Ashok Vemulapalli……….. గొప్పోళ్ల జీవిత చరమాంకం… కొంత మంది జీవితాల ముగింపు అత్యంత విషాదకరంగా ఉంటుంది.. సహారా గ్రూప్ అధిపతి సుబ్రతొరాయ్ జీవితం అంతే.. ఒకప్పుడు వెలుగు వెలిగారు.. సక్సెస్ కు ఆయన మారుపేరు.. ఎంతోమందికి ఆదర్శం.. కానీ చివరికి సహారా కుప్పకూలింది.. ఆయన జైలు పాలయ్యారు.. చివరికి పెరోల్ పై జైలు నుంచి బయటకు వచ్చి గుండెపోటుతో చనిపోయారు..
ఆయన చావు ప్రశాంతంగా ఉండొచ్చు.. కానీ గత కొన్నేళ్లుగా ఆయనకు మానసిక ప్రశాంతత లేదు.. ఒకప్పుడు ఆయన్ని కలిస్తే చాలు అదృష్టమనుకున్న జనం.. ఆయన కోసం పడిగాపులు గాచిన పొలిటీషియన్లు, వేలకోట్ల సామ్రాజ్యం, ఎక్కెఫ్లైట్, దిగే ఫ్లైట్ అన్నట్టుగా జీవితం, ప్రతి నిమిషం ఎన్నో చెక్కుల మీద సంతకాలతో రోజుకