.
రాజకీయాలు వదిలేయండి కాసేపు… తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఏపిని కూడా వదిలేయండి కాసేపు… అది పరమ దరిద్రపు పాతాళ స్థాయిలో ఉంది… అది పక్కా సమాజ వ్యతిరేకం, అచ్చం నెయ్యిలేని తిరుమల లడ్డూలాగా…
ఓసారి తెలంగాణకు వద్దాం… ఫక్తు రాజకీయ పార్టీగా మారిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్, తరువాత ప్రధాని ఆశలతో పుట్టుకొచ్చి, భంగపడిన బీఆర్ఎస్… అనేక ప్రజాకర్షక, అందులో కొన్ని డొల్ల పథకాలు… కానీ తనే రాజకీయాల్లో తోపు, ఈ మూర్ఖ తెలంగాణ ప్రజలకు నా డొల్ల మాటల్ని నమ్మడం తప్ప ఇంకేం గతి ఉందనే దొరతనం… దాన్ని పుణికిపుచ్చుకున్న కొడుకు కేటీయార్, అల్లుడు హరీష్ రావు… చిరాకెత్తి బూతులు తిడుతూ బయటికి వెళ్లి శాపనార్థాలు పెడుతున్న బిడ్డ కవిత…
Ads
ఎస్, చెప్పుకోవడానికి ఓ సందర్భం ఉంది… ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడితే… ఈరోజుల్లో ప్రజోపయోగమే కాదు, తనకూ రాజకీయ లబ్ధి ఏమిటో చూస్తుంటారు… వర్తమాన రాజకీయాల్లో ఎవడూ తోపు కాదు… తురుం కాదు, రేవంత్ రెడ్డి ఈ కోణంలో కేసీయార్‌ను దిక్కూదివాణం లేని అజ్ఙాతంలోకి తరిమేశాడు…
తాజాగా ఏమిటంటే..? నిన్నటి వృద్ధ భరోసా బిల్లు…. పేరు, ప్రణామ్ కావచ్చు, ప్రాణమ్ కావచ్చే, వృద్ధ భరోసా కావచ్చు…. లక్షల మంతి వృద్ధ తల్లిదండ్రులకు ఇప్పుడు రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆత్మబంధువు అయిపోయాడు… ఎందుకంటే..? వివరాల్లోకి వెళ్దాం…
ఎవడైతే ప్రభుత్వ కొలువులో ఉంటాడో, మతం- కులం జాన్తానై… తల్లిదండ్రుల పోషణను విస్మరిస్తే వాడి జీతంలో 10 లేదా 15 శాతం కట్ చేసి, ఆ తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమచేయాలనే కేబినెట్ నిర్ణయం … వావ్… దీన్ని మోదీ అందిపుచ్చుకుని, నిజంగా సొసైటీ కన్సర్న్ ఉంటే ప్రైవేటు ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తూ ఓ కఠిన నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుండు..?
కోడళ్లు… అత్తామామాల్ని దరిజేరనివ్వరు, ఆదరించరు… కన్న కొడుకులు పట్టించుకోరు… బిడ్డలు, అల్లుళ్లకూ బాధ్యత లేదు… మరి పిల్లల కోసమే సర్వం ధారబోసే తల్లిదండ్రులకు చివరి రోజుల్లో ఆసరా ఎవరు..? మరిచేవాడికి బాధ్యత గుర్తుచేసి, ఆ వైపు తరిమేసే చట్టం అవసరం లేదా..? ఉంది…
అదే రేవంత్ రెడ్డి చేసింది… ఒక్కసారిగా రాజకీయంగా ఎక్కడికో వెళ్లిపోయాడు, రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిజానికి అర్థం కాదు… అదొక మూస ప్రపంచం… నిన్నటి నుంచీ ప్రతి రచ్చబండ దగ్గర, గ్రామ పంచాయతీల దగ్గర, సోషల్ మీడియాలో, అమ్మఅక్కల ముచ్చట్లలో ఇదే చర్చ…
చాలా మంది తల్లిదండ్రుల హృదయాలని కొల్లగొట్టాడు సీఎం రేవంత్ రెడ్డి… ఇది చాలా అద్భుతమైన నిర్ణయం… ఒక 5% ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంటే ఉండచ్చు, వూ కేర్స్, అది లెక్కలోకి రాదు… 57 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లో మంచి పేరు తీసుకొచ్చుకున్నాడు… తెలంగాణ జనాభాలో వాళ్ళు 24% మంది… రేపటి రోజున ఇది పెద్ద టర్న్ వాళ్ళలో…
“తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం, 2007” (The Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007) కు సవరణలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్ – 2026’ (వృద్ధుల భరోసా/ప్రణామ్ చట్టం) అనేది కేంద్రం తెచ్చిన 2007 చట్టానికి మరింత పదును పెట్టేలా ఉండబోతోంది…
నిజానికి 2007 నాటి కేంద్ర చట్టం ఏమంటున్నదంటే… (ఇదెవరికీ అర్థం కాలేదు, ఆచరణలో ఒక్కడికీ న్యాయం చేయలేదు… ఆ చట్టానికి రేవంత్ రెడ్డి సవరణలు తెచ్చి, కొత్త రాష్ట్ర చట్టం తెస్తున్నాడు… తేడాలు చూద్దాం ఓసారి…
1. అమలు తీరు (Implementation)…
-
కేంద్ర చట్టం (2007)….: తల్లిదండ్రులు తమ పిల్లలపై ఫిర్యాదు చేస్తే, ట్రిబ్యునల్ విచారణ జరిపి భరణం కట్టమని ఆదేశిస్తుంది…. ఇది కొంత సమయం తీసుకునే ప్రక్రియ….
