.
Subramanyam Dogiparthi …… అలనాడు ఆదిశంకరుడికి ఛండాలుని రూపంలో వచ్చి మహా శివుడు లోకకళ్యాణం కోసం దారి చూపించాడు . అలాగే ఈ సినిమా ప్రారంభంలో కధానాయకుడు సూర్యం బాబుకు అలాంటి ఛండాలుని రూపంలోనే వచ్చి ఉద్బోధ చేస్తుంది ఓ పాత్ర .
దేవుడు రెండు చేతులు ఇచ్చింది ఒకటి మనకు , మరొకటి ఇతరులకు సేవ చేయటానికి అని జ్ఞానోదయం కలిగిస్తుంది ఆ పాత్ర . ఒక ఊరి కధ సినిమాలో నటించిన యం వి వాసుదేవరావే ఈ కీలక పాత్రను పోషించింది . ఈ సన్నివేశం శుభారంభం .
Ads
ఇంతకన్నా చాలా గొప్పగా ఉంటుంది సినిమా ముగింపు . సాక్షాత్తు దేశ ప్రధానే కధానాయకుడి గ్రామానికి వచ్చి సత్కరించటం కధకు హైలైట్ . కధానాయకుడు సూర్యం 28 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మద్యరహిత గ్రామాలుగా సంస్కరించినందుకు దేశ ప్రధాని అతన్ని సత్కరించటం .
గ్రామ స్వరాజ్యం , సమతా భావం , అస్పృశ్య నివారణ వంటి సామాజిక సందేశాలతో దేశాన్ని ముందుకు నడిపించిన మహాత్మాగాంధీ బొమ్మ నేపధ్యంలో ఈ సత్కార కార్యక్రమాన్ని దర్శకుడు బాలచందర్ అద్భుతంగా చూపారు .
వీటిని మించి ఏ తండ్రి అయితే అలగా జనంతో ఊరేగుతావా అని ఈసడించుకున్నాడో ఆ తండ్రే వేదిక మీదకొచ్చి సూర్యం తండ్రిని అని చెప్పుకునే సన్నివేశం మహాద్భుతం . ఆయనే కధానాయకుడిని , నాయికను కలపటం ఇంకా అద్భుతం .
తమ తల్లి అంజనాదేవి పేరు మీద ఈ చిత్ర నిర్మాణ సంస్థని ప్రారంభించారు అన్నదమ్ములు చిరంజీవి , నాగబాబు . ఏదో నాలుగు డ్యూయెట్లు , ఓ మూడు ఫైట్లు వంటి రొటీన్ మసాలా సినిమా తీయకుండా చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే ఓ కల్ట్ క్లాసిక్కుని తీసారు అన్నదమ్ములు . వాళ్ళ సినిమా జన్మ చరితార్ధం అయింది .
ఆర్ధికంగా నష్టం వచ్చి ఉండవచ్చు . కానీ , తల్లి పేరుతో తీసిన సినిమా ద్వారా కలకాలం నిలిచిపోయే కీర్తి , పురస్కారాలు వర్షించటం సాధారణ విషయం కాదు . మూడు జాతీయ అవార్డులు వచ్చాయి . నర్గీస్ దత్ పేరిట ఇచ్చే జాతీయ సమైక్యత అవార్డు రావటం అంటే సాధారణ విషయం కాదు . 1965 లో ప్రవేశ పెట్టబడిన ఈ అవార్డు ఇప్పటివరకు తెలుగులో రెండు సినిమాలకే వచ్చాయి . ఒకటి సప్తపది , రెండవది ఈ రుద్రవీణ .
ఇది కాక ఇళయరాజాకు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు , జేసుదాసుకు ఉత్తమ గాయకుడి అవార్డు వచ్చాయి . నాలుగు నంది అవార్డులు వచ్చాయి . సంభాషణలు వ్రాసిన గణేష్ పాత్రోకి , ఇళయరాజాకు , ఆడియోగ్రాఫర్ పాండురంగానికి , కధానాయకుడు చిరంజీవికి ప్రత్యేక జ్యూరీ అవార్డులు వచ్చాయి .12 వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది .
