.
బీజేపీ- ఆర్ఎస్ఎస్ వేరు కాదు… బీజేపీలోకి వచ్చే సంఘేతర నాయకులకు కూడా ఈ విషయం తెలుసు… రాజకీయ అవసరాల కోసం తమ భావజాలానికి విరుద్ధంగా వ్యవహరించేవాళ్లనూ బీజేపీ కొన్నిసార్లు ఎంటర్‌టెయిన్ చేస్తుంది… వాళ్లు హిమంత విశ్వశర్మలాగా ఇమిడితే వోకే, లేకపోతే తెగదెంపులే… నేను తెలంగాణ పీడీఎస్‌యూ భావజాలపు ఈటల రాజేందర్ గురించి చెప్పడం లేదు…
కేసీయార్ కక్షగట్టి, కేసులు పెట్టి, వేధిస్తూ… నరకం చూపిస్తున్న దశలో ఓ ప్రొటెక్షన్ కోసం మాత్రమే బీజేపీలో చేరాడు… కానీ తను పక్కా యాంటీ – సంఘ్… ఎన్ని మరకలున్నా, ఎంత నల్లటి చరిత్ర ఉన్నాసరే, బీజేపీలో చేరగానే పవిత్రులు అయిపోతుంటారు కదా…
Ads
సరే, ఈ ఉదాహరణల్ని వదిలేస్తే… సంఘ్ నేపథ్యం ఉండీ కేసీయార్ వంటి నాయకుల ఎదుట మోకరిల్లే బడా బడా తెలంగాణ నాయకులకన్నా… నిజాయితీగా తమ కొత్త పార్టీ కోసం పనిచేసే ఈటల వంటి నేతలు నయమే… అయితే..?
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదల… కాదు, కాదు, సంఘ్ ఎదుగుదల ఎలా ఉంది..? ఆంధ్రప్రదేశ్‌ను కాసేపు వదిలేద్దాం… ఈశాన్యం, కశ్మీరం వ్యవహారాల్ని కూడా చక్కదిద్దిన రాంమాధవ్ వంటి సంఘ్ నేతలున్నా ఏపీలో సంఘ్, బీజేపీ ఎదుగుదల అడుగు కదిలేదు లేదు, అంగుళం పెరిగేదీ లేదు… టీడీపీకి ఈరోజుకూ అది ఓ తోక పార్టీ… బీజేపీలో ఒక్కరంటే ఒక్కరు జనంలోకి వెళ్లి ప్రభావం చూపే నేతలు లేరు, లేరు…
చంద్రబాబు దాన్ని ఎదగనివ్వడు… అది తన తోకలాగే ఉండాలి… ఇక జగన్ సరేసరి… తిరుమల సహా అనేకాంశాల్లో పక్కా సంఘ్ వ్యతిరేకి… రహస్య దోస్తీలో ఉన్న బీజేపీ కేవలం రాజకీయ కారణాలతో తనను తెరవెనుక ప్రేమిస్తున్నట్టుంది… సరే, దిక్కుమాలిన ఏపీ పాలిటిక్స్ వదిలేస్తే…
తెలంగాణకు వద్దాం… ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు… కానీ ఎనిమిది పార్టీలు, ఎనిమిది గ్రూపులు… ప్రతి ఒక్కరూ మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, నవీన్ నితిన్… సమన్వయం లేదు, అసలు మార్గదర్శనం లేదు… మాట్లాడితే కేసీయార్ ఎదుట మోకరిల్లి, కలిసి ఎన్నికల్లో పోదాం, తోకగా మారదాం అనే పోకడ తప్ప… మోడీ సమకాలీనులతో సహా…
మరి బీజేపీకి మార్గదర్శనం చేయాల్సిన ఆర్ఎస్ఎస్ పరిస్థితి ఏమిటి..? డెఫినిట్‌గా పెరుగుతోంది… బీజేపీ నేతల మీద అసంతృప్తి ఉన్నా సరే… సంఘ్ యాక్టివిటీ పెరుగుతోంది… ప్రధానంగా ఉత్తర తెలంగాణలో, హైదరాబాద్ శివార్లలో వేగంగా ఎదుగుతోంది… రాబోయే గ్రేటర్ మూడు కార్పొరేషన్లలో కార్పొరేటర్ టికెట్ దొరికితే చాలు, లక్కీ అనుకునే సిట్యుయేషన్… అయితే..?