-
తెలంగాణ ప్రతిపాదన (2026)…: ఫిర్యాదు నిరూపితమైతే, ఎటువంటి జాప్యం లేకుండా నేరుగా ఉద్యోగి జీతం నుండే నిర్ణీత మొత్తాన్ని కట్ చేస్తారు… ఇది తల్లిదండ్రులకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది…
2. భరణం మొత్తం (Maintenance Amount)…
-
కేంద్ర చట్టం (2007)…: గతంలో భరణం గరిష్టంగా నెలకు ₹10,000 మాత్రమే ఉండేది (తర్వాత కొన్ని సవరణలు జరిగాయి)… ప్రస్తుత జీవన ప్రమాణాలకు ఇది చాలా తక్కువ…
-
తెలంగాణ ప్రతిపాదన (2026)…: ఉద్యోగి యొక్క గ్రాస్ శాలరీలో (Gross Salary) 10% నుండి 15% వరకు కట్ చేస్తారు… దీనివల్ల ఉద్యోగి హోదాను బట్టి తల్లిదండ్రులకు గౌరవప్రదమైన మొత్తం అందుతుంది…
3. డబ్బు చెల్లింపు (Payment Process)….
-
కేంద్ర చట్టం (2007)…: ఉద్యోగి లేదా పిల్లలే నేరుగా తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది… దీనివల్ల ప్రతి నెలా అడగాల్సి రావడం లేదా ఆలస్యం కావడం వంటి ఇబ్బందులు ఉంటాయి…
-
తెలంగాణ ప్రతిపాదన (2026)…: ప్రభుత్వం (DDOలు) నేరుగా జీతం నుండి కట్ చేసి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో వేస్తుంది… పిల్లలతో సంబంధం లేకుండా సిస్టమ్ ద్వారానే డబ్బులు అందుతాయి…
4. వృద్ధాశ్రమాలు – మద్దతు (Support System)…
-
కేంద్ర చట్టం (2007)…: ప్రతి జిల్లాకు కనీసం ఒక వృద్ధాశ్రమం ఉండాలని మాత్రమే నిబంధన ఉంది…
-
తెలంగాణ ప్రతిపాదన (2026..): ‘ప్రణామ్’ (Pranaam) పేరుతో డే-కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు… అక్కడ ఉచిత భోజనం, హెల్త్ చెకప్స్ వంటి సదుపాయాలు ఉంటాయి… ఇది కేవలం ఆర్థిక సాయమే కాకుండా సామాజిక భద్రతను కూడా కల్పిస్తుంది…
క్లుప్తంగా చెప్పాలంటే, 2007 చట్టం కేవలం ఆదేశాలు ఇవ్వడానికే పరిమితమైతే, 2026 తెలంగాణ ప్రతిపాదన బాధ్యతను ప్రభుత్వమే తీసుకుని అమలు చేసేలా ఉంది…
ప్రస్తుత ప్రతిపాదన వల్ల కలిగే ప్రయోజనాలు…
-
ఆర్థిక భద్రత…: తల్లిదండ్రులు ప్రతి నెలా పిల్లల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు… జీతం పడగానే వారి వాటా వారికి అందుతుంది…
-
చట్టబద్ధమైన జవాబుదారీతనం…: “పిల్లలను చూసుకోవడం అనేది కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు, అది సామాజిక బాధ్యత” అని ప్రభుత్వం గట్టి సంకేతాన్నిస్తోంది…
-
ప్రణామ్ (Pranaam) డే-కేర్ సెంటర్లు…: ఒంటరిగా ఉండే వృద్ధులకు పగటిపూట కాలక్షేపం, వైద్య పరీక్షలు, లైబ్రరీ, సామాజిక సంబంధాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 39 సెంటర్లను (హైదరాబాద్, ఉప్పల్, మేడ్చల్ వంటి చోట్ల కూడా) ఏర్పాటు చేస్తున్నారు…
-
తక్కువ ప్రయాస….: వృద్ధులు కోర్టులు, ట్రిబ్యునళ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సింపుల్ మెకానిజం ద్వారా భరణం అందేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది…
Share this Article