Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇప్పుడు ప్రతివాడూ దొంగే… సంప్రదాయ చోరకళకు ఆ విలువేదీ..? ఔన్నత్యమేదీ..?

June 9, 2023 by M S R

Bharadwaja Rangavajhala…..   సంప్రదాయ చోరులు ఎన్నడూ ప్రాణం బలితీసుకోరు… కేవలం దొంగతనం మాత్రమే చేస్తారు… అబ్బ, ఆ మధ్య మా ఇంట్లో ఓ దొంగ పడ్డాడు బావా, తాళాలు నా మొలతాడుకు ఘట్టిగా కట్టుకొని పడుకున్నా… అస్సలు మెలకువ రాకుండా ఎలా తీసాడో… మా ఐనప్పెట్టే తెరవడం ఎంత కష్టం నీకు తెల్సు కదా… పైగా పెద్దగా మోత.. ఆ మోతకి భయపడి నేను దాన్ని తెరవను. అంతమందిమి అక్కడే పడుకున్నాం. ఎవరికి మెలుకువ రాకుండా ఎలా తెరిచాడో దోచుకు పోయాడో.. తల్చుకుంటే వాడి కళకు మోకరిల్లాలి అనిపిస్తుంది… అని దొంగతనం చేయించుకున్న ఆసామి ముచ్చట పడుతూ ఏమి కళ ఏమి కళ అని కొనియాడు విధంగా ఉండాలి….

ఓ వ్యసనుడి కథ…. అనగనగా ….. మాళవ రాజ్యంలో వ్యసనుడు అనే పేరు గల గజదొంగ ఉండేవాడు. అతను … అవసరమున్నా లేకున్నా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఒక నాడు వ్యసనుడు మాళవరాజ్యం ఉత్తర దిక్కున ఉన్న జంభినీ పురం అను గ్రామంలో ఓ కామందు ఇంట దొంగతనం చేయుటకు నిర్ణయించుకొనెను. నాలుగు రోజులు ఆ ఊరి రజకుల ఇంట నౌకరుగా పనిచేయుచూ … కామందు ఇంటి పరిస్తితి గమనించాడు. నాలుగు రోజుల తర్వాత ఓ రాత్రికి ఆ ఇల్లు దోచుకుని పారిపోవుటకు పథక రచన చేశాడు వ్యసనుడు.

ఆ రోజు రానే వచ్చింది… రాత్రి బాగా పొద్దు పోయాక వీధి కావలివారి కళ్లుగప్పి అనుకున్న పద్దతిలో ఒడుపుగా గోడదూకి గడ్డివాములో చొరబడ్డాడు.

ఆ ఇంటి ఉత్తరవేపు ద్వారబంధము బలహీనముగా ఉండుట గమనించి ఉన్న వ్యసనుడు ఆ ద్వారమునే కేంద్రీకరించి ఒడుపుగా తెరచి … కామందు ఇంట ప్రవేశించినాడు. కామందు ఇంట అందరూ గాఢనిద్రలో ఉండగా వ్యసనుడు నెమ్మదిగా ఆ ఇంట ఉన్న ధన కనక వజ్ర వైఢూర్యములనెల్ల మూటకట్టెను.

Ads

ఆ మూటను భుజానికెత్తుకుని ఉత్తర వేపు ద్వారము వద్దకు చేరుటకు వడివడిగా వచ్చుచుండగా … కామందు చావిడికీ ఉత్తరేపు గదికీ మధ్య ఉన్న గుమ్మమునకు వ్యసనుడి కాలు కొట్టుకుంది … శబ్దము కాలేదు. కానీ వ్యసనుడు భుజం మీదున్న మాట కింద దింపి కాలు తడుముకుని చూసుకున్నాడు. గోరు ఊడిందని అర్ధమైంది .. కాలు స్వల్పముగా నెత్తురోడుతోంది … అయితే ఆ తాలూక నొప్పి విపరీతముగా ఉన్ననూ వ్యసనుడు దాని గురించి ఆలోచించడం లేదు …

ఊడి పడిన గోరు కొరకు వెతుకుతూ ఉండిపోయాడు …. ఎంత వెదికినా ఊడిన గోరు కనిపించడం లేదు .. ఒక వేపు తెల్లవారే సమయం ఆసన్నమైంది… ఇంటిలోని పాలేర్లు లేచి పనులకు సిద్దమవుతున్నారు … గోరు కోసం వ్యసనుడు వెతుకుతూనే ఉన్నాడు. చుట్టుపక్కల పరిస్థితులేవీ అతను పట్టించుకోవడం లేదు … ఇంతలో కామందు చిన్న కోడలు పడకగది నుంచీ బయటకు వచ్చింది.

