.
విశ్రాంతి ఎవరికీ ఊరికే రాదు!
ఇంటర్నెట్, సెల్ ఫోన్లు వచ్చాక ఇల్లు- ఆఫీసు తేడా లేదు. ఉద్యోగి రోజుకు 25 గంటలు సిస్టమ్ ముందు కూర్చోవాల్సిందే. సెల్ ఫోన్ లో అందుబాటులో ఉండాల్సిందే. కరోనా తరువాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది.
Ads
ఉన్న ఉద్యోగం ఊడిపోవడంకంటే ఇంటినుండి పనిచేసుకునే వెసులుబాటు మొదట్లో ఉద్యోగులకు బాగానే అనిపించింది. రాను రాను యాజమాన్యాలు వర్క్ ఫ్రమ్ హోమ్ పని గంటలు పెంచుకుంటూ పోయాయి. ఆఫీసులో అయితే ఎనిమిది గంటలే.
ఇంట్లోనే పడి ఉంటారు కదా? ప్రస్తుతానికి పన్నెండు గంటలు చేసి చావండి- మీ ఖర్మ ఇలాగే బాగా కాలితే భవిష్యత్తులో పద్దెనిమిది గంటలు ఖరారు చేద్దాం అంటున్నాయి యాజమాన్యాలు. అసలే బయట ఆర్థిక సంక్షోభంతో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ఏదో ఇంట్లోనే కదా అనుకుని తిట్టుకుంటూ, విసుక్కుంటూ విధిలేక పని చేస్తున్నారు.
రోజంతా సిస్టం ముందు, వీడియో కాన్ఫరెన్సులు, సెల్ ఫోన్లో ఉండడంతో మానసిక, ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అందరికీ తెలిసిందే. ఇంటిగ్రేటెడ్ థెఫ్ట్ అని గిట్టనివాళ్లు ఎగతాళిగా అంటుంటారు. అంటే సమగ్ర దోపిడీ. ఐటీ సమగ్ర దోపిడీలో ఉద్యోగులను సంపూర్ణంగా, సమగ్రంగా దోచుకోవడం కూడా ఒక భాగం!
ఐటీ రంగం ఒక్కటే కాదు. మొత్తం ప్రయివేటు ఉద్యోగాలన్నీ ఇలాగే ఉన్నాయి. సెల్ ఫోన్, ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్సుల కాలంలో బాత్ రూములో కాలకృత్యంలో ఉన్నా కమోడ్ మీద నుండి మాట్లాడాల్సిన అత్యవసరం పనులు ఉంటున్నాయి.
పనులున్నవారు ఇలా బిజీగా ఉంటే… ఏమీ పనుల్లేనివారు కూడా డిజిటల్ మాధ్యమాల్లో కోట్ల కోట్ల గంటల వీడియోలు చూస్తూ క్షణం తీరికలేకుండా ఉన్నారు. నడుస్తున్నా, నిలుచున్నా సెల్ ఫోన్ తెర మీద చదవడమో, చూడడమో తప్ప తల ఎత్తి పక్కకు చూసే పరిస్థితి లేదు. సెలవులంటే ఇంట్లో ఓటీటీల్లో సినిమాలో, సిరీసో చూడడం బాధ్యతగా మారింది.
ఈ నేపథ్యంలో వారానికి ఒక రోజో, రెండ్రోజులో మహా అయితే శరీరానికి విరామం దొరుకుతోంది కానీ… మెదడుకు, మనసుకు విరామం దొరకడం లేదని… దాంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
విశ్రాంతిని కూడా ఒక ఆనందించాల్సిన, అనుభవించాల్సిన కళగా మార్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. రోజులో తప్పనిసరిగా అయిదు, పది నిముషాల చొప్పున కనీసం రెండు, మూడు సార్లు పని ఒత్తిడికి దూరంగా బ్రేక్ తీసుకోవాలట.
అంటే చేస్తున్న పని నుండి పరిగెత్తడం కాదు. ఉన్నచోటే చేస్తున్న పనికి సంబంధం లేని, మన మనసుకు అత్యంత ఇష్టమైన సంగీతం వినడమో మరొకటో చేయాలట. అలాగే వారానికోరోజు పూర్తిగా మనసుకు ఉల్లాసం కలిగించే పని చేయాలట. మెదడుకు, మనసుకు ఇలా విశ్రాంతి ఇవ్వడం కూడా ఒక కళ అట.
నిజమే. ఏది విశ్రాంతో తెలియని రోజుల్లో విశ్రాంతి కూడా ఒక విద్యగా, కళగా కనుక్కుని నేర్చుకోవాల్సిందే! కొనుక్కుని అనుభవించాల్సిందే! విశ్రాంతి ఎవరికీ ఊరికే రాదు!!
ఉరుకులపరుగుల ఆధునిక యాంత్రిక జీవనంలో బతికి ఉండగా కళాత్మక విశ్రాంతి అంత సులభంగా దొరుకుతుందా? అందుకేనా ఇంగ్లిష్ వాడు పోయాక మాత్రమే విశ్రాంతి దొరుకుతుందని స్పష్టంగా రెస్ట్ ఇన్ పీస్ (RIP) అన్నాడు!!
కమ్ వాట్ మే. ప్లీజ్ టేక్ రెస్ట్.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article