.
Mohammed Rafee ……… జై తెలంగాణ, జయహో గద్దర్…. అల్లు అర్జున్ కు హగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి!
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ చప్పచప్పగా సాగుతున్న వేళ… కాస్త అలస్యంగానైనా రేవంత్ రెడ్డి వచ్చారు! అప్పటి వరకు ఏదో ఏమో అన్నట్లుగా సాగిన వేడుకకు కొత్త జోష్ వచ్చింది!
Ads
ఈలలు చప్పట్ల గోలతో హైటెక్స్ హోరెత్తింది! వేదిక ముందు వరసలో కూర్చున్న నందమూరి బాలకృష్ణ ను పలకరించిన రేవంత్ రెడ్డి దగ్గరకు హత్తుకున్నారు! ఆ పక్కనే నిలబడి చూస్తున్న అల్లు అర్జున్ కు ఒక హగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి! ఆడిటోరియం కరతాళధ్వనులతో మార్మోగిపోయింది! రేవంత్ రెడ్డి రాకతో కొత్త జోష్ వచ్చింది!
అప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు కొందరికి అవార్డులు ఇచ్చేసి అభినందించారు. అలనాటి తారలు జయసుధ, జయప్రద, సుహాసిని కలసి మరి కొందరికి ఇచ్చారు!
అసలు ముఖ్యమైన అవార్డుల తంతు జరగాల్సి ఉంది! గాయని మంగ్లీ తన బృందంతో ఉర్రూతలూగించింది! పేరిణి నాట్య ప్రదర్శన ఈ వేడుకకు శుభారంభపు వెలుగునిచ్చింది! కీరవాణి బృందం విభావరి జై తెలంగాణ జాతీయ గీతం విశేషంగా ఆకట్టుకుంది! ..,… – డా.మహ్మద్ రఫీ
రేవంత్ రెడ్డి ముందు తగ్గేదేలా డైలాగ్ చెప్పి నవ్వించిన అల్లు అర్జున్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాక అల్లు అర్జున్ ను మాట్లాడమన్నారు! ప్రేక్షకులు డైలాగ్ డైలాగ్ అని అరిచారు!
మీరు అనుమతి ఇస్తే పుష్ప 2 లో ఒక డైలాగ్ చెబుతా అని రేవంత్ రెడ్డిని అడిగారు అల్లు అర్జున్ నవ్వుతూ!
ఆయన కూడా నవ్వుతూ గో ఎ హెడ్ అని చేత్తో సైగ చేశారు.
జాతర సన్నివేశంలో “ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గంగమ్మ తల్లి మీద ఒట్టు, జాతరలో వేట తలలను నరికినట్లు రప్పరప్పా నరుకుతా ఒక్కొక్కడ్ని” అని డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్ చివర్లో “పుష్ప, పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలా” అని తనదైన మార్క్ యాక్షన్ తో చెప్పారు.
హైటెక్స్ హాలు చప్పట్లతో దద్దరిల్లింది! వేదిక నవ్వులతో నిండిపోయింది! ప్రతి యేటా ఇలాగే అవార్డుల వేడుక జరగాలని, తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసి అవార్డులు ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ముఖ్యమంత్రి పేరుతో పాటు వేదిక పై వున్న అందరి పేర్లు బుద్ధిగా గుర్తు పెట్టుకుని మరీ చెప్పారు అల్లు అర్జున్! చివరగా జై తెలంగాణ అని ముగించడంతో హాలు కరతాళ ధ్వనులతో మార్మోగింది!
ఎవరేం తక్కువ..? జరిగిన చేదు పరిణామాలు అందరికీ తెలుసు… అల్లు అర్జున్ అసలే జాతీయ ఉత్తమ నటుడు, తనను మించిన నటుడు రేవంత్ రెడ్డి… గద్దర్ అవార్డుల దగ్గర అందరినీ ఆకర్షించిన విశేష దృశ్యం… తన పేరే మరిచిన నటుడిని హత్తుకున్న సీఎం రేవంత్ రెడ్డి… అసలు జాతీయ ఉత్తమ నటుడు రేవంత్ రెడ్డే…. ముచ్చట
Share this Article