తిన్నగా చావిడిలో ఎవరో తచ్చాడుతున్నట్టు అనిపించి … మూసి ఉన్న కిటికీ తలుపు తెరచినది .. సన్నగా ప్రసరించిన వెలుగులో వ్యసనుడిని గుర్తించింది … ఎవరో అపరిచితుడు తమ ఇంట్లో ఆ సమయంలో ఏదో వెదుకుతూ కనిపించే సరికి చిన్న కోడలు పెద్దగా కేక పెట్టింది… ఆ కేక ఇంట్లో అప్పుడే మేలుకుంటున్న కామందు కుటుంబ సభ్యులతో పాటు .. దొడ్లో పనులకు ఉపక్రమిస్తున్న పాలేర్లకూ వారి భార్యలకూ సైతం వినిపించిందిగానీ … వ్యసనుడికి వినబడలేదు … అతను ఇంకా గోరు కొరకు వెతుకుతూనే ఉన్నాడు …

చిన్న కోడలు కేకకు అందరూ చావిడిలోకి చేరి వ్యసనుడ్ని పట్టుకుని కట్టేసి … గ్రామ పెద్ద దగ్గరకు తీసుకుపోయారు. ఆయన కోత్వాలును పిల్చి విచారణ ప్రారంభించారు. వ్యసనుడి ముఖంలో దొరికిపోయాననే బాధ కన్నా గోరు కనిపించలేదనే బాధే ఎక్కువగా కనిపిస్తోంది. కామందును అడగసాగాడు. అయ్యా … నా గోరు మీ నట్టింట పడిపోయింది దాన్ని బయట పడేసిన తర్వాత ఈ విచారణ పెట్టుకోండి అని బతిమాలుకున్నాడు.

కానీ కామందు వినడం లేదు … ఇదేదో ఎత్తు వేస్తున్నాడని అతని అనుమానం …

ఊరి పెద్ద వ్యసనుడి కట్టు విప్పించి .. ఓయీ నీవేల కామందుగారింట ప్రవేశించితివి అని ప్రశ్నించారు. దొంగతనము చేయుటకు ప్రభూ, ఆ ఇంట పూచికపుల్లతో సహా ఎత్తుకుపోవు ఉద్దేశ్యముతో నాలుగు రోజులుగా రెక్కీ చేసి మరీ చోరీకి పాల్పడితిని ప్రభూ అని ధీర చిత్తముతో సమాధానమిడెను వ్యసనుడు.

నీవు చోరీ చేసిన సొమ్మంతయూ మూటకట్టావు. ఉత్తర వేపు ద్వారము తెరిచియే ఉంది మరి నీవేల పారిపోక చావడిలో తచ్చాడుతూ దొరికిపోయావు అని ప్రశ్నించారు ఊరిపెద్ద … అయ్యా నేను వేకువఝాముకు సుమారు మూడు గంటల ముందే పని పూర్తికావించుకుని బయటకు పోవుచుండగా … చావిడికీ ఉత్తరవేపు గదికీ మధ్య ఉన్న గడపకు నా కాలుకొట్టుకుని గోరూడి కింద పడింది … నా గోరు వారి నట్టింట పడుట వలన వారికి అరిష్టము సంభవించుననే భయంతో దాన్ని వెతికి బయట వేయవలెనని వెతుకుతూ అచ్చటనే ఉండిపోయితిని … ఇప్పటికీ నా విన్నపము అదియే … దొంగతనము చేయవచ్చినందుకు మీరు నాకే శిక్ష విధించిననూ నేను స్వీకరించగలను .. ముందు వారి నట్టింట పడిన నా గోరును తీసి బయటపడవేయు అవకాశము నాకు కల్పించుము ప్రభూ అని వేడుకున్నాడు …

వారింట అరిష్టము సంభవించిన నీకేమి, నీ దొంగతనము ద్వారా సమకూడిన ధనముతో ఏల పారిపోలేదు అని తిరిగి ప్రశ్నించారు గ్రామపెద్ద …

అయ్యా … ప్రకృతిలో ప్రతిదీ ఒకదాని మీద ఒకటి ఆధారపడియే బతుకును కదా.. కామందులు కళకళలాడుతూ ఉంటేనే కదయ్యా వారింట మాలాంటి దొంగలు అప్పుడప్పుడూ దోచుకుని బతికగలిగేది.. వారింట అరిష్టము తాండవించిన మేమెక్కడ దొంగతనం చేసుకు బతకాలయ్యా ….?

