హిందీ సినిమాలు వరుసగా ఎదురుతంతున్నయ్… అది హిందీ ఇండస్ట్రీ వర్గాలతోసహా అందరూ అంగీకరించేదే… సౌత్ ఇండియా సినిమాలు కూడా స్ట్రెయిట్ హిందీ సినిమాల్ని దాటేసి వీరకుమ్ముడు కుమ్మేస్తున్నయ్… ఇలా ఎన్నేళ్లు..? ఏం చేయాలి..? సినిమా మారాలి… కథలు మారాలి, ప్రజెంటేషన్ మారాలి… చెప్పేవాడే కానీ చేసేవాడే లేడు…
అంతెందుకు..? మితిమీరిన రెమ్యునరేషన్లు తగ్గాలి, సినిమా నిర్మాణవ్యయం తగ్గాలి, రిస్క్ తగ్గాలి అనేది మరో ప్రతిపాదన… కానీ ఎవడు తగ్గించుకుంటాడు..? అక్షయ్ కుమార్ వంటి ఒకరిద్దరు హీరోలు తప్ప ఒక్కరూ తమ పారితోషికాల్లో తగ్గింపును అంగీకరించడం లేదు… అంతెందుకు..? ప్రఖ్యాతి గాంచిన రాజశ్రీ ప్రొడక్షన్స్ వాళ్ల తాజా సినిమా ఉంచాయి తెలుసు కదా… గతంలో బ్రహ్మాండమైన సినిమాల్ని తీసిపెట్టిన సూరజ్ జర్జాత్యా దీనికి దర్శకుడు…
ఈ సినిమా నిర్మాణవ్యయంలో అధికశాతం నటీనటుల రెమ్యునరేషన్లేనట… 80 ఏళ్ల వయస్సులో అమితాబ్ బచ్చన్ ఈ సినిమా కోసం తీసుకున్న పారితోషికం ఆశ్చర్యం కలిగిస్తుంది… 10 కోట్లు… అక్షరాలా పది కోట్లు తీసుకున్నాడట… పరిణీతి చోప్రాకు 3.5 కోట్లు ఇచ్చారని బాలీవుడ్ సమాచారం… అంతేకాదు, జనం ఏనాడో మరిచిపోయిన నీనా గుప్తా కోటిన్నర తీసుకోగా, ది కాశ్మీరీ ఫైల్స్‌తో మళ్లీ పాపులరైన అనుపమ్ ఖేర్ కూడా కోటిన్నర తీసుకున్నాడు…
Ads
బొమన్ ఇరానీ 1.25 కోట్లు, చాలా లిమిటెడ్ స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న Danny Dengonzpa కోటి రూపాయలు తీసుకున్నారు సరే… నటి సారిక తెలుసు కదా… ఆమెకు కూడా 75 లక్షలు ఇచ్చారు… ఇక నిర్మాణవ్యయం తగ్గుదల ఎక్కడ..? ఈ సినిమాకు మంచి రివ్యూలు, సరైన మౌత్ టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్లు ఓ మోస్తరుగా వస్తున్నయ్, లేకపోతే గతేమిటి..?
ఆమధ్య తెలుగు సినిమాలకు సంబంధించి కూడా ఇలాంటి హడావుడి ఒకటి నడిచింది… నిర్మాణవ్యయం తగ్గాలి అంటూ కొద్దిరోజులు షూటింగులు బంద్ అన్నారు… ఒకరిద్దరు కేరక్టర్ ఆర్టిస్టుల ఖర్చులు పెరిగిపోయాయి, తగ్గించాలి అని సంప్రదింపులు జరిపారు… అంతే… తరువాత ఎవరి దారి వాళ్లదే… ఎవరి ఖర్చులూ తగ్గలేదు, ఎవరి పారితోషికానికీ కత్తెర పడలేదు… డిమాండ్ ఉంటే డబ్బు ఇస్తారు, లేదంటే ఎవడూ పట్టించుకోడు, సో, డిమాండ్ ఉన్నప్పుడే సొమ్ము తూర్పారపట్టుకుంటారు ఎవరైనా…
ఉంచాయి సినిమా సంగతికొస్తే… అందరూ వెటరన్స్… పరిణీతి తప్ప మిగతా వాళ్లను చూడండి… అమితాబ్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ, సారిక, నీనా గుప్తా… ఒకప్పుడు పాపులర్… అయితేనేం, రాజశ్రీ ప్రొడక్షన్స్ వాళ్లు ఈ ఉంచాయి కథకు వాళ్లయితేనే బాగుంటుంది అనుకున్నారు… వోకే, బాగానే చెల్లించండి అన్నారు వాళ్లు… నిర్మాణవ్యయంలో 60 నుంచి 70 శాతం రెమ్యునరేషన్లే… సో, నిర్మాణవ్యయం తగ్గిస్తాం, రెమ్యునరేషన్లకు కత్తెర వేస్తాం అనేవి ఉత్త డొల్ల మాటలు… ఏకంగా ఏరియా హక్కులే తీసుకుంటున్న నటవ్యాపారం ఇప్పుడు… లేదా నిర్మాణంలోనే భాగస్వామ్యం… లీడ్ స్టార్స్ రెమ్యునరేషన్ అనే పదానికి అర్థమేముంది అసలు..?!
Share this Article