మగ హీరోయిన్… యాక్షన్ హీరోయిన్… అని జనం ప్రేమగా పిలుచుకునే మాలాశ్రీని అకస్మాత్తుగా ఆలీ మళ్లీ గుర్తుచేశాడు… ఈటీవీలో తన ఆలీతో సరదాగా షోకు తీసుకొచ్చాడు… పలుసార్లు కొందరు అక్కరలేని వాళ్లను కూర్చోబెట్టి, మన మెదడు తింటుంటాడు గానీ కొన్నిసార్లు మనం మరిచిపోయిన పాత నటుల్ని హఠాత్తుగా మనముందుకు తీసుకొస్తాడు, ముచ్చట్లు పెడతాడు… పాత జ్ఞాపకాల్ని నెమరేసుకునేలా చేస్తాడు… అది మాత్రం మెచ్చుకోబుద్దేస్తుంది…
మాలాశ్రీ అనే పేరు వినగానే గుర్తొచ్చే పాట… ‘‘గజ్జె ఘల్లుమన్నదో, గుండే ఝల్లుమన్నదో…’’ బావబావమరిది సినిమాలో సుమన్‌తో ఈ పాట ఉంటుంది… భలే ట్యూన్… ఈరోజుకూ హిట్టే… పాత పాటే అయినా యూట్యూబులో కోటిన్నర వ్యూస్ ఉంటయ్ దానికి… ఇక ఆమె పేరు వినగానే గుర్తొచ్చే సినిమా పేరు… ప్రేమఖైదీ… అప్పట్లో హరీష్ అనే బుల్లి హీరో ఉండేవాడు… ఈమె మగజెంట్ అన్నట్టుగా ఉంటే, తనేమో ఆడలేడీలాగే కనిపించేవాడు… భలే కాంబినేషన్… అలా మాలాశ్రీతో కలిసి చేసింది రామానాయుడు సినిమా ప్రేమఖైదీ… (తరువాత హరీష్ ఏమైపోయాడో… కొన్ని మంచి సినిమాలు చేశాడు అప్పట్లో… ఏదో సినిమాలో ఏఎన్ఆర్‌తో దీటుగా పోటీపడి నటించాడు…)
ఆలీతో మాట్లాడుతూ ఒకే సంవత్సరం తెలుగులో 14 సినిమాలు చేశానని చెబుతోంది కానీ తెలుగులో అంత సీన్ లేదు… కానీ కన్నడంలో మాత్రం ఒకే సంవత్సరం 19 సినిమాలు చేసింది… అసలు ఆల్‌టైమ్ గ్రేట్… ఫీల్డులో ఉన్న ఏ హీరోయినైనా కలగనే కెరీర్… కన్నడంలో కూడా ఒక్క రాజకుమార్‌కు మాత్రమే ఈ రికార్డు ఉండేది, ఆయన ఒక సంవత్సరం 14 సినిమాలు అలవోకగా చేసిపారేశాడు…
Ads
మాలాశ్రీది కన్నడ రూట్స్ కావచ్చునేమో గానీ పుట్టింది చెన్నెలో… మొదట్లో చిన్న పిల్లాడి వేషాలు వేసేది… అమితాబ్‌ను అనుకరిస్తూ, మగవేషధారణతో, అదే క్రాఫుతో కనిపించేది… 1990, 91, 92 ప్రాంతాల సినిమాలు గుర్తున్నవాళ్లకు మాలాశ్రీ బాగా గుర్తు… లావణ్యంకన్నా కాస్త ముదురు మగ ఫేస్ కట్… ఐనా ప్రేక్షకులు అంగీకరించారు ఆమెను… ఒక దశలో ఆమె కన్నడ ప్రేక్షకులకు కలలరాణి…
ఎప్పుడూ నవ్వుతూ, ఏదైనా లైట్ తీసుకున్నట్టుగా కనిపించే మాలాశ్రీ జీవితంలో పలు విషాదాలున్నయ్… ఇప్పుడు ఆమె వయస్సు 48… ఆమె సినిమా నంజుండి కల్యాణ అదే సంవత్సరం సూపర్ హిట్… అదే తనను నిలబెట్టింది… అదే సంవత్సరం తల్లి యాక్సిడెంటులో చనిపోయింది… మాలాశ్రీ తన తోటికన్నడ నటుడు సునీల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండేది… పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు… కానీ ఓసారి యాక్సిడెంటులో తను చనిపోయాడు, మాలాశ్రీకి తీవ్ర గాయాలయ్యాయి…
తరువాత రాము అనే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ను పెళ్లిచేసుకుంది… క్రమేపీ సినిమాల్ని తగ్గించుకుంది… ఆ తరువాత ఆమె పేరే వినిపించకుండా పోయింది… ఓ కూతురు… ఒకటీ అరా సినిమాల్లో కనిపించేది… గత సంవత్సరం భర్త కూడా కోవిడ్‌తో మరణించాడు… అన్నట్టు, శుభశ్రీ పేరు గుర్తుందా..? అర్జున్ సినిమా జెంటిల్‌మెన్‌లో అల్లరిపిల్ల పాత్రలో కనిపిస్తుంది… ఆమె ఎవరో కాదు… ఈ మాలాశ్రీకి సాక్షాత్తూ చెల్లెలు..!!
Share this Article