వ్యవసాయము సాగునప్పుడు భూమినందు చేరు పురుగూ పుట్రా పంటకు లాభమూ చేయును నష్టమూ చేయును … ఇది ప్రకృతి ధర్మము కదా ప్రభూ … అందులకే నేను దొరికిపోయెదనని తెల్సిననూ గోరు వెతుకుతూ ఉండిపోయితిని అని న్యాయమూర్తి ముందు వినమ్రుడై విన్నవించెను.

వ్యసనుడి వాదన విన్న గ్రామపెద్ద కోత్వాలు ఇద్దరితో పాటు కామందు … ఆయన కుటుంబ సభ్యులూ సర్వులూ … భోరున ఏడ్చి .. వ్యసనుడిని తోడ్కొనిపోయి గోరు వెతికించి తీయించి ఆవల పారవేయించారు.

ఈ కార్యక్రమము పూర్తయిన పిదప వ్యనసుడిని చూసిన గ్రామపెద్ద … ఇంత తెలిసిన వాడివి నీవేల దొంగతనము మానరాదు అని ప్రశ్నించారు.

దొంగలూ దొంగతనం ఇవి సృష్టిలో ఉన్నాయంటేనే వాటి వలన ఏదో సమతుల్యత ప్రకృతి ఆశిస్తున్నట్టే కదా ప్రభూ, అందులకుగాను నన్ను నా కుల వృత్తిని మానమని చెప్పవలదు … మీరు నాకే శిక్ష విధించిననూ చెరసాలకు పోవుట పట్ల నాకు వ్యతిరేకత కూడా లేదు .. అనెను.

గ్రామపెద్ద వ్యసనుడికి ఏ శిక్ష విధించాడు ఏమిటీ అనేది అప్రస్తుతం … క్లైమాక్స్ ల్యాగ్ అయ్యిందని మళ్లీ సమీక్షకులు గగ్గోలు పెట్టెదరు కనుక కథ ఇచ్చటనే పరిసమాప్తిస్తున్నాను. (ఈ కథ నేనెచ్చటనో చదివితినో లేక … వింటినోగానీ నా మనసున అటుల ముద్రితమైపోయెను. బహుశా చందమామ బాలమిత్ర తదాదిగా గల పత్రికల నుంచే అది చదివిన గ్యాపకం… దొంగతనం కూడా ప్రకృతిబద్దంగా ఉండే స్థితి నుంచీ చంపేసైనా పర్లేదు అనుకునే దాకా బుర్రలు ఎదిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో .. ముఖ్యం చోర కళాకారుల స్థానంలో… ఎవరు పడితే వారు దొంగతనానికి పాల్పడుతూ దొంగల ఔన్నత్యాన్ని మంట కలుపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో … ఈ కథ అవసరముందని అప్పుడప్పుడూ ఇలా ప్రస్తావిస్తూంటానన్నమాట … స్వస్తి …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?
  • Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!
  • *రెండు జెళ్ల’తో అర్జెంటుగా కుర్రాళ్ల మనసుల్ని పిచ్చెక్కించేసింది…!!
  • ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!
  • బిగ్‌బాస్… బిగ్‌లాస్… కళ్లు నెత్తికి ఎక్కడం తప్ప వేరే ఫాయిదా లేదు..!!
  • ట్రంపు చెప్పాడని ఐఫోన్ గుడ్డిగా వినదు… అది పక్కా వ్యాపారం…
  • వాళ్ల మానాన వాళ్లు బతుకుతున్నా సరే… శ్రీముఖి వదిలేట్టు లేదు…
  • గుడ్డిగా నమ్మేయవద్దు… సోషల్ మీడియాలో కొందరుంటారు… జాగ్రత్త…!!
  • హీరోయిన్ బాత్‌రూం‌తో ఏం పనిరా..? వీటినే పిచ్చి కూతలు అంటారు…!!
  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions