రాజకీయాలు అంటే అంతే… ఏమీ లేకపోయినా సరే బట్ట కాల్చి మీదేస్తారు… కడుక్కునే ఖర్మ ఎదుటోడిది.,. మరీ తెలుగు రాజకీయాల్లో ఇది ఎక్కువ… ఏమీ లేకపోతేనే రెచ్చిపోయే బీఆర్ఎస్ కాస్త సందు దొరికితే ఊరుకుంటుందా..? అసలే బీజేపీని వదిలేసింది కదా, ఇక కాంగ్రెస్ మీద పడుతోంది… తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపిస్తోంది కదా, బీఆర్ఎస్‌తో లోపాయికారీ ఒప్పందాలతో బీజేపీ వేగంగా దెబ్బతినిపోతోంది కదా… ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తోంది బలంగా…
పోవాల్సిన నెగెటివ్ మెసేజ్‌ను జనంలోకి తీసుకెళ్తే సరి… కడుక్కునే ఖర్మ కాంగ్రెస్‌ది… రైతులకు ఉచిత కరెంటు మీద సాగుతున్న రచ్చ ఇదే… ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఈ దిగువ వీడియోలో చూడండి…
https://twitter.com/tv9telugu/status/1678787227361632257?s=48&t=-lxpUXI3pmXtsWYTWi_alw
Ads
నిజానికి రేవంత్‌రెడ్డి రైతులకు ఉచిత కరెంటు అక్కర్లేదు అనలేదు, తను చెప్పాలనుకున్నది కరెంటు కంపెనీల దగ్గర అడ్డగోలు కమీషన్లు గుంజడానికి కేసీయార్ ఈ 24 గంటల కరెంటు అని ప్రచారం చేసుకుంటున్నాడు అని చెప్పడం తన ఉద్దేశం… కానీ చెప్పిన తీరు బాగాలేదు… చెప్పాల్సింది స్ట్రెయిట్‌గా చెప్పకుండా, అలవాటైన రీతిలో ఏదేదో చెప్పబోయి, ఇంకేదో చెప్పి బీఆర్ఎస్ పార్టీకి మంచి చాన్స్ ఇచ్చాడు…
తెలంగాణలో 95 శాతం చిన్న రైతులే, మూడెకరాల లోపు… అంటే ఎకరానికి గంట చొప్పున మూడు గంటలు చాలు అన్నాడు… వీళ్లకు దొరికిపోయాడు… సందు దొరికితే బీఆర్ఎస్ ఊరుకుంటదా..? ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు, నిరసనలతో ఊదరగొట్టేసి, అదుగో వ్యవసాయానికి ఉచిత కరెంటు తీసేస్తరట కాంగ్రెసోళ్లు అని పెద్ద ఎత్తున దాడికి దిగింది… పొలిటికల్‌గా ఈ అవకాశాన్ని ఏ పార్టీ వదులుకోదు… రేవంత్‌రెడ్డి నోటికే కాస్త కళ్లెం వేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది…
ఎకరానికి గంట చాలు, మూడు గంటలు ఇస్తే రైతుకు చాలు… ఇవన్నీ ఎందుకు చెప్పడం..? వాస్తవానికి కాంగ్రెస్ కొత్త కొత్త ఎన్నికల హామీలను ఇస్తోంది, దాని అవసరం అది… మొన్న రాహుల్‌తో కూడా సోషల్ పెన్షన్ పెంచుతామని చెప్పించారు… కర్నాటకలో అయితే ఆకాశాన్ని అంటే ఉచిత పథకాలను గుమ్మరించారు… ఈ స్థితిలో ‘‘రైతుకు మూడు గంటల ఉచిత కరెంటు’’ చాలు అనే అర్థమొచ్చేలా విదేశీగడ్డపై మాట్లాడటం కాంగ్రెస్‌కు నష్టదాయకమే…
పోనీ, మా కాంగ్రెస్ అధ్యక్షుడి మాటల్ని వక్రీకరిస్తున్నారు, బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది అని కాంగ్రెస్ లీడర్లు ఎఫెక్టివ్‌గా కౌంటర్ చేయగలిగారా అంటే అదీ లేదు… బోరెడ్డి అయోధ్యరెడ్డి వంటి అధికార ప్రతినిధులు సరైన వివరణను ఇచ్చారు… కానీ తెలుగు మీడియా కేసీయార్‌కు అనుకూలం కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా కాంగ్రెస్ కౌంటర్‌ను పెద్దగా పట్టించుకోలేదు… ఫలితంగా జరుగుతున్న రచ్చ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మారింది… అఫ్‌కోర్స్ రైతులు కాంగ్రెస్ ఉచిత కరెంటును తీసేస్తారనే రాజకీయ దుమారాన్ని నమ్ముతున్నారా లేదానేది వేరే సంగతి…
నిజానికి వ్యవసాయానికి ఉచిత కరెంటు అనే పథకానికి పేటెంట్ కాంగ్రెస్‌దే… ఎందరు వద్దన్నా, చివరకు పార్టీలోనే భిన్నాభిప్రాయలు వచ్చినా సరే, వెరవకుండా వైఎస్ దాన్ని అమలు చేశాడు… కరెంటు కేసులు ఎత్తేశాడు, బకాయిలు రద్దు చేశాడు, మొదట రుణమాఫీ కూడా తనవల్లే… రైతు ఊపిరి పీల్చుకున్నది కాంగ్రెస్ హయాంలోనే… వీలయితే దాన్ని ఈరోజుకూ పాజిటివ్‌గా ప్రచారం చేసుకోవాలి… కానీ జరుగుతున్నది దానికి భిన్నం…
బీఆర్ఎస్ చెబుతున్నట్టు ధరణి రద్దు అనేది రైతు వ్యతిరేకమా కాదానేది కూడా డిబేటబులే… ధరణి లోపాలపుట్ట, అది రైతు వ్యతిరేకం… అందుకే క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలను బట్టే బీజేపీ, కాంగ్రెస్ ధరణిని రద్దు చేస్తామని ప్రకటించాయి… దాన్ని అంగీకరించడానికి గానీ, ధరణిని చక్కదిద్దడానికి గానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేతనైతలేదు…
మొన్న ‘అవసరమైతే సీఎంగా సీతక్క’ అనే రేవంత్ వ్యాఖ్యకు కొంత పాలిటికల్ స్ట్రాటజీ ఉంది… జనంలోకి అది పాజిటివ్‌గా వెళ్తుంది… కానీ ఈ ఉచిత కరెంటు మీద అధిక ప్రసంగం చేసి బుక్కయ్యాడు… దాంట్లో మరింత పెట్రోల్ పోయడానికి సహజంగానే బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది… నిజానికి పేరుకు 24 గంటల కరెంటు… కానీ క్షేత్రస్థాయిలో వచ్చేది 12, 14 గంటలు మాత్రమే… దాన్ని ఎక్స్‌పోజ్ చేయకుండా ఏదేదో మాట్లాడితే… ఇదుగో ఇదే జరిగేది… అసలే అది బీఆర్ఎస్ పార్టీ… సో, ఏది మాట్లాడినా ఆచితూచి… కాదంటే ఇటువంటి వ్యతిరేకప్రచారమే… బీఆర్ఎస్ మాత్రమే కాదు, రేవంత్ ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూసే సెక్షన్ సొంత పార్టీలోనే ఉందిగా…!!
Share this Article