రాం గోపాల్ వర్మ చెంపదెబ్బ ఫిలాసఫీ… వర్మ తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను వ్యాసరూపంలో చెప్పిన పుస్తకమే “చెంపదెబ్బ ఫిలాసఫి”. ఏకబిగిన చదివిన తరువాత వచ్చిన కొన్ని ఆలోచనలను పంచుకోవడమే ఈ వ్యాస ఉద్దేశ్యం. ప్రతి మనిషీ కొందరికి శత్రువుగా, కొందరికి మిత్రునిగా కనపడతారు. కానీ, వర్మ మాత్రం కొందరికి కొరకరాని కొయ్యగా కనపడతాడు. నేను శివ సినిమా చూసి “వీడేందిరా బాబు, ఇట్ట దీసిండు” అని ఆశ్చర్యపోయిన. తను అన్ని బాదరబందీలను వదిలించుకొని నా ఇష్టం అనే పదాన్ని వాడే అవకాశం నిలబెట్టుకున్నాడు. వర్మ అంటే ‘శివ’ ‘నా ఇష్టం’ ల కలయిక అని నా అభిప్రాయం. ప్రధానమంత్రి నుండి పల్లీలమ్ముకునే పాపయ్య వరకూ ఎవరూ ఈ రోజుల్లో విమర్శలకు అతీతులుకారు. విమర్శలు వస్తున్నప్పుడు వాటిని అడ్డుకోవడానికి మనం ఒక కవచాన్ని ధరిస్తాం, విల్లంబులు చేతబట్టి విమర్శించేవాడి మీదకు గురిచూసి వదులుతాం. మన మీదికి వచ్చే విమర్శలను తగ్గించడానికి ప్రయత్నిస్తాం.కానీ, వర్మ అవేమీ చేయకుండా తన ఒంటి మీదున్న చొక్కాని కూడా విప్పి, అమ్మాయి కాళ్ళవైపో కళ్ళ వైపో చూసుకుంటూ వోడ్కా తాగుతుంటాడు.
ఆ విమర్శల బాణాలేమో ఆయనను చీల్చుకొని అవతలికి వెళ్లిపోతాయి. ఆయనకు స్పర్శ కూడా తెలియదు. అదే సమయంలో దేశం లోని పదునైన విమర్శల బాణాలనన్నింటినీ ఒకే సారి తనమీదకి వచ్చేలా ప్లాన్ చేస్తాడు. మనం తిట్టడానికి ఒక మనిషి లేకపోతె ఆ ప్రజాస్వామ్యం దండగ. తిట్టనీకి ఒక మనిషికూడాలేని దురదృష్టవంతుడు ఎవరన్నా ఉంటే వర్మని నిస్సంకోచంగా తిట్టొచ్చు. ఆయనేమీ అనుకోడు. బాగా తిట్టకపోతే మాత్రం ఆయన ఊకోడు. వర్మ చెప్పే వాస్తవాలు కొందరికి విశృంఖలంగా కనిపిస్తాయి. కానీ, వర్మ చెప్పడం వల్ల చెడిపోయినవాళ్లు లేరు. ఒకవేళ ఉన్నా మళ్ళీ బాగుపడే గట్స్ ఉన్నవాళ్లే వర్మ మాటలవల్ల చెడిపోతారు. అయినా చెడు మంచి అనేవి మనం నిర్ణయించుకునే గుణాలు తప్ప వర్మ చెప్పినందువల్ల కాదు.
Ads
పిడికిలి బిగించడం కమ్యూనిస్టులు నేర్పుతారు. కానీ, కమ్యూనిజం తెలియనివాళ్ళు కూడా పిడికిలి బిగించారంటే అది బ్రూస్లీ వల్లనే. బ్రూస్లీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? బ్రూస్లీ కళ్ళలోని తీవ్రతను, బాడీ లోని వేగాన్ని వర్మ ఆవాహనం చేసుకున్నాడు. బ్రూస్లీ లోని తీవ్రతని తన కళ్ళల్లోకి తెచ్చుకొని అమ్మాయిల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వర్మ ప్రత్యేకత. సమాధానం చాలా చిన్నదే అని మనం అనుకుంటున్నప్పుడు వర్మ ఇచ్చే సమాధానం మనను చెంపదెబ్బ కొడుతోంది బ్రూస్లీ పంచ్ లాగా. ప్రశ్న ఎంత చిల్లరగా ఉన్నా సమాధానం ఏదైనా వర్మ చెప్పే విధానంలోని తీవ్రతే మనకు గుర్తు ఉంటుంది.
ఐయాన్ రాండ్ లు, హోవార్డ్ రోర్క్ లు, సతేంద్ర లాంటోళ్లు అందరి జీవితాల్లో ఉంటారు. కానీ, వారి గురించి చెప్పుకోరు. తమ స్వంత క్రెడిట్ పోద్దని. ఇతరులని అనుకరించానని చెప్పి కూడా క్రెడిట్ కొట్టేయడం వర్మకే సాధ్యం. డబ్బు, అధికారం, క్రైం అండ్ సెక్స్ అందరికీ ఇష్టమే. కానీ చెప్పుకోవడానికే భయం. ‘నేనూ అందరి మనుషుల్లాంటి వాన్నే’ అని చెప్పుకుంటూ ‘నా అనుభవాలకు అనుగుణంగా నా ప్రపంచం నిర్మితమై ఉంటుంది అంటాడు’. ‘తన చుట్టూ ఉన్న పరిస్థితులే ఒక మనిషిని తయారు చేస్తాయి’ అన్న కార్ల్ మార్క్స్ మాటలను ఉటంకిస్తూ ‘నేను మంచి స్టూడెంట్ కాకపోవడం వల్ల కూడా నేను నాలా మిగిలాను’ అంటాడు. మాఫియాను పోలీసు డిపార్ట్మెంట్ నూ కలిపి తన కల్పిత ప్రపంచాన్ని సృష్టించుకొని అందులోకి మనని లాగాడు.
‘అందంగా ఉన్నావనుకుంటే అందంగా కనిపిస్తావు, వల్గర్గా ఉన్నావనుకుంటే వల్గర్గా కనిపిస్తావు’. అని రంగీలా హీరోయిన్ ఊర్మిళకు చెబుతాడు. ఈ ప్రపంచమంతా అందంగా ఉందని మనం అనుకుందాం. మనకు పోయేదేముంది ‘వల్గారిటీ’ తప్ప. తిండిబోతు కాని, సోమరి కాని వర్మ చెప్పే సూత్రాలు చెడ్డవి ఎందుకు అవుతాయి? అవనూ వచ్చా? చాలామంది వర్మ పుస్తకాలను చదవొద్దు అనుకొని తప్పకుండా చదువుతారు. ఇది చదవడం వల్ల వర్మ గురించి ఇంకొన్ని అదనపు విషయాలు తెలుస్తాయి. మీ ఇష్టం, చదివితే చదవండి. ఇదంతా చదివిన తరువాత ఇది నేను చేసిన అతి పెద్ద చెత్త పని అని మీరు అనుకుంటే “మీ ప్రపంచంలో మీరుండండి – నా ప్రపంచంలో నేనుంటాను”. ఇది కూడా వర్మ డైలాగే…… By… గోపిరెడ్డి ఏదుల.
Share this Article