ఒక వార్త… ఒక ప్రోమో… ఏమిటంటే..? వెటరన్ యాంకర్ ఉదయభాను టీవీల్లోకి రీఎంట్రీ… జీతెలుగు వాడయితే ఓ ప్రోమో రిలీజ్ చేస్తూ గోల్డెన్ లేడీ ఆఫ్ జీతెలుగు ఈజ్ బ్యాక్ అని గొప్పగా చెప్పుకున్నాడు… ఆమె జీతెలుగు టీవీకి ఏం గొప్ప సర్వీస్ అందించిందో తెలియదు గానీ ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం రేలారేరేలా… అది మాటీవీలో వచ్చేది… సరే, చాలా షోలకు కూడా హోస్ట్‌గా, యాంకర్‌గా చేసింది… కొన్ని సినిమాల్లో చేసింది, అదేదో సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది…
ఉదయభానుకు పెద్ద పరిచయం అక్కర్లేదు… అసలు ఈ సుమ, ఈ ఝాన్సీ, ఈ శ్రీముఖి ఎట్సెట్రా యాంకర్లు తెరప్రవేశం చేయకముందే ఉదయభాను ప్రవేశించింది… స్పాంటేనిటీ, ఎనర్జీ, సరైన ఉచ్ఛారణ, కలివిడితనం, నవ్వు, సభ్యత ఆమెకు అస్సెట్స్… కాకపోతే రీఎంట్రీ ఇప్పుడు ఏమిటనేది ప్రశ్న… తన పర్సనల్ లైఫ్‌ను, తన కెరీర్‌ను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేక, ప్లానింగ్ చేసుకోలేక, అవకాశాల్ని- తన పాపులారిటీని సరిగ్గా వినియోగించుకోలేక ఆమె తెరమరుగైంది… చాన్నాళ్ల తరువాత రెండేళ్ల క్రితం కావచ్చు, రీఎంట్రీ చేసింది…
రెండేళ్ల క్రితం కేరళలో ఇదే జీతెలుగు వాడు ఓ పండుగ స్పెషల్ షో చేశాడు… సుమ హోస్ట్ కాదు, అతిథిగా కనిపించింది… కేరళలో సంక్రాంతి అల్లుళ్లు అనే పేరిట రెండురోజులపాటు చేసిన ఆ షోలో ఉడయభానే యాంకరింగు… కాకపోతే బంగార్రాజు ప్రమోషన్, నాగార్జున భజన ఎక్కువై ఆ షో ఫ్లాపయింది… అది వేరే సంగతి… తరువాత ఏదో స్టార్ మా పండుగ స్పెషల్ షోలో కనిపించింది, అంతే ఇక మళ్లీ కనిపించలేదు… అదేదో లోకేష్ పాదయాత్రకు లింకు కార్యక్రమంలా ఏవో షోలు చేసింది… అబ్బే, రాజకీయాలకు సంబంధం లేదు… నేను బీసీ గళమెత్తడానికి వచ్చాను అని చెప్పుకుంది… ఏపీలో బీసీ గళమేమిటి..? ఉద్దేశం ఏమిటి..? ఆమెది తెలంగాణ, సుల్తానాబాద్…
Ads
‘నేను అయిదేళ్లుగా టీవీల్లో కనిపించడం లేదు… కుట్ర పన్నారు… ప్రశ్నించే గళాన్ని ఎప్పుడూ తొక్కడానికే ప్రయత్నిస్తారు… అలుపు లేకుండా ప్రయత్నిస్తూ మళ్లీ మీముందు కనిపిస్తున్నాను, నిలబడగలిగాను’ అని చెబుతూ పోయిందామె ఆ షోలలో… ఈ వ్యాఖ్య కొంత ఆశ్చర్యంగా, ఆసక్తికరంగానూ అనిపించింది… ఎందుకంటే..? ఆమెను తొక్కాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది..? ఎందుకు ఉంటుంది..?
