మహాభారతంలో కర్ణుడు .. క్షత్రియుడా …? శూద్రుడా ? కవచ కుండలాతో కుంతీదేవికి సూర్యుని మహిమతో పుట్టినవాడిని శూద్రుడని ఎలా అంటారు .. పెళ్లికాకుండానే పుట్టాడని అతడిని వదిలేస్తుంది కుంతీమాత.. అలా వదిలేసిన వాడిని శూద్ర కులస్తులు పెంచుకుంటారు .. అయితే ఇక్కడ కర్ణన్ సినిమాలో హీరో క్షత్రియ మాతకు పుట్టిన శూద్రుడు కాదు .. కర్ణుడి మాదిరి కవచ కుండలాలు లేవు … కానీ అతడు అణగారిన వర్గంలో అణిచివేతకు గురైన కులంలో పుట్టినవాడే .. ముసుగులో గుద్దులాటలు లేవు .. డైరెక్ట్ గా పాయింట్లోకి వచ్చేస్తాడు డైరెక్టర్ సెల్వన్ ..
పందులు పెంచే ఇంట్లో హీరో పుడతాడు .. పందుల మధ్యే పెరుగుతాడు .. బహుశా ఈ కేరెక్టర్ ఒక్క ధనుష్ మాత్రమే చేయగలడేమో .. లాల్ లాంటి సీనియర్ యాక్టర్ తో కలిసి ధనుష్ కథలో లీనమైపోతాడు .. కథని డామినేట్ చేసేస్తాడు .. (ధనుష్ కొన్నాళ్లుగా ఎన్నుకుంటున్న భిన్నమైన పాత్రలు, వాటిల్లో లీనమయ్యే తీరు సినిమా ప్రియులకు ఓ అబ్బురమే…) ఒక విధంగా మనకు సినిమా అంతా అయిపోయాక నాలుగే పాత్రలు కనిపిస్తాయి .. ఒకటి ధనుష్ , రెండు లాల్ , మూడు అధిపత్య అహంకార ఎస్పీ , నాలుగు కులం ..అణిచివేతని , వెలి ని స్వయంగా అనుభవించినవాడే ఇలాంటి సినిమాలు తీయగలడు .. ఈ సినిమాలు చూసేవారికి కొన్ని సీన్లలో కత్తి పట్టుకుని అవతలివారిని తెగనరకాలన్నంత కోపం వస్తుంది .. కర్ర పట్టుకుని బస్సు అద్దాలు పగల కొట్టాలనిపిస్తుంది ..
ఒక దళిత గ్రామం .. కనీసం రోడ్డు సదుపాయం కూడా లేని మారుమూలగ్రామం .. కట్టెలు కాల్చి బొగ్గు అమ్ముకుని బతికే నిరుపేద దళితుల గ్రామం .. ఆ ఊరికి బస్సు ఉండదు .. బస్సు ఎక్కాలంటే పక్క ఊరికి వెళ్లి అక్కడ బస్టాప్ లో ఎక్కాలి .. ఈ ఊరి మీదుగా బస్సు వెళ్తున్నా గానీ ఇక్కడ బస్సు ఆపరు .. ఆఖరికి పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భవతి రోడ్డుమీద నిల్చుని బస్సు ఆపినా ఆపనంత మూర్ఖత్వం .. మరి కడుపు మండిన ఒక బుడ్డోడు రాయితో బస్సు అద్దాన్ని పగలగొడితే బస్సు ఆగుతుంది .. ఇక్కడ రాయి అణిచివేతను ప్రశ్నించిన తిరుగుబాటు .. చివరికి ఆ ఊరంతా కలిసి తమ ఊరిలో బస్సు ఆపేలా చేసుకోగలిగారా లేదా అన్నది సినిమా లైన్ ..
Ads
సినిమాలో ఒక గాడిద అటూ ఇటూ మెల్లగా తిరుగుతూ ఉంటుంది .. ఇక్కడ గాడిదకి సినిమాకి చాలా సంబంధం ఉంటుంది .. డైరెక్టర్లు చాలా మంది మంచి సినిమాలే తీస్తారు .. కానీ ఈ తరహాలో తీయడం చాలా అరుదు .. హీరో కనిపించినపుడల్ల గాడిద కనిపిస్తూనే ఉంటుంది.. దాని ముందు కాళ్లకి బంధం వేసి ఉంటుంది .. ఎందుకు దాని కాళ్లని అలా కట్టేశారని కర్ణన్ ఒక సీన్లో అడుగుతాడు.. అలా కట్టేయకపోతే అది ఎక్కడికో పారిపోతుందని లాల్ అంటాడు .. ఒక సీన్లో కర్ణన్ ఆ గాడిద బంధం విప్పేస్తే అది స్వేచ్చగా పరిగెట్టుకుంటూ వెళ్లిపోతుంది .. అక్కడే అప్పటివరకూ తమలో భయం అనే బంధాన్నితెంచుకుని కర్ణన్ ఏ విధంగా తిరుగుబాటు చేస్తాడో డైరెక్టర్ అద్భుతంగా చూపిస్తాడు ..
ఇంకో సీన్లో గ్రద్ద వచ్చి కోడిపిల్లని తన్నుకుపోతుంటే ముసలావిడ ఏడుస్తూ అరుస్తూ గ్రద్దని తిడుతూ ఉంటుంది .. మొదట ఇదో అనవసరమైన సీన్ అని మనకి అనిపిస్తుంది .. కానీ ఆ తర్వాత స్టోరీలోకి వెళ్లాక ఆ గ్రద్ద , కోడిపిల్ల ఎందుకు చూపించాడో అర్దమవుతుంది .. ఇక్కడ గద్ద ఆధిపత్యం .. అహంకారం .. దురాక్రమణ .. దోపిడి .. కోడిపిల్లని సింబాలిక్ గా దళితులు అనే అర్ధంలో చూపిస్తాడు దర్శకుడు ..
