.
క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్ క్రికెటర్ల బిహేవియర్ అందరికీ తెలిసిందే… గ్రౌండ్ బయట కూడా అంతే… క్రీడాస్పూర్తి మన్నూమశానం ఏదీ పట్టదు వాళ్లకు… ప్రత్యేకించి ఇండియన్ క్రికెటర్ల మీద వాళ్లు ప్రదర్శించే ద్వేషం అంతా ఇంతా కాదు… ఇప్పుడు వాళ్లకు తాతల్లా బంగ్లాదేశ్ క్రికెటర్లు తయారయ్యారు… దాంతో పాకిస్థాన్ అయ్యో అయ్యో క్రీడాస్పూర్తి నాశనం అయిపోతోందని ఇప్పుడు మొత్తుకుంటున్నారు…
ఓ వివాదం సంగతి చెప్పుకుందాం… నిన్నటిదే… ఓవరాక్షన్ చేసిన బంగ్లాదేశ్‌ను టీ20 వరల్డ్ కప్ నుంచి ఐసీసీ తరిమేసింది కదా… వాడికి సపోర్ట్ చేసి, భంగపడి, రాజీపడిన పాకిస్థాన్ టోర్నీ మధ్యలోనే నిష్క్రమించిన సంగతీ తెలిసిందే… ఇప్పుడు ఇద్దరూ కలిసి వన్డే సీరీస్ ఆడుకుంటున్నారు… అందులో భాగంగా నిన్న రెండో మ్యాచ్ జరిగింది…
Ads
39వ ఓవర్… పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తోంది… మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ ఆఘా ధాటిగా ఆడుతున్నారు… ఆ ఓవర్‌లో మహమ్మద్ రిజ్వాన్ బౌలర్ వైపు ఆడాడు… అది కాస్త నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న సల్మాన్ అలీ అఘా బ్యాట్‌కు తాకింది… అక్కడే ఆగిపోయింది అది… తన కాలి దగ్గరే ఆగిన ఆ బంతిని సల్మాన్ అలీ అఘా బౌలర్‌కు అందించే ప్రయత్నం చేశాడు…
కానీ ఆ సమయంలో సల్మాన్ అలీ అఘా క్రీజు దాటి నిల్చొని ఉన్నాడు… దీన్ని గ్రహించిన హసన్ మిరాజ్ ఆ బంతిని అందుకొని, వికెట్లకు కొట్టి రనౌట్ కోసం అప్పీల్ చేశాడు,,. దాంతో సల్మాన్ అఘా అవాక్కయ్యాడు… నిజానికి అక్కడ తను రన్ కోసం ప్రయత్నించడం లేదు… పైగా ఆగిన ఆ బంతిని తనే బౌలర్‌కు అందించే ప్రయత్నం చేశాడు… కానీ బంగ్లాదేశ్ బౌలర్ కనీస క్రీడా స్ఫూర్తిని కూడా వదిలేసి రనౌట్ అప్పీల్ చేశాడు…
పాపం, అంపైర్ ఏం చేస్తాడు..? ఆఘా క్రీజు బయట ఉన్నది వాస్తవమే, బాల్ అప్పటికి డెడ్ కాలేదు, దాంతో ఔట్ ఇచ్చాడు… దాంతో సల్మాన్ ఆఘాకు పిచ్చ కోపం వచ్చింది… సదరు బంగ్లాదేశ్ బౌలర్‌ను, వికెట్ కీపర్ లిటన్ దాస్‌ను ఏవేవో తిట్టాడు… సంయమనం కోల్పోయాడు… బ్యాట్ విసిరేశాడు అక్కడే… హెల్మెట్, గ్లౌజులను విసిరికొట్టాడు… రుసరుస ఏదో గొణుగుతూ గ్రౌండ్ వదిలాడు…
ఓసారి ఇది చూడండి…
‘నేను క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలనుకున్నాను… కానీ హసన్ మిరాజ్ నిబంధనల ప్రకారమే నన్ను రనౌట్ చేసి ఉండవచ్చుగాక, కానీ రూల్స్ వేరు, స్పిరిట్ వేరు… నేను రన్ కోసం ప్రయత్నిస్తుంటే తను రనౌట్ చేస్తే అది వోకే, కానీ రన్ లేనప్పుడు రనౌట్ ఏమిటి, నాన్సెన్స్’ అంటాడు సల్మాన్ ఆఘా… తన కోణం కరెక్టే… ఇలాంటి తొండాట మేం ఎప్పుడూ ప్రదర్శించబోం అంటున్నాడు, అంతేకాదు… ఆ సమయంలో లిటన్ దాస్‌తో జరిగిన వాగ్వాదం క్షణికావేశంలో జరిగినది… అలా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపపడుతున్నాను అన్నాడు…
తరువాత లిటన్ దాస్ మాట్లాడుతూ… ‘‘మేం చారిటీ మ్యాచ్ ఆడటానికి రాలేదు, ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్, ఎవరూ ఏ చాన్స్ వదులుకోరు, ఆ రనౌట్ అవకాశాన్ని వాళ్లు ఇచ్చారు, మేం తీసుకున్నాం, మేం రూల్స్ దాటి ప్రవర్తించామా, లేదు కదా, మమ్మల్నెందుకు దూషించినట్టు..? ఔట్ అంటే ఔటే… మేం తప్పు చేయలేదు’’ అని సమర్థించుకున్నాడు… తన కోణంలో తనూ కరెక్టే…
కానీ స్పిరిట్ కోల్పోయి ఆ రనౌట్ చేయడం కరెక్టు కాదు, చేశాడు సరే, సల్మాన్ అలా సంయమనం కోల్పోయి క్రికెట్ బ్యాట్, హెల్మెట్, గ్లౌజ్ విసిరేసి, అక్కడే వాగ్వాదానికి, దూషణలకు దిగడం కూడా కరెక్టు కాదు… ఐసీసీ కూడా సల్మాన్ ఆఘా ప్రవర్తన పట్ల మందలించింది, ఒక డీమెరిట్ పాయింట్ విధించింది… సో, దొందూ దొందే… ఏక్‌సేఏక్…!!
Share this Article