అప్పట్లో ఆమె రేలారేరేలా వేదికగా.. గద్దె కోసమే గాడిద కొడుకుల గత్తర లేపెరా అంటూ అప్పటి రాజకీయాలపై నిప్పులు కురిపించింది… ఆ వాక్యాలు వివాదాన్ని రేకెత్తించాయి… ఆ పాట ఎవరిని తాకింది..? ఎవరెందుకు ఆమె కక్ష కట్టారు..? ఈ మిస్టరీని ఆమె ఎప్పుడూ నేరుగా చెప్పదు… అంత ధైర్యంగా గళం విప్పిన ఆమె తనపై కక్ష కట్టినవాళ్లు ఎవరో మాత్రం చెప్పదు…
ఆమే చెబుతోంది… ఆ పాట తరువాతే తన మీద కక్షలు ప్రయోగించారని…! అందుకే టీవీల్లో తనకు అవకాశాలు తగ్గిపోయాయని ఆమె ఆరోపణ (దిగువ వీడియో క్లిప్పింగ్ చూడండి)…
గంగ గరుడాలెత్తుకెళ్ళేరా..ఇంక ఆంబోతులాట సాగేరా… ఎండినా దుక్కుల్ల సూడు, ఎన్నడెండని కండ్లు సూడు , భూమి బుగ్గై పోయె.. సూడు బొంద గడ్డల జోరు సూడు….. ఎవ్వారొ ముద్దు బిడ్డలెందుకనొ పరుగెట్టినారు, ఎర్రనీ మడుగుల్ల మునిగి ముద్దలాయె ముద్దు బిడ్డల్, బోరు బోరుగ గండమోర్లు పెట్టి గుండె పగిలే తల్లులు, ఈ కడుపుకోతలు నార్పెదెవ్వరు రా, ఆ కలుపు మొక్కల కాల్చెదెవ్వడు రా…. గోండ్రు కప్పలు గుంట నక్కలు కాకి కూత కోడెనాగులు .. గద్దె కొరకే గాడ్దికొడుకుల్ గత్తారా లేపేరురా, ఇది మారీచులాటరా నువ్ మర్మమెరుగర పామరా, ఆడు తెస్తడొ, ఈడు తెస్తడు, అవ్వ ఇస్తదొ అయ్య తెస్తడొ, ఎవ్వడిచ్చెదేంది రా ఇది ఎవ్వనీ జాగీరురా…. అంటూ పాడింది ఆమె… సొంత రచన… ఇది ఎవరికి కోపం తెప్పించింది..? ఆమె మీద కక్ష కట్టాల్సినంత రేంజ్ ఉందా ఆమెకు..? చానెళ్లకు ఫోన్లు చేసి మరీ తన చాన్సులను దెబ్బతీశారా..? ఆమె తనకు తాను ఎక్కువ ఊహించుకుందా..?
సరే, ఎవరీ ఉదయభాను..? ఆమె అధికారిక వయస్సు 44 ఏళ్లు… ఎస్, మొదట్లో ఆమె ఎనర్జీ, స్పాంటేనిటీ, స్పందించే గుణం ఆమెను టాప్ యాంకర్‌గా నిలిపాయి… కానీ ఆమెకు కుటుంబ సమస్యలున్నయ్… ఆమె తండ్రి డాక్టర్, తల్లి ఆయుర్వేద వైద్యురాలు. తండ్రి ఒక కవి. ఆయన కలంపేరు ఉదయభాను. దానినే కూతురుకు పెట్టాడు. ఆయన ఉదయభానుకు నాలుగేళ్ళ వయసులో చనిపోయాడు. ఆయన చనిపోయాక తల్లి ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకొంది. అతడికి ఏడుగురు సంతానం. భానుకు 15 వ ఏట ఒక ముస్లింతో వివాహం జరిగింది. ఆమెకు ఇష్టం లేకపోవటం వలన విడాకుల అనంతరం విజయకుమార్ అనే అతడిని తల్లి అనుమతికి వ్యతిరేకంగా వివాహం చేసుకొన్నది. ఎంఏ వరకూ చదివింది… ప్రస్తుతం భర్త శ్రీనివాస్ అని వికీపీడియా చెబుతోంది… సో, పెళ్లి, చికాకులతో కొన్నాళ్లు సఫరయింది… ఇద్దరు పిల్లలు…
క్రమేపీ వయస్సు పెరుగుతుండటం, కొత్త యాంకర్లు చాలామంది దూసుకురావడంతో ఈమె వెనుకబడిపోయింది… ఇప్పుడు కాస్త మళ్లీ తెరపైకి వచ్చి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని అనుకోవచ్చుగాక… తప్పులేదు, కానీ గతంతో పోలిస్తే హోస్టింగ్, యాంకరింగ్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి… కాలానికి తగ్గట్టు సుమ మారుతూ, ఈరోజుకూ నంబర్ వన్ ప్లేసులో ఉంది… ఆమెను ఉదయభాను రీప్లేస్ చేయగలదా..? పోనీ, కనీసం పోటీ ఇవ్వగలదా..?
సరే.., ఆ జీతెలుగు వాడి ప్రోగ్రాం ఏమిటంటే..? సూపర్ జోడీ పేరిట డాన్స్ షో… ఈమె హోస్ట్… మీనా, శ్రీదేవి, రఘు మాస్టర్ జడ్జిలు… దాదాపు ఇలాంటిదే సెలబ్రిటీ డాన్సు పోటీలను ప్రస్తుతం ఈటీవీ ఢీషోలో నిర్వహిస్తున్నారు… పైగా డాన్స్, కామెడీ ఎట్సెట్రా రియాలిటీ షోలలో జీతెలుగు ఎప్పుడూ సక్సెస్ కాలేదు… ఏమో ఉదయభాను లక్కు కొద్దీ ఇది క్లిక్కవుతుందేమో చూడాలిక.. !!
Share this Article