ఎవరు ఇండియా సూపర్ స్టార్..? ఎవరు బాద్‌షా..? వందేళ్లు దాటిన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్ ఎవరు..? అమితాబ్, రజినీ, షారూక్, ప్రభాస్… ఎవరూ కారు… ఆయన 400 హిట్స్, 50 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సూపర్ స్టార్లకే సూపర్ స్టార్… ఆ రికార్డు ఎవరికీ చేతకాదు… 20 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా ఒక ఇండస్ట్రీని శాసించిన ఆయన పేరు ప్రేమ్ నజీర్…
వందేళ్లు దాటింది కదా ఇండియాలో సినిమా మొదలై… బోలెడు మంది సూపర్ స్టార్లు వచ్చారు, పోయారు, ఇంకా ఉన్నారు, వస్తారు… అప్పటి సైగల్ నుంచి ఇప్పటి ప్రభాస్ దాకా… బాక్సాఫీసు బాద్‌షాలు, టాప్ స్టార్లు పేర్లతో అనేకమంది… ఎక్కువ సక్సెస్‌ఫుల్ హీరో ఎవరు అనే ప్రశ్నకు ప్రేమ్ నజీర్ పేరే వినిపిస్తుంది… తన ట్రాక్ రికార్డు అదీ…
ఇప్పటి కలెక్షన్ల లెక్కల్లో చూడొద్దు… ఆ కాలంలో ఆ ఇండస్ట్రీ ఆర్థిక వాతావరణాన్ని బట్టి ఒక సినిమా ఎన్ని రోజులు ఆడింది, ఎంత వసూలు చేసిందనే పారామీటర్స్‌లో సినిమా విజయాన్ని కొలవాలి… అలా చూసినప్పుడు 400 బిగ్గెస్ట్ హిట్స్, అందులోనూ 50 బ్లాక్ బస్టర్లు అంటే మాటలు కాదు… తను బేసిక్‌గా మలయాళీ హీరో… తన సినిమాలన్నీ ఆ భాషలో వచ్చినవే… కానీ ఆ రాష్ట్రంలో, ఆ భాషలో హిట్ల రేంజ్ పరిగణనలోకి తీసుకోవాలి…
Ads
1950 ప్రాంతంలో మొదలుపెట్టి, తను మరణించిన 1989 వరకూ… దాదాపు 900 సినిమాల్లో చేశాడు తను… వాటిల్లో 720 సినిమాలు తన హీరోగా చేసినవే… నిజానికి హీరోగా అన్ని సినిమాలు చేయడం గిన్నీస్ వరల్డ్ రికార్డు… వాటిల్లో 420 హిట్లు, అందులో 50 బ్లాక్ బస్టర్లు అంటే… ఈరోజుకూ ఆ రికార్డును ఎవరూ టచ్ చేయలేదు, చేయబోరు కూడా…
తనతో పోలిస్తే ఏ బాలీవుడ్ హీరో నిలబడడు… ఎవరికీ వందకు మించి హిట్లు ఉండవు… అంతెందుకు..? అమితాబ్ బచ్చన్‌నే తీసుకుంటే తన కెరీర్‌లో సూపర్ హిట్ సినిమాలు 56… ఒక దశలో బాలీవుడ్ ఏలిన రాజేష్ ఖన్నా హిట్ల సంఖ్య 42 మాత్రమే… షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లవి కూడా మహా అయితే 30 కి అటూఇటూ… ఆ కేరళ పక్కనే తమిళనాడును దున్నేసిన రజినీకాంత్ హిట్ల సంఖ్య కూడా వంద దాటలేదు… ష్, ముగ్గురు ఖాన్లు, అమితాబ్, రజినీ, ప్రభాస్… అందరి హిట్లూ కలిపినా ప్రేమ్ నజీర్ దాకా రాలేరు…
సరే, బ్లాక్ బస్టర్ల సంఖ్యకే వస్తే… సల్మాన్ ఖాన్ 15, రజినీకాంత్ 13… కానీ ప్రేమ్ నజీర్ బ్లాక్ బస్టర్లు 50… (ఇదంతా డీఎన్ఏ వెబ్ స్టోరీ ప్రకారం…) సరే, ఇంతకీ ఎవరీ ప్రేమ్ నజీర్..? ట్రావెన్‌కోర్ అనబడే పాత సంస్థానంలో 1926లో పుట్టాడు, అసలు పేరు అబ్దుల్ ఖాదర్…
చిన్నప్పుడే నాటకాల్లో నటించేవాడు… చదువైపోయాక 1952లో వెండితెర మీదకు వచ్చాడు… విసప్పింటె విలి అనే సినిమాలో లీడ్ రోల్ చేయడానికి ముందు మరుమకల్ అనే సినిమాలో చేశాడు… ఆ సినిమాలు చేస్తున్నప్పుడే తన పేరును ప్రేమ్ నజీర్‌గా మార్చారు… 60, 70 లలో ఇక వెనక్కి తిరిగి చూడలేదు, రొమాంటిక్, పౌరాణిక, యాక్షన్, ట్రాజెటీ, చారిత్రక… అది ఇదని ఏమీ లేదు… అన్ని జానర్లూ మడతపెట్టి కొట్టాడు…
ఇరవై ఏళ్ల పాటు ప్రతి సంవత్సరమూ ఓ డజన్ హిట్స్ పడేవి తన ఖాతాలో… ఎప్పుడైతే యాభైలోకి వచ్చాడో ఇక హీరోగా నటించడం మానేసి సపోర్టింగ్ పాత్రల్లోకి మారాడు… అప్పటికే కొత్త నీరు వస్తోంది మలయాళ ఇండస్ట్రీలోకి… సింపుల్‌గా తను తప్పుకుని వేరేవాళ్లకు దారిచ్చేశాడు… నడుం వంగిపోయినా, బద్దలు కట్టుకుని స్టెప్పులు వేసే ఈకాలపు వృద్ధ హీరో కాదు ఆయన… 1989లో మీజిల్స్‌తో చనిపోయాడంటే ఆశ్చర్యమే… మరణించాక కదథానదన్ అంబడి అనే తన సినిమా రిలీజైంది… ఇప్పుడు చెప్పండర్రా… రియల్ హీరో ఆఫ్ ఇండియా ఎవరో…!!
Share this Article