రామోజీరావు వ్యతిరేక శిబిరంలో కూర్చుని ఆలోచిస్తే ఆయన అడుగులు మహాపాతకాలు అనిపించవచ్చుగాక… కానీ ఆయన క్యాంపు కోణంలో చూస్తే మటుకు తన దూరదృష్టి, తన ప్లానింగు, తన ఇంప్లిమెంటేషన్ తీరు, తన పాచికలు అద్భుతం అనిపిస్తాయి… ఇప్పుడు ఆయన పాపం, ఈ వృద్దాప్యంలో ఎవరికీ ఏమీ ఆనకపోవచ్చుగాక, కానీ తను ‘‘ఆట ఆడిన కాలంలో’’ మాత్రం అనితరసాధ్యుడు… నిజానికి ఈనాడు లేక ఎన్టీయార్ పార్టీ లేదు, దాని దూకుడు లేదు, తెలుగుదేశం ప్రభే లేదు… అప్పుడే కాదు, చంద్రబాబు హైజాక్ చేసిన తెలుగుదేశానికి కూడా రామోజీయే ఆలంబన, ఆక్సిజెన్… కులమా, స్వార్థమా, కాంగ్రెస్ వ్యతిరేకత, ఇంకేదైనా కారణమా..? ఏమైనా కావచ్చు… ఒక ఉదాహరణ చెప్పుకోవాలి… అకస్మాత్తుగా చర్చల్లోకి వస్తోంది అది… అసలు ఎన్టీయార్ పార్టీ స్థాపనకు ఓ భూమికను క్రియేట్ చేసి, పార్టీకన్నా ముందే ‘‘తెలుగువాడి ఆత్మగౌరవం’’ అనే ఓ డ్రైవింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందీ రామోజీరావే… ఎవరు చెప్పారు..? ఏమిటీ సంగతి..? ఓసారి చెప్పుకుందాం…
అది హీరోగా ఎన్టీయార్ సినిమా కెరీర్ మెల్లిమెల్లిగా ఖతం అయిపోతున్నవేళ… వయస్సు మళ్లుతోంది.., అప్పటికే రాజ్యసభ ఇవ్వకపోవడంతో అవమానం భరించలేక కాంగ్రెస్ మీద కారాలుమిరియాలు నూరుతున్నవేళ… కులపెద్దలతో రహస్య భేటీలు వేసుకుని, రాష్ట్రంలో పొలిటికల్ స్పేస్ ఉందని గుర్తించి, ఇక సొంత పార్టీ పెట్టాలనే ఆలోచనకు వచ్చినట్టున్నాడు… సహజంగానే అప్పట్లో ఈనాడు రోజూ ఓ సంచలనమే కదా… రామోజీరావుకు అనుకోకుండా ఓ చాన్స్ దొరికింది… మామూలు బుర్ర కాదు కదా… అప్పట్లో రాజీవ్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చాడు… సీఎం అంజయ్య… మెతక, మంచివాడు, విధేయుడు, పేదల మనిషి… మరి వచ్చిందేమో రాజీవుడు… ఇందిర కొడుకు… సహజంగానే కాంగ్రెస్‌లో ఈ భజనలు ఎక్కువే కదా, పైగా ఆమె నియంత… అంజయ్య విమానాశ్రయం వెళ్లాడు, ఆ హడావుడి, కార్యకర్తల హంగామా, నాయకుల సందడి రాజీవ్‌కు చిరాకెత్తించాయి… తను నిజంగానే రాజకీయాల పట్ల అప్పటికి అయిష్టుడు… అంజయ్యను వదిలేసి హెలికాప్టర్లో తన షెడ్యూల్డ్ పర్యటనకు వెళ్లిపోయాడు, పాపం, అంజయ్య చిన్నబుచ్చుకుని వెనుదిరిగాడు…
Ads