ఇంత గొప్ప కధాంశంతో కధను తయారుచేసిన బాలచందర్ని ముందుగా అభినందించాలి . గ్రామంలో తాగుబోతుల చేత మద్యాన్ని మాన్పించటానికి జరిగిన బేరంలో పెళ్లి పీటల మీద పెళ్ళిని త్యాగం చేసే ధీరోదాత్త పాత్రని సృష్టించటం గొప్ప సృష్టి .
అంతేనా ! జనం కోసం , ముఖ్యంగా పీడిత జనం కోసం సాంప్రదాయానికి ప్రాణం ఇచ్చే తండ్రితో ఘర్షణ పడే పాత్రను సృష్టించటం . నమ్మిన సిధ్ధాంతం కొరకు రాజీపడని జీవితాన్ని నడిపిన పాత్రను సృష్టించటం . ఆ పాత్రకు మరెవరూ అంతగా న్యాయం చేయలేరు అన్నట్లుగా నటించారు చిరంజీవి . చిరంజీవి నట కిరీటంలో ఓ కలికితురాయి ఈ పాత్ర .
సినిమాలో పాత్రలన్నీ అలాగే మలచబడ్డాయి . నాయిక శోభన . కధానాయకుడి లక్ష్యం కొరకు పెళ్లి పీటల మీద నుండి లేవటం . స్వతహాగా గొప్ప నర్తకి అయిన ఆమె ఆ పాత్రను బ్రహ్మాండంగా పోషించింది . ఇంక అసలు సిసలైన పాత్ర బిళహరి గణపతి శాస్త్రి . శంకరశాస్త్రి గారు శంకరాభరణానికి ప్రతీక అయితే గణపతి శాస్త్రి గారు బిళహరి రాగానికి ప్రతీక . జెమినీ గణేశన్ గొప్ప ఎంపిక .
మరో రెండు గొప్ప పాత్రలు అన్నావదినలవి . పేరుకు వదినే కానీ పాత్ర తల్లిది . అలాగే నటించింది సుమిత్ర . నెగటివ్ పాత్రల్లో ఎక్కువగా కనిపించే ప్రసాద్ బాబుకు చక్కటి సాత్విక పాత్ర లభించింది . సద్వినియోగం చేసుకున్నాడు .
ఇంకో మంచి పాత్ర గణపతి శాస్త్రి గారి కుమార్తె . దేవిలలిత గొప్పగా పోషించింది . అటూఇటూ స్వర్ణకమలంలో కూడా ఆమెది ఇలాంటి పాత్రే . అందులో కూడా చక్కగా చేసింది . మరో ముఖ్య పాత్ర పి యల్ నారాయణది . అద్భుతంగా నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో రమేష్ అరవింద్ , బ్రహ్మానందం , కృష్ణ చైతన్య , కాకినాడ శ్యామల , స్టంట్స్ రాజు , తదితరులు నటించారు .
ప్రత్యేకంగా వివరించాల్సింది MP పాత్రలో సత్యనారాయణ . పోలీస్ స్టేషన్ లేని గ్రామాలు , తాగుడు లేని ఊళ్ళు , తలుపుల అవసరం లేని ఇళ్ళు , సోమరితనం లేని జనం , వగైరాలతో ఇంప్రెస్ అయి ఆ గ్రామాయణం విని , పార్లమెంటులో ప్రస్తావించి , ప్రధానినే కదిలించే పాత్రను సత్యనారాయణ చాలా హుందాగా నటించారు . అయితే తర్వాత కాలంలో ఆయన నిజంగానే పార్లమెంట్ సభ్యుడు అయ్యారు .
ఇంక ఈ సినిమాని అమరం చేసిన మహానుభావులు సిరివెన్నెల వారు , ఇళయరాజా , జేసుదాస్ , బాలసుబ్రమణ్యం , చిత్ర , శైలజ , నాగోర్ బాబులు . ఒక్కొక్క పాట గురించి ఓ డిజర్టేషనే వ్రాయవచ్చు . ప్రారంభంలో వచ్చే పాటే వేదాంత గీతం . చుట్టుపక్కల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్న వాడా . ఏం వేదాంతం ! అరే భాయ్ జరా దేఖ్తె చలో .
ఇంక జేసుదాస్ , చిత్రలు పాడిన లలిత ప్రియ కమలం విరిసినది కన్నులకొలనిని . రసాభినందనలు అందరికీ . మరో శ్రావ్యమైన పాట తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం . మరో వేదాంత గీతం నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని . అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్నంత .
ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చే పాట రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ . మనో , శైలజ చాలా బాగా పాడితే పి యల్ నారాయణ , శోభన , చిరంజీవి , శ్యామల అంతే ఆహ్లాదంగా నటించారు .
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది పాటలో చిరంజీవి నటనను అభినందించాల్సిందే . ఇవి కాక రెండు శాస్త్రీయ గీతాలు . వీటిల్లో మెచ్చుకోవలసింది ముఖ్యంగా చిరంజీవినే . ఆయన మసాలా సినిమాల్లో చూపే విశ్వరూపం వేరు . ఈ సినిమాలో ఆయన చూపేది శబ్దరహిత విరాటరూపం . హేట్సాఫ్ .
బాలచందర్ గారికి శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం అనుకుంటా . శ్రీశ్రీ మహాప్రస్థానం చుట్టూ ఆకలిరాజ్యాన్ని సృష్టించిన ఆయన ఈ రుద్రవీణలో శ్రీశ్రీ కేకల్ని విస్తృతంగా ఉపయోగించుకున్నారు . క్లైమాక్సులో స్వాతంత్య్రం సమభావం సౌభ్రాత్రం సౌహార్ద్రం పునాదులై ఇళ్ళు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది , ఈ స్వప్నం ఫలిస్తుంది . దీనితో పాటు గణపతి శాస్త్రి గారు నేను సైతం అంటూ జనంతో ఒకరైపోతారు .
శాస్త్రీయ సంగీతానికి , నృత్యాలకు , సన్నివేశాలకు అనుగుణంగా కాంచీపురం , కుర్తాళం లోని దేవాలయాలను చక్కగా ఉపయోగించుకున్నారు . ఫొటోగ్రఫీ డైరెక్టర్ రఘురామిరెడ్డిని , కళా దర్శకులు మోహనంని ప్రత్యేకంగా అభినందించాలి . వారందరి కృషి వలనే ఈ సినిమా ఓ క్లాసిక్ గా మిగిలిపోయింది . తమిళంలోకి ఉన్నాల్ ముడియం తంబి అనే టైటిలుతో బాలచందరే రీమేక్ చేసారు . కమల్ హాసన్ , సీత , జెమినీ గణేషన్ నటించారు .
1988 మార్చిలో విడుదలయిన ఈ క్లాసిక్ యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనట్లయితే అర్జెంటుగా చూసేయండి . చూసినా మరలా మరలా చూడవచ్చు . అంతటి సందేశాత్మక , నిశ్శబ్ద విప్లవాత్మక సినిమా .
ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం , సమసమాజ స్థాపన , వికసిత భారతం వంటి కేకలను కేకించే రాజకీయ నాయకులు తప్పక చూడాలి .
సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదు . ఇలాంటి సినిమాలను అప్పుడప్పుడు చూస్తుంటే కాస్త సామాజిక స్పృహ కలుగుతుంది . ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణే . అందరికీ ఈ సినిమాను చూపించమని వారికి నా మనవి .
నేను పరిచయం చేస్తున్న 1182 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article