అందరికీ ఓ డౌట్… కేసీయార్ ఎదుట సాగిలబడే ముఖ్య నేతలు మళ్లీ దెబ్బతీస్తారని..!! సరే, సంఘ్ విషయానికి వద్దాం… బీజేపీ పట్ల, సంఘ్ పట్ల సానుకూలత బాగా పెరుగుతోంది… మోడీ ఫ్యాక్టర్ ప్రభావం ఉంది… రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) తెలంగాణలో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది…
దాదాపు 3,400 శాఖలతో (300 ప్లస్ కొత్తవి) బలమైన ఉనికి… శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 2025- 26లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ‘హిందూ సమ్మేళనాలు’, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా మరింత విస్తరణపై దృష్టి సారించింది… RSS వంద ఏళ్లు పూర్తి చేసుకున్నది… ప్రతి గ్రామం లేదా పట్టణాలలో 10,000 జనాభా ఉన్న ప్రాంతానికి ఒక శాఖను ఏర్పాటు చేసినట్టు RSS వర్గాలు చెబుతున్నాయి…

తెలంగాణలో ఎదగటానికి కారణం ఉగ్రవాదం, ఇస్లామిక్ తీవ్రవాదంతో ఘర్షణ… ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ సంఘ్ ఎదుగుతుంది, దాంతోపాటు బీజేపీ ఎదుగుతుంది… ఇన్నేళ్లూ టీడీపీ, బీఆర్ఎస్ తోకగా ఉన్నన్నాళ్లూ లక్షల మంది సంఘ్ వీరవిధేయులు దూరమయ్యారు… ప్రత్యేకించి తెలంగాణ బీజేపీ బాధ్యులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు… ఐనా సరే, వోట్లేయటానికి జనం సిద్ధంగా ఉన్నారంటే… అది కేవలం సంఘ్ అదృష్టమే…
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో తమ శాఖలు విస్తరిస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ వర్గాలు చెబుతున్నాయి… తమ సైద్దాంతిక CORE బెల్ట్ గా ఉత్తర తెలంగాణ గురించి RSS చెబుతోంది… మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండడం, బీజేపీ ఓటు బ్యాంకు మొదటి నుంచీ బలంగా ఉండడం ఇందుకొక కారణం… వరంగల్, హన్మకొండ, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా బీజేపీ విస్తరిస్తోంది…
నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలను టార్గెట్ చేసినట్లు RSS వర్గాలు అంటున్నాయి… ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో RSS ఉనికి చాలా తక్కువ… సీపీఐ, సిపిఎం, ఎం.ఎల్ గ్రూపుల పట్టు కారణంగా ఉమ్మడి ఖమ్మంలో చొరబడలేకపోతున్నది… ఇవన్నీ వదిలేయండి…
పింక్ సేవ నుంచి తెలంగాణ కాషాయ పెద్దలు బయటపడితే ఖచ్చితంగా బీజేపీకి మరింత ప్రాభవం… ఎటొచ్చీ అమిత్ షాకు తెలంగాణ బీజేపీ కేరక్టర్లు అర్థం కాకపోవడమే అసలు సమస్య… మరి పెద్ద దొర ప్రభావం మాములుదా..!! ఉదాహరణ అంటారా… జుబ్లీ హిల్స్ ఉపఎన్నికను దొర వారికి తాకట్టు పెట్టారు కదా…!!
Share this Article