.
రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన… ఎవరైనా సరే తమ పాత క్రెడిబులిటీని, మంచి పేరును పణంగా పెట్టాలా..? బీఆర్ఎస్‌లో చేరగానే కేసీయార్ పాలనకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనా..? తనే చేసిన పాత ఆరోపణల్ని డిలిట్ కొట్టేయాలా..?
ఫోన్ ట్యాపింగు కేసుకు సంబంధించి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చూస్తే విస్మయం కలిగింది… కేసీయార్ పట్ల ‘బారా ఖూన్ మాఫ్’ అనే ధోరణిని తీసుకోవడమే ఈ ఆశ్చర్యానికి కారణం… అంతేకాదు, ఓ పోలీస్ అధికారి బీఆర్ఎస్‌లో చేరగానే, సగటు రాజకీయ నాయకుడిలా ఇలా వేగంగా రూపాంతరం చెందడం కూడా ఆశ్చర్యకరమే…
Ads
నిజానికి తను ఫోన్ ట్యాపింగు మీద చేసిన ఆరోపణతోనే ఈ ట్యాపింగ్ డొంక కదిలింది… ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపిని అడగడం, తను ప్రాథమిక ఆధారాలు సేకరిస్తే ఓ పెద్ద అక్రమ ఫోన్ ట్యాపింగ్ నెట్‌వర్క్ బయటపడటం గురించి ఎవరో కాదు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే చెప్పాడు…
ఆర్ఎస్పీ తనే గతంలో మీడియా ముందే చెప్పాడు… ఫోన్ ట్యాపింగులు, పెగాసస్ బాపతు ఇజ్రాయిలీ పరికరాలు, నిఘా గురించి… ఇప్పుడేమో కేసీయార్ అలాంటివాడు కాదు, అస్సలు పోలీసు వ్యవస్థను తన లబ్ధి కోసం వాడుకోలేదు అనే సర్టిఫికెట్ ఇస్తున్నాడు… సరే, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ సర్టిఫికెట్లు తప్పవేమో… కానీ తనే కదా ఫోన్ ట్యాపింగు డొంకను కదిలించడం స్టార్ట్ చేసింది.., అది విస్మరిస్తే ఎలా..?
ఎస్, ఇంతకుముందు ప్రవీణ్ ఐపీఎస్ అయి ఉండీ… గురుకులాల కార్యదర్శిగా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశాడు… కొత్త భవనాల నిర్మాణం, నిధులు, మౌలిక వసతులు, భోజనాలతోపాటు… దళిత, బహుజన బిడ్డల నుంచి మెరికలను తయారు చేశాడు… చదువుతోపాటు భిన్న రంగాల్లో ప్రోత్సహించాడు…
ఖచ్చితంగా దళిత, బహుజనాలకు చెందిన ఒక తరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు… బీఎస్పీలో చేరాడు, దానికి కట్టుబడి ఉన్నాడా..? లేదు…! (అసలు తనను బీఎస్పీలో చేర్పించాడనీ, ఆ వర్గాల వోట్లు కాంగ్రెస్‌కు పడకుండా ఇదో రాజకీయ వ్యూహమనే విమర్శలూ అక్కడక్కడా వినిపించాయి..) తరువాత తనే బీఆర్ఎస్‌కు జై అన్నాడు…
సరే, రాజకీయాల్లో అవకాశాల్ని వెతుక్కోవడం తప్పు కాదు… ఏ పార్టీలో చేరాలనేదీ తన చాయిస్… అందులోనూ తప్పులేదు… ఉండకూడదు… కానీ రాజకీయాల్లో చేరినంత మాత్రాన కొత్త బాస్ కోసం తను తగ్గిపోకూడదు…
కేసీయార్ హయాంలో ఫోన్ ట్యాపింగు అరాచకం అనేది నిజం… అది తనకూ తెలుసు… పైగా తనే కదా తీగ లాగింది… దానికి భిన్నంగా మాట్లాడితే తన మాటలకే విలువ తగ్గిపోలేదా..? ఒకప్పటి ఆర్ఎస్పీకి, ఇప్పటి ఆర్ఎస్పీకి నడుమ ఎంత తేడా..?!
పోనీ, ఇతర బీఆర్ఎస్ నేతల్లాగే ఇప్పుడూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే వ్యాఖ్యలు చేస్తే సరిపోయేదేమో… తన పాత మాటల్ని తనే ఖండించుకోవడంకన్నా..!! సాక్షాత్తూ రేవంత్ రెడ్డే చెబుతున్నాడు కదా, ట్యాపింగు తప్పు కాదు.., కానీ దానికి పరిమితులు, పరిధులు, పర్మిషన్లు అవసరం అని..!!
Share this Article