి… ఇలాంటి విషయాల్లో మన చరిత్ర ఏమీ స్వచ్ఛమైందేమీ కాదు… లండన్ ఒలింపిక్స్… మన సుశీల్ కుమార్ ఇదే కజకిస్థాన్ దేశపు ఆటగాడైన అజురెక్ తనత్రోవ్ తో పోటీ… సేమ్, ఇప్పటిలాగే అప్పుడూ సెమీ ఫైనలే… సుశీల్ 0-3తో వెనకబడి ఉన్నాడు… అజురెక్ దూకుడు మీదున్నాడు… అప్పుడు సుశీల్ అజురెక్ చెవిని గట్టిగా కొరికేశాడు… రక్తం కారింది… తనత్రోవ్ కారుతున్న రక్తాన్ని రెఫరీకి చూపించాడు కూడా… కానీ సుశీల్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు ఏమీ చేయలేదు… తరువాత సుశీల్ ఫైనల్స్‌కు వెళ్లాడు, కానీ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది… సో, అదే కజకిస్థాన్, అదే సెమీ ఫైనల్… ఇప్పుడు ఓ ప్రతీకారం టైపు సంఘటన చోటుచేసుకుంది… అప్పుడు జరిగింది కాబట్టి, మనమూ ఫెయిర్‌గా లేం కాబట్టి ఇప్పుడు దీన్ని తప్పుపట్టకూడదని ఏమీ లేదు… తప్పు ఎప్పుడైనా తప్పే… ఎవరు చేసినా తప్పే..!!
Share this Article