అచ్చ నిజామాబాద్ అమ్మాయి… నిఖత్ జరీన్… ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో గెలిచి, స్వర్ణాన్ని ముద్దాడింది… దేశవ్యాప్తంగా అభినందనల వర్షం కురుస్తోంది… ఇలాంటి విజయం అందుకున్న అయిదో భారతీయ మహిళా బాక్సర్ తను… అభినందనలు నిఖత్… జయహో…
అయితే… నిఖత్ జరీన్ గెలుపు వెనుక ఓ కనిపించని కసి… పట్టుదల ఉంది… ఓ అవమానం ఉంది… అదే తనను ముందుకు నడిపించింది… అది మేరీకామ్ తనను అవమానించిన తీరు..!! నిఖత్ గెలుపు వార్త వినగానే మేరీకామ్‌తో ఆమె గొడవే గుర్తొచ్చింది… నిజానికి అందులో నిఖత్ తప్పులేదు… తను ప్రొఫెషనల్‌గానే వ్యవహరించింది… మేరీ కామ్ చిల్లరగా బిహేవ్ చేసినట్టు అనిపించింది… సోవాట్… ఆమె గొప్ప బాక్సర్ కావచ్చుగాక… వ్యక్తిగత సంస్కారం లేని ఎంత పెద్ద ఆటగత్తె అయితేనేం… ఆఫ్టరాల్…
Ads
మేరీకామ్ చిన్నప్పటి నుంచీ నిఖత్‌కు స్పూర్తి, ఆదర్శం… కానీ అసలు పంచాయితీ ఆమెతోనే పడింది… 2019లో… ఈ తగాదా ఎక్కడ వచ్చిందంటే ఒలింపిక్స్‌కు ముందు 51 కిలోల కేటగిరీలో… ఏ ట్రయల్స్ లేకుండా మేరీకామ్‌ను ఎంపిక చేసేశారు ఇండియా తరఫున… అదీ నిఖత్‌కు నచ్చలేదు… ప్రశ్నించింది… తనకూ ఒలింపిక్స్ ఆడాలని ఉంటుంది కదా… అఫ్‌కోర్స్, ఉండని వాళ్లు ఎవరుంటారు..? కానీ అప్పటికి మహిళల బాక్సింగ్ అంటేనే మేరీకామ్, ఆమె మాటకు తిరుగులేదు…
నిఖత్ కేంద్ర మంత్రికి లేఖ రాసింది… ఫెయిర్ ట్రయల్స్ కావాలని… చర్చలు, సంప్రదింపులు జరిగి ట్రయల్స్ నిర్వహించారు… మేరీకామ్ కోపంతో రగిలిపోతోంది… 9-1 తేడాతో నిఖత్‌ను ఓడించింది… అది కాదు అసలు విషయం… గెలిచాక కనీసం మర్యాదకైనా చేతులు కలపకుండా నిఖత్ వైపు చీదరింపుగా చూసి వెళ్లిపోయింది… క్రీడాభిమానులు మేరీకామ్ వైఖరి పట్ల విస్మయం చెందారు…
అంతేకాదు, అంతకుముందు ‘‘నిఖత్..? ఎవరామె… పేరు ఎప్పుడూ వినలేదు… ఎందుకు ఏడుస్తోంది ఇలా..? ఈరకంగా ఇండియన్ జట్టులోకి రావాలని ప్రయత్నమా..?’’ అని నోరుపారేసుకుంది… ఇప్పుడు… ఇప్పుడు… అదే నిఖత్… మేరీకామ్ సరసన సగర్వంగా నిలబడింది… గత పద్నాలుగేళ్లలో ఇండియా తరఫున ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పొందిన మహిళలు ఇద్దరే… ఒకటి మేరీకామ్… ఇప్పుడు నిఖత్… నిఖత్ విజయం వెనుక అసలు తృప్తి ఏమిటో అర్థమైంది కదా…
ఎవరీ నిఖత్… ఊరు నిజామాబాద్… తండ్రి జమీల్ అహ్మద్ అథ్లెట్… దాంతో నిఖత్‌కు కూడా చిన్నప్పటి నుంచే క్రీడలంటే ఆసక్తి… స్కూల్ డేస్‌లోనే 100, 200, 400 మీటర్ల రన్నింగ్ రేసుల్లో బహుమతులు గెలుచుకుంది… కానీ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడి సలహా మేరకు బాక్సింగ్ ఎంచుకుంది… నాన్న కూడా ప్రోత్సహించాడు… 2011లోనే టర్కీలో ‘బెస్ట్ జూనియర్ బాక్సర్’ అవార్డు దక్కింది… ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు…
ఆమె ప్రాక్టీస్ కోసం కుటుంబం అంతా నిజామాబాద్ వదిలి, హైదరాబాద్ వచ్చింది… నలుగురు అమ్మాయిలు… ఈమె నంబర్ మూడు… అక్కలు ఇద్దరూ ఫిజియో థెరపిస్టులు… ఈమె దెబ్బలకు వాళ్లే చికిత్స చేసేది… అమ్మ పర్వీన్ సుల్తానా కూడా ఎప్పుడూ నిఖత్‌ను వెనక్కి లాగలేదు… ఎంకరేజ్ చేసేది… ఆ ప్రయాణం సాగీ సాగీ ఇప్పుడు ఈ దశకు చేరుకుంది… వాట్ నెక్స్ట్..? ఆమె కలలు గనే ఒలింపిక్స్ పతకాన్ని భవిష్యత్తులో ముద్దాడుతుందా..? ఆశిద్దాం… ఆకాంక్షిద్దాం… ఆల్ ది బెస్ట్ నిఖత్… !!
Share this Article