రూపాయి పెట్టుబడి పెడితే ఎంత వచ్చింది..? ఎంత పోయింది…? ఇదే అసలు లెక్క… సినిమా అయినా వ్యాపారమే కదా… వ్యాపార పరిభాషలోనే అసలు లెక్కలు తీయాలి… సినిమా ప్రచారం కోసం చెప్పే దొంగ వసూళ్ల లెక్కలు ఎలాగున్నా… కొన్నాళ్లకు అసలు లెక్కలు బయటపడాల్సిందే కదా… నిర్మాత కొత్త చొక్కా కళకళలాడిందో, నెత్తిమీద ఎర్ర తువ్వాల పడిందో తెలియాల్సిందే కదా…
2022… అయిపోబోతోంది… మొదట్లో హిందీ సినిమాలు అడ్డంగా ఫెయిలై బాలీవుడ్‌ను తీవ్ర ఆందోళనలో పడేసింది… సినిమా పరాజయాలకన్నా సౌత్ సినిమాల హిందీ డబ్బింగులు వేల కోట్లను కుమ్మేసుకోవడం బాలీవుడ్ పెద్దలకు అసహనాన్ని, అసంతృప్తిని, ఆగ్రహాన్ని, ఆందోళనను కలిగించింది… వాళ్ల అహం దెబ్బతింది… కాకపోతే ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా మళ్లీ హిందీ సినిమాలు జనాన్ని రప్పించుకుంటున్నాయి…
ఇంతకీ ఈ సంవత్సరం టాప్ 10 వసూళ్లు సాధించిన సినిమాల అసలు లాభశాతం ఎంత..? మునిగారా..? తేలారా..? కేవలం థియేటరికల్ కోణమే తీసుకుందాం… శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కుల డబ్బుల లెక్క వేరు… ఈ సంవత్సరం టాప్ వన్ అంటే కేజీఎఫ్-2… 1228 కోట్లు వసూలు చేసినట్టు ఫైనల్ లెక్క తేల్చారు… కానీ షేర్ 625 కోట్లు… పెట్టుబడి పెట్టింది 150 కోట్లు… అంటే రూపాయికి నాలుగు రూపాయల లాభం… సూపర్ హిట్…
Ads
సెకండ్ ప్లేస్ ఆర్ఆర్ఆర్… వరల్డ్ వైడ్ కలెక్షన్లు 1131 కోట్లు… అందులో షేర్ 611 కోట్లు… కానీ పెట్టిన పెట్టుబడి 425 కోట్లు అంటున్నారు… (ఇది పక్కా మేనిప్యులేటెడ్ ఫిగర్ అనే విమర్శ కూడా ఉంది… ) సో, రూపాయి పెట్టుబడికి రూపాయిన్నర మాత్రమే వచ్చింది… రూపాయికి ఆఠాణా లాభం… అసలు ఆర్ఆర్ఆర్ లెక్కల్లోనే ఏదో గందరగోళం కాబట్టి దాన్ని వదిలేస్తే… పొన్నియన్ సెల్వన్-1 వసూళ్లు 500 కోట్లు… షేర్ 242 కోట్లు… పెట్టిన ఖర్చేమో 210 కోట్లు… అంటే పెద్దగా లాభమేమీ లేదు… పెట్టుబడి వచ్చింది… కన్నడ, తెలుగు, హిందీ ప్రేక్షకులు పెద్దగా రిసీవ్ చేసుకోలేదు…
విక్రమ్ సినిమా షేర్ 215 కోట్లు, నిర్మాణవ్యయం 115 కోట్లు… ఇన్‌ఫ్లేటెడ్ ఫిగర్ అంటారు మరి… బట్, లాభశాతం లెక్కల్లో రూపాయికి మరో రూపాయి అదనంగా వచ్చినట్టే… అసలు ఈ సినిమా ఈమేరకు హిట్టవుతుందని ఆ టీమే అనుకోలేదు… బ్రహ్మాస్త్ర గురించి చెప్పాలి… వసూళ్ల మీద తప్పుడు ఫిగర్స్ కుమ్మారు కొన్నిరోజులు… తీరా చూస్తే… దాని పెట్టుబడి 315 కోట్లు… వచ్చిన నెట్ షేర్ 181 కోట్లు… వెరసి రూపాయికి 40 పైసలు బొక్క… ఇదీ దీని అసలు లెక్క… ఇక ఇతరత్రా రెవిన్యూ ఆదుకోవాల్సిందే…
కాంతార ఖర్చు 15 కోట్లు… ఇప్పటికి నెట్ షేర్ (ఇంకా ఆడుతోంది) 179 కోట్లు… అంటే రూపాయి పెట్టుబడికి 11 రూపాయల లాభం… తెలుగు, హిందీ రైట్స్ కారుచౌకగా కొన్నవాళ్లకైతే డబ్బే డబ్బు… ఉదాహరణకు తెలుగులో 2 కోట్లకు కొంటే 50 కోట్లు వచ్చిపడ్డయ్… పెట్టుబడి- లాభశాతం లెక్కల్లో కాంతర రికార్డును ఇప్పట్లో ఎవ్వడూ బ్రేక్ చేయలేడు… అంతటి అనూహ్య లాభం…
ఇదే రీతిలో విజయాన్ని, డబ్బుల్ని సొంతం చేసుకున్న సినిమా ది కాశ్మీర్ ఫైల్స్… పెట్టింది 20 కోట్లు… నెట్ షేర్ 150 కోట్లు వచ్చింది… అంటే రూపాయికి ఆరు రూపాయల లాభం… ఇదీ అనూహ్యమైన సక్సెసే… భూల్‌భులయ్యా-2 పెట్టుబడి 75 కోట్లు, వచ్చిన నెట్ షేర్ 115 కోట్లు… హిందీ సినిమాల గడ్డురోజుల్లో ఈమాత్రం లాభం వచ్చిందంటే గ్రేటే…
బీస్ట్ సినిమాకు పెట్టిన ఖర్చు 130 కోట్లు… వచ్చిన నెట్ షేర్ 116 కోట్లు… అంటే అసలుకే బొక్క… వెరసి ఫ్లాప్… గంగూభాయ్ సినిమాకు 125 కోట్లు ఖర్చు పెట్టారు… (డౌట్ ఫుల్ ఫిగర్)… వచ్చిన నెట్ షేర్ 90 కోట్లు… వెరసి రూపాయికి చారాణా బొక్క… పేరుకు హిట్… అసలు లెక్క ఇదీ… ఐతే ఇతరత్రా ఆదాయం వస్తోంది కాబట్టి గట్టెక్కుతున్నయ్ ఇలాంటి సినిమాలు… వెరసి 2022 సంవత్సరమే కాదు, ఈమధ్యకాలంలో పెట్టుబడి- లాభశాతం కోణంలో కాంతార బంపర్ హిట్… ఇంకా డబ్బు వచ్చిపడుతూనే ఉంది..!!
Share this Article