ఈరోజు పత్రికల్లో నచ్చిన వార్త ఇది… ఈనాడులో ఓ సింగిల్ కాలమ్ వార్త… మిగతావాళ్లకు ఆనినట్టు లేదు… ముందుగా వార్త చదవండి… దుబాయ్‌లో ఉండే బంగారం వ్యాపారి ఫిరోజ్ మర్చెంట్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు… సుమారు 2.5 కోట్లు చెల్లించి అరబ్ ఎమిరేట్స్ వ్యాప్తంగా జైళ్లలో ఉన్న 900 మంది ఖైదీలకు విముక్తి ప్రసాదించాడు…
వయస్సు 66 ఏళ్లు… రకరకాల కారణాలతో జైలుపాలై జరిమానాలు, అప్పులు గట్రా కట్టలేని వాళ్ల తరఫున తనే చెల్లించి, వాళ్ల విడుదలకు సాయం చేస్తుంటాడు… ఇది యూనిక్… ఈరకమైన దాతృత్వం ఏ ఫిలాంత్రపిస్టు చరిత్రలోనూ కనిపించదు… గత కొన్నేళ్లలో దాదాపు 20 వేల మందిని విడిపించాడు తన ది ఫర్‌గాటెన్ సొసౌటీ సంస్థ ద్వారా…
స్వదేశాలకు వెళ్లడానికి చాలామందికి విమానం ఛార్జీలు భరిస్తుంటాడు… 2024లో 3 వేల మందిని విడిపించాలని తన లక్ష్యం అట… ఇదీ వార్త సారాంశం… నిజానికి సొసైటీలో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసే ఇలాంటి వార్తలకే మీడియాలో అధిక ప్రాధాన్యం లభించాలి, కానీ లభించేది ఎలాంటి వార్తలకో మళ్లీ మళ్లీ చెప్పుకోనక్కర్లేదు మనం…
Ads
ఈయన ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త మాత్రమే కాదు, వితరణలో విఖ్యాతుడు… ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రీమంతుడు… తన వ్యాపార సంస్థల పేరు ప్యూర్ గోల్డ్ జువెల్లర్స్, ప్యూర్ గోల్డ్ రియల్ ఎస్టేట్స్… నిజం… ఫిరోజ్ కూడా ప్యూర్ గోల్డ్… అసలు ఎవరీయన..?
1958లో పుట్టాడు… సిటీ ముంబై… తండ్రి పేరు గులామ్ హుస్సేన్… ఓ మధ్యతరగతి కుటుంబం… తొమ్మిది మంది పిల్లలు… తండ్రి రియల్ ఎస్టేట్ కమీషన్ ఏజెంట్… కానీ అది దెబ్బతిని కుటుంబం పేదరికంలోకి వెళ్లిపోయింది… ఈ స్థితిలో ఫిరోజ్ తన 11వ ఏట చదువు మానేశాడు… తండ్రికి రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో సాయం చేసేవాడు… పెళ్లయింది…
అప్పటికే కుటుంబం ఆర్థికంగా కాస్త కూడదీసుకుంది, హనీమూన్‌కు దుబాయ్ వెళ్లాడు… అక్కడ బంగారం వ్యాపారాన్ని చూశాక తను ఎందుకు ఈ ఫీల్డ్‌లోకి దిగకూడదని అనిపించింది… తండ్రికి నచ్చజెప్పి, దుబాయ్‌కు షిఫ్టయ్యాడు 1989లో… తరువాత డబ్బు సంపాదించేకొద్దీ సొసైటీకి తిరిగి ఇవ్వసాగాడు… అనేక కార్యక్రమాలు… అందులో ప్రధానమైంది రకరకాల కారణాలతో జైలుపాలైన వాళ్లను రిలీజ్ చేయించడం…
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా తమ దేశాల ఆర్థిక వ్యవస్థకు ఈయన వల్ల ఒనగూరిన మేలు గుర్తించి, ఈ కుటుంబానికి ప్రతిష్ఠాకరమైన శాశ్వత నివాస హోదాను ఇచ్చింది… అంటే గోల్డెన్ కార్డ్… చాలా తక్కువ మందికే ఇది దక్కుతుంది… తన ప్రస్తుత నివాసం దుబయ్‌లోనే… ఖాళీ వేళల్లో గుర్రపుస్వారీని ఇష్టపడతాడు…
Share this Article