మల్లారెడ్డి… ఈ పేరు తెలియని వాళ్లు లేరు, ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు… పాలమ్మి, పూలమ్మి వేల కోట్లు, ఎంత ఆస్తి ఉందో తనకే తెలియనంత సంపద పోగేసిన పేరు… నిజం చెప్పాలంటే జస్ట్, అలా పాలు అమ్మి, పూలు అమ్మి ఇంత డబ్బు గడించిన కథ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సక్సెస్ స్టోరీ అవుతుందేమో…
తన చరిత్ర తవ్వుతూ పోతే ఎన్ని పెంకాసులో, ఎన్ని రత్నాలో సంక్షిప్త వివరణ అసాధ్యం గానీ… విజ్ఞత, పరిణతి, హుందాతనం వంటి పదాల ప్రస్తావన అక్కర్లేదు గానీ… తన కాలేజీల ఫంక్షన్లలో తాను విద్యార్థులకు బోధించే అద్భుతమైన వ్యక్తిత్వ పాఠాల సంగతేమిటో గానీ… తను అచ్చంగా ఈ లోకం పోకడకు ఉదాహరణ… ప్రత్యేకించి ప్రజెంట్ రాజకీయాల ధోరణికి ఓ ఐకన్…
అప్పట్లో ఏమన్నాడు..? రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బట్టెబాజ్, దొంగ… నేనెప్పుడూ బ్రోకర్ దందా చేయలేదు… సవాల్ చేస్తున్నా, రాజీనామా చెయ్, నేనూ చేస్తా… తలపడదాం… ఇలాంటి మాటలతో నిజంగా బహిరంగంగా లైవ్‌లో తొడగొట్టి సవాల్ చేశాడు… రేవంత్ రెడ్డిని పురుగుకన్నా హీనంగా తీసిపారేసేవాడు తన మాటల్లో… కానీ ఇప్పుడేమైంది..? సీన్ రివర్స్…
Ads
రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం అయ్యాడు… మల్లారెడ్డికి బుగులు పట్టుకుంది… అనేక అక్రమాలు, కబ్జాలు, అవకతవకలు… డబ్బే ధ్యేయంగా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన అరాచకాల్ని రేవంత్ సర్కారు తవ్వడం మొదలుపెట్టింది… నిజానికి ఇది ఊహించే మల్లారెడ్డి బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ గెలిచి, రేవంత్ సీఎం కాగానే… తనకు రేవంత్ సన్నిహితుడే అంటూ కొత్త పాట మొదలెట్టాడు… కానీ రేవంత్ ఊరుకునే రకం కాదు కదా…
తొడలు గొట్టి సవాల్ చేసిన మల్లారెడ్డి ఊరుభంగం కావాలి కదా… అక్కడక్కడా శాంపిల్‌గా మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలపై జేసీబీలను పంపించాడు… ఓ భవనం మొత్తాన్ని సమూలంగా నేలమట్టం చేశారు… అది ఓ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి… (8 ఎకరాలు ఆక్రమణ, ఆరు షెడ్లు, రెండు భవనాలు కట్టారు అందులో…) తవ్వేకొద్దీ ఇలాంటివెన్ని బయటపడతాయో తెలియదు… కానీ ఆ శాంపిల్ దెబ్బకు మల్లారెడ్డి దిగొచ్చాడు… ఇదుగో ఇదీ జరుగుతోంది…
బాబోయ్, ఈ దాడులు ఆపండి అంటూ రేవంత్ సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి శరణుజొచ్చాడు… కర్నాటక డిప్యూటీ సీఎం, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల చక్రధారి డీకేతో రాయబారం ప్రారంభించాడు… రేవంత్ రెడ్డిని కలవాలని మొరపెట్టుకున్నాడు… తొడలుగొట్టిన అహం కాళ్లబేరానికి వచ్చింది… అందుకే పెద్దలు చెప్పేది… సాగినన్నిరోజులు నా అంతవాడు లేరని విర్రవీగొద్దు అని..!
రేవంత్ రెడ్డి సాఫ్ట్ రాజకీయ నాయకుడేమీ కాదు… ఇదుగో ఇలా సమయం చూసి, సందర్భం చూసి కరుకుగా వ్యవహరిస్తాడు… రేవంత్‌ను అంచనా వేయడంలో మల్లారెడ్డి ఫ్లాపయ్యాడు… ఏమో, తన నిజతత్వమో అదేమో… ఇప్పుడు తను, తన అల్లుడు కాంగ్రెస్‌లో చేరతారట, అవే సంకేతాలు పంపిస్తున్నాడు బేలగా… రేవంత్ జేసీబీలు ఇంకా ఇలాగే తవ్వితే మల్లారెడ్డి సామ్రాజ్యం ఏమవుతుందో తనకూ తెలుసు… కొడుక్కి ఎంపీ టికెట్టు కావాలట…
ఇక్కడ ఓ ప్రశ్న… మల్లారెడ్డికి డబ్బు బలం ఉంది, కానీ జనంలో..? ఎంత పెద్ద అక్రమార్కులైనా సరే బీజేపీలో చేరగానే నీతిపరులు అయిపోతారు కదా… సేమ్, అలాగే కాంగ్రెస్‌లో చేరగానే మల్లారెడ్డి పునీతుడు అయిపోతాడా..? తన అక్రమాలన్నీ కప్పబడిపోతాయా..? రేవంత్ రెడ్డి సదరు మల్లారెడ్డికి ఇంకా చూపించాల్సిన చుక్కలు మిగిలే ఉన్నాయా..? కాలం చెబుతుంది జవాబు..!! ఐనా ఏముందిలే… పాలమ్మే, పూలమ్మే రేంజుకు తొక్కినా సరే, మళ్లీ వేల కోట్లకు ఫీనిక్స్ పక్షిలా ఎగురగలడు…!!
Share this Article