Veeramae Vaagai Soodum…… ఇదీ విశాల్ తమిళంలో తను సొంతంగా నిర్మించిన చిత్రం పేరు… దాన్నే సామాన్యుడు అని తెలుగులోకి డబ్ చేసి మన మీదకు వదిలాడు… ఇప్పుడు అందరు హీరోలకూ అలవాటే కదా… తెలుగైనా, తమిళమైనా, మలయాళమైనా, కన్నడమైనా చకచకా ఇతర సౌత్ ఇండియా భాషల్లోకి కూడా డబ్ చేసి, ఒకేసారి రిలీజ్ చేసేయడం… వీలయితే హిందీలో కూడా విడుదల చేస్తే సరి… వస్తే నాలుగు డబ్బులు, లేదంటే చేతులు దులుపుకుంటే సరి… అలాగే సామాన్యుడు కూడా వచ్చాడు…
నిజానికి చాన్నాళ్లుగా విశాల్ సినిమాలేవీ క్లిక్ కావడం లేదు, ఈ స్థితిలో చాలామంది హీరోలు చేసే పనే తనూ చేశాడు… తనే సినిమా తీశాడు… అయితే ఒకవైపు తమిళ, మలయాళ సినిమాలు కొత్త కాన్సెప్టులు, జానర్లు, ప్రయోగాలతో కొత్త దిశలో పరుగులు తీస్తున్నయ్… తెలుగు సినిమాలేమో పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ అంటూ (ఇవీ కొత్త కథలే) కమర్షియాలిటీకే పదును పెడుతున్నయ్… ఈ సామాన్యుడు అటు కాదు, ఇటు కాదు, అందుకే ఎటూ గాకుండా పోయింది…
ఏదో ఓ సాదాసీదా కథ… హీరోయిజం కథ… తోడుగా ఆడటానికి, పాడటానికి ఓ హీరోయిన్, వీలైన ప్రతిసారీ యాక్షన్… అంతే శుభం కార్డు… ఎక్కడా కొత్తదనం వాసన లేకుండా హీరో, నిర్మాత, దర్శకుడు చాలా జాగ్రత్తపడ్డారు… డబ్బింగ్ సినిమాయే కాబట్టి పాటలు మనకు ఎక్కవు… అసలు పాటల్లో పదాలే మనకు అర్థం కావు… సంగీతం కొట్టేవాడి దయ, మన ప్రాప్తం… పోనీ, కథనమైనా కాస్త థ్రిల్లింగుగా ఉండేలా సీన్లు రాసుకున్నారా అంటే అదీ లేదు…
Ads
ఒకసారి హీరోగా పేరొచ్చిందంటే చాలు, మనమెలా తీసినా జనం చూస్తారనే భ్రమే మొదటి తప్పు… ట్రెండ్‌ను బట్టి కొత్తదనం కోసం ప్రయత్నించకపోవడం రెండో తప్పు… కనీసం పాటలు, బీజీఎం (పుష్ప, అఖండ సినిమాలకు ప్రధానమైన బలం సంగీతదర్శకులు…) గట్రా ఎక్సట్రా ఆర్డినరీగా ఉండేలా చూసుకోకపోవడం మూడో తప్పు… అదే రొటీన్, మాస్, ఫార్ములా కథనే ప్రేక్షకుడికి రుద్దాలనుకోవడం నాలుగో తప్పు… ఇలా చాలా తప్పుల నడుమ ఓ ‘సామాన్యుడు’ మరీ సామాన్యంగా కనిపించి, పెదవి విరిచేలా చేశాడు…
ఇదే పేరుతో గతంలో జగపతిబాబు సినిమా ఒకటి వచ్చింది… అందులో కాస్త కొత్తదనం కనిపించింది… ఈ సినిమాలో విశాల్ తప్ప ఇంకెవరూ పెద్దగా తెలుగు ప్రేక్షకులకు కనెక్టయ్యే నటులు కారు… హీరోయిన్ డింపుల్ హయాతి పేరుకు తెలుగమ్మాయే… కానీ ఏ సినిమాలోనూ పెద్దగా హిట్టవడం లేదు… ఇందులో కూడా పాత్రకు ప్రాధాన్యం లేదు, ఉందంటే ఉంది… అంతే… (ఈమె ఖిలాడీలో కూడా రాబోతోంది…)
చివరగా ఒక్క మాట… సొంత సినిమా అయినప్పుడు మరింత శ్రద్ధ తీసుకోవాలి కదా… మరి ఈ సినిమా ఇంత నాసిరకంగా వస్తున్నందుకు విశాల్ ఒక్కసారైనా రివ్యూ చేసుకోలేదా..? లేక మన ప్రేక్షకుల మీద అతి విశ్వాసమా..? కనీసం తన గత సినిమాల ఫెయిల్యూర్ల సోయి అయినా ఉండాలి కదా..? ఫాఫం, విశాల్ గనుక మారలేకపోతే, ప్రేక్షకుల అభిరుచే తనను మారుస్తుంది, లేదా మరిచిపోతుంది…!!
Share this Article