తిరుపతిలో అడుగు పెట్టింది మొదలు… ప్రతిదీ వ్యాపారమే… ప్రతి దానికీ రేటు… అన్నీ అమ్మకానికే…! ఎంతసేపూ డబ్బు, ఆదాయం… ఇదే యావ… ఇదే ధ్యాస…! మనం ఇచ్చే కేశాలూ అమ్మేస్తారు, మనం ఇచ్చే కానుకలూ వేలం వేస్తారు, గుడి ఆస్తులనూ అమ్మకానికి పెడతారు, దేవుడికి ఇచ్చే బట్టలూ అమ్మేయాల్సిందే… ప్రసాదం అమ్మకమే… వసతి అమ్మకమే… దర్శనం, విశేష సేవలూ అమ్మకమే… ఆర్జిత సేవలు అనే పదంలోనే ఆర్జన అభిలాష ఉంది కదా… ఇప్పుడు కనిపించిన ఒక వార్త మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది… అదేమిటంటే..? దేవుడి పూజ కోసం వాడిన పూలనూ సంపాదనకు వాడేస్తారట… రీసైక్లింగ్ అనండి, పునర్వినియోగం అనండి, దుర్వినియోగం అనండి, ఏ పేరైనా పెట్టుకొండి… కానీ అది తిరుమల ఆగమ వ్యతిరేకం… తొలుత ఈ ప్రతిపాదన చేసిన ఓ కార్యనిర్వహణాధికారి తన కెరీర్ చివరలో చాలా పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది… అవునూ, ఈ పూలను ఎలా అమ్ముతారు, ఎవరు కొంటారనే కదా మీ ప్రశ్న…
తిరుమలలో, ఆ దేవస్థానం ఆధీనంలో ఉన్న ఇతర ఆలయాల్లో కలిపి రోజూ దాదాపు ఒక టన్ను పూలను వినియోగిస్తారు… కొన్ని పూలను తమిళనాడు, కర్నాటకల నుంచి కూడా తెప్పిస్తుంటారు… రెండు పూటలా సాగే పుష్పాలంకరణకు టీటీడీ సొంత పూలవనాల్లో పూచే పూలు సరిపోక బయటి నుంచి కొనాల్సి ఉంటుంది… ఇక పుష్పయాగం వంటి ప్రత్యేక సందర్భాల్లో స్వామి పూజకు వాడే పూలు మరీ ఎక్కువ… సంపంగి, మరువం, కనకాంబరం, తులసి, మల్లెలు వంటి అనేక రకాల పూలను వాడతారు… వర్ణ సమ్మేళనం, పరిమళం ముఖ్యం… మరి పూజ అయ్యాక ఈ పూలను ఏం చేస్తారు..? ఇదీ అసలు ప్రశ్న… ఎక్కడపడితే అక్కడ పడేయకుండా… స్వామి వారి సేవకు వాడిన పరిమళద్రవ్యం కాబట్టి వాటిని ప్రత్యేకమైన పూలబావిలో నిమజ్జనం చేస్తారు… ఒకటి నిండిపోగా, ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మరో బావిని వాడుతున్నారు… ఒకసారి దేవుడికి వాడిన పూలను మళ్లీ వినియోగించడం ఆగమవ్యతిరేకం… అందుకని తిరుమల శ్రీవారికి వాడిన పూలను మినహాయించి, టీటీడీ ఆధ్వర్యంలోని ఇతర గుళ్లలో వాడే పూలను ఒక్కచోటకు చేర్చి, అగరుబత్తీలు తయారుచేసి అమ్మాలనేది తాజా ప్రతిపాదన అట…
Ads
గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈవోగా ఉన్నప్పుడు పూలను పొడిగా మార్చి భక్తులకు అమ్మాలని యోచించాడు… ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు… తరువాత ఎవరూ వాడిన పూల పునర్వినియోగం, సద్వినియోగం గురించి ఆలోచించలేదు… ఇప్పుడు అగరుబత్తీల ఆలోచన వచ్చింది… ఇప్పటికే గోపంచగవ్యాలతో రకరకాల పదార్థాల్ని తయారుచేసి భక్తులకు విక్రయించే ఆలోచన ఉంది… తిరుమల గుడిని మినహాయించినా ఇతర గుళ్ల నుంచి రోజూ 5 క్వింటాళ్ల పూలు వస్తాయి… వాటితో అగరుబత్తీలు చేస్తారట… అవునూ, తిరుమల శ్రీవారి ఆగమానికి వ్యతిరేకమైన పూల పునర్వినియోగం అదే దేవుడి ఆధీనంలోని ఇతర గుళ్లలో ఆగమవ్యతిరేకం కాదా..? ఇలాంటివి అడిగితేనే పాలకవర్గానికి కోపం వస్తుంటుంది… డబ్బు, ఆదాయం… డబ్బు, ఆదాయం… ఇదే లోకం… ఇదే సర్వస్వం… అవునూ, అగరుబత్తీలేనా..? సెంట్లు, టాల్కమ్ పౌడర్, సబ్బులు గట్రా ఇతరత్రా ఆలోచనలు కూడా చేస్తున్నారా సార్..?
Share this Article