తమ ఊరికి బస్టాప్ లేక పక్కనే ఉన్న అగ్రకులాలు ఉండే ఊరి బస్టాప్ లో బస్సు కోసం ఒక దళిత అమ్మాయి , తండ్రితో కలిసి నిల్చుంటుంది .. అటుగా వచ్చిన అగ్రకులాల యువకులు అమ్మాయిని ఇబ్బంది పెడుతూ అసభ్యకర రీతిలో బొమ్మలు గీస్తాడు .. ఆడపిల్లని ఇలా చేయడం బావుందా అని తండ్రి వాళ్లని నిలదీస్తే అందరూ కలిసి అతన్ని చితక్కొడతారు .. అదేమంటే ఇది మా బస్టాప్ అని అహంకారం , ఆధిపత్యం చూపిస్తారు ..ఇక్కడ తక్కువ కులమని ఆడపిల్లని అలా ఇబ్బంది పెట్టిన వారిని ఏమి చేయాలి ? కొట్టాలా ? తలదించుకుని వెళ్లిపోవాలా ? ఇక్కడ కులం కంటే బలుపు ఎక్కువగా కనిపిస్తుంది వారిలో .. అలాంటి బలుపుని అణిచి ఆ ఆడపిల్లకి ధైర్యం ఇవ్వాలి కదా ? ఇక్కడ కర్ణన్ చేసేది అదే ..
ఎప్పుడో ఫిట్స్ తో నడిరోడ్డు మీద చనిపోయిన కర్ణన్ చెల్లిని సినిమా ఇంట్రడక్షన్ లో చూపిస్తాడు .. నడిరోడ్డుమీద నురగలు గక్కుకుని ఆమె చనిపోతే ఆమెకు అటూఇటూ బస్సులు వెళ్తూ ఉంటాయి .. ఇక్కడే దర్శకుడు చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు .. ఆ పాప ఆత్మలా సినిమా అంతా కనిపిస్తూనే ఉంటుంది ..
చెప్పుకోవడానికి సినిమాలో గొప్ప సన్నివేశం అంటూ ఏమీ ఉండదు .. సినిమా అంతా గొప్పదే కాబట్టి .. ఇక్కడ సినిమాలో అగ్రకులాలను కించపర్చే ఉద్దేశం ఏమీ ఉండదు దర్శకుడి పర్ సెప్షన్ లో .. ఇక్కడ కులమంటే అది ఏ కులమైనా సరే ఆధిపత్యం , బలుపు , ఎదుటివారంటే చులకనగా చూసే చూపు , చేసే పెత్తనం , నిరంకుశ ధోరణి , వివక్ష ..
తనముందు దళిత పెద్ద తలపాగా పెట్టుకున్నాడని , తన భుజం మీద చేయి వేశాడని , తనను కూర్చోవడానికి కుర్చీ వేయకుండా నిల్చోబెట్టారని ఒక ఎస్పీ వారందరినీ హింసించే విధానం చూస్తున్న మనకే కడుపు మండిపోయేలా చేస్తుంది .. ఊరి పెద్దలను గంటలు గంటలు పోలీస్ స్టేషన్లో నిల్చోబెట్టి తర్వాత వారి వయసుని కూడా చూడకుండా చితగ్గొట్టే వైనం చూసినప్పుడు .. మనలోనే ఆవేశం రగిలిపోయి అతన్ని గుడ్డలూడదీసి కొట్టాలనిపిస్తుంది .. అతని అహంకారం దిగేదాక రోడ్లు మీద నగ్నంగా పరిగెట్టించి ఆడవాళ్ల చేత కొట్టించాలనిపిస్తుంది ..
ఆ సీన్లో కర్ణన్ .. తమఊరి వాళ్లతో కలిసి వెళ్లి పోలీస్ స్టేషన్ ధ్వంసం చేసి, దెబ్బలు తిని పడి ఉన్న ముసలివాళ్లందరినీ ట్రాక్టర్ లో తీసుకెళ్తున్నప్పుడు అతను చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అలా ఎలా పోలీసుల మీద దాడిచేస్తాడు అన్న ప్రశ్న మనలో ఉత్పన్నం కాదు .. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ల పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన అల్లూరి సీతారామరాజు కనిపిస్తాడు అతనిలో..
ఆధిపత్యాన్ని అణిచివేసేందుకు ఇక్కడ కర్ణన్ ఏది చేసినా అది రైటే అనిపిస్తుంది .. హక్కుల సాధన కోసం చేసే పోరాటం ఏదైనా సమర్ధించాలనే అనిపిస్తుంది .. ఫైనల్ గా ఆయుధం చేతుల్లో ఉన్నవాడిని రౌడీ అనుకుందామా ? యుద్ద వీరుడు అనుకుందామా ? అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి .. ఎందుకంటే ఆయుధం నుంచే అణిచివేత , ఆధిపత్యం మొదలవుతాయి .. అదే ఆయుధం విముక్తిని , స్వేచ్చని అందిస్తుంది …….. రివ్యూ బై…. అశోక్ వేములపల్లి (సినిమా అమెజాన్ ప్రైమ్ లో తమిళంలో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఉంది )
Share this Article