.
హిందీ బెల్టులో… ప్రత్యేకించి మహారాష్ట్రలో ఛావా సినిమా ప్రకంపనలు లేపుతోంది… థియేటర్లు నిండుతున్నాయి… ఏదో చెప్పలేని ఉద్వేగం ప్రేక్షకుల్ని ఆవరిస్తోంది…
ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయవచ్చు కదా అనే డిమాండ్ ఒకవైపు… కొడుకు కథే ఇంతగా కదిలిస్తే మరి తండ్రి ఛత్రపతి శివాజీ సినిమా తీస్తే ఇంకెలా ఉంటుందనే చర్చ మరోవైపు… నిజానికి ఐదే రోజుల్లో 200 కోట్ల వసూళ్లు అనే వార్తకన్నా మరో వార్త ఆసక్తికరం అనిపించింది ఈ నేపథ్యంలో…
Ads
కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా పరిచయమైన రిషబ్ శెట్టి నిజంగానే శివాజీ పాత్ర పోషించబోతున్నాడు… తను ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు… ఐతే తను దానికి నిర్మాత కాదు… ప్రముఖ హిందీ నిర్మాత సందీప్ సింగ్ దానికి నిర్మాత… మిగతా వివరాలు త్వరలో చెబుతాను, 2027లో ఆ సినిమా రిలీజ్ అవుతుంది అంటున్నాడు…
గుడ్… ఈ వార్త చదివాక అనిపించింది… ఇదే హీరో విక్కీ కౌశల్, ఇదే హీరోయిన్ రష్మిక, ఇదే డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్, ఇదే అక్షయ్ ఖన్నా, ఇదే ఏఆర్ రెహమాన్ టీమే ఆ శివాజీ సినిమా తీస్తే బాగుండు అని… ఎక్కడా రాజీపడలేదు నిర్మాణ విలువల్లో… ఎవరూ తక్కువ చేయలేదు… పర్‌ఫెక్ట్ కాంబినేషన్… అలాగని రిషబ్ శెట్టి ఏదో తక్కువ అని కాదు…
నిజానికి తను ఫేమ్ అయ్యింది కాంతారతో… మామూలు సినిమాయే… చివరి అరగంట డ్రామాయే దానికి ప్రాణం… మిగతా సినిమా జస్ట్ ఓ సాదాసీదా రొటీన్ కన్నడ ఫార్ములా సినిమాయే… మరి శివాజీ కథకు ఓ గ్రాండ్‌నెస్ కావాలి… విక్కీ కౌశల్‌లాగా ఓ తపస్సు చేయాలి… రిషబ్ ప్రస్తుతం కాంతార ప్రిక్వెల్‌లో బిజీ… జైహనుమాన్ కూడా చేస్తున్నాడు…
వాస్తవంగా శివాజీ మీద టీవీ సీరియళ్లు, సినిమాలు, యానిమేటెడ్ సీరియళ్లు గట్రా బోలెడు వచ్చాయి… కానీ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని మళ్లించుకోలేదు ఏదీ… తను ఒక్క మరాఠీ ఛత్రపతి మాత్రమే కాదు, నేషనల్ హీరో… తన ఇమేజీకి సరిపోయే నిర్మాణం జరగాలి… అదీ పాన్ ఇండియా రేంజ్ కావాలి… అప్పుడే శివాజీ చరిత్రకు న్యాయం జరుగుతుంది…
తెలుగులో ఎన్టీయార్‌కు శివాజీ పాత్ర పోషించాలనే కోరిక బలంగా ఉండేది చెబుతారు… కృష్ణ కొంత ప్రిప్రొడక్షన్ వర్క్ కూడా చేసినట్టు సమాచారం… ఇతర భాషల్లోనూ హీరోలకు ఆసక్తి ఉండేది కానీ ఎవరూ పెద్దగా సక్సెస్‌ఫుల్‌గా వర్కవుట్ చేయలేదు… ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ రెండేసి భాగాలు, మూడేసి భాగాలు కదా…
శివాజీ చరిత్రను కూడా ఒకే పార్టులో ఇమడ్చటం కష్టం… అందుకని బడా నిర్మాణ సంస్థ, నేషనల్ పాపులారిటీ ఉన్న భారీ తారాగణం బెటర్… తన ఆరోగ్యం బాగాలేదంటున్నారు గానీ ప్రభాస్ వంటి హీరో అయితే ఆ లుక్కు వేరు, ఆ అట్రాక్షన్ వేరు ఉంటుంది… తన కథలో కూడా వేలుపెట్టడు… ఏమో, రిషబ్ శెట్టి సినిమా పట్టాలెక్కితే, అనుకున్నట్టుగా ఔట్ పుట్ వస్తే రిషబ్ శెట్టికి తిరుగులేదు ఇక.., కొన్ని పాత్రలు దక్కడమే వరం… అందుకని..!!
Share this Article