అప్పుడు టీవీలు లేవు, సోషల్ మీడియా లేదు, ఉన్న పత్రికలు కూడా మూడునాలుగే… ఈనాడు ఫోటోగ్రాఫర్ కేశవులు సీఎం అంజయ్య మీద రాజీవ్ చిర్రుబుర్రులు ఎక్స్పోజ్ అయ్యేలా ఫోటోలు తీశాడు… అప్పుడు ఎంవీఆర్ శాస్త్రి బ్యూరో ఇన్చార్జి… సాయంత్రానికి రామోజీరావు ఎప్పటిలాగే ‘ఎడిట్ మీటింగ్’ పెట్టేసి ‘ఏమున్నయ్ ముఖ్యమైన వార్తలు ఈరోజు’ అనడిగాడు… వీళ్లేదో చెప్పారు… రామోజీరావు బుర్రలో ఫ్లాష్ వెలిగింది… కాసేపాగి… ఏడెనిమిది ఫోటోలు సెలెక్ట్ చేసి, ఎడిషన్ పెద్దల వైపు సాలోచనగా చూశాడు… వాళ్లకు ఆయన భావం అర్థమైంది… ఆ ఫోటోలను ఓ సీక్వెన్స్‌లో పెట్టేసి, తెలుగువాడి ఆత్మగౌరవం భీకరంగా దెబ్బతినిపోయింది, ఓ ముఖ్యమంత్రి గౌరవానికే దిక్కులేదు అని పక్కాగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఫస్ట్ పేజీలో వీర లెవెల్లో ఓ సగం కుమ్మేశారు… తమ భాషా మెళకువల్ని కూడా అద్భుతంగా ప్రయోగించారు… రామోజీరావు ‘‘నేను అనుకున్నట్టుగా వీళ్లు పేజీలో ఆ వార్తను ప్రజెంట్ చేశారా లేదా’’ అని డౌటొచ్చి, రాత్రి పదకొండుకు ఓ కాంగ్రెస్ నాయకుడిని వెంటేసుకుని ఆఫీసుకు వచ్చి చెక్ చేశాడట… అది ఎంవీఆర్ శాస్త్రి చెబుతున్న సంగతే… ఈ వీడియో చూడండి, క్లారిటీ వస్తుంది…
(ఈ వీడియో ఐడ్రీమ్ పోస్ట్ సౌజన్యంతో…)
అంటే ఏమిటి..? తెలుగుదేశం స్థాపనకు తగిన ఓ నినాదాన్ని, ఓ పొలిటికల్ ఐడియాలజీని అప్పటికప్పుడు ఆ వార్త ఆధారంగా క్రియేట్ చేసేశాడు రామోజీరావు… దాన్నిక జనంలోకి తీసుకెళ్లి వోట్ల పంట కోసుకోవడమే ఎన్టీరామారావు పని… అనుకున్నట్టుగానే ఆ నినాదం బీభత్సంగా పేలింది… కాంగ్రెస్ క్యాంపు కకావికలం… దెబ్బకు అధికారం కాస్త ఎగిరొచ్చి ఎన్టీయార్ ఒడిలో పడింది… తరువాత ఎన్టీయార్‌కూ రామోజీకి ఎందుకు పడలేదనేది వేరే కథ… అది మళ్లీ ఏ దగ్గుబాటి వెంకటేశ్వరరావో రాయాల్సిందే… (ఆల్రెడీ కొంత ఇప్పటికే ఏదో బుక్కులో, ఫేస్ బుక్కులో కూడా రాసినట్టున్నాడు…)… ఎహె, మీడియాతో ఏమవుతుంది..? ఏం సాధించగలదు..? అనే ప్రశ్నలకు రామోజీరావు దశాబ్దాల క్రితమే చెప్పిన జవాబు ఇది… పత్రికొక్కటి చాలు పదివేల సైన్యం అనేవాళ్లు కదా అప్పట్లో… రామోజీరావు దాన్ని ‘పత్రికొక్కటి చాలు పదివేల పచ్చ సైన్యం’ అన్నట్టుగా మార్చేసి, తెలుగుదేశం వ్యవస్థాపక అనుబంధ విభాగంగా పనిచేయించాడు… ఎస్, పత్రిక, టీవీ చాలా చేయగలవు… కానీ వాటి వెనుక రామోజీరావు వంటి పదునైన భారీ బుర్ర ఉండాలి… ఇప్పుడున్నవి ఉత్త డప్పులే తప్ప ఇలాంటి ప్లానింగులు కలలో కూడా ఆలోచించలేవు..!!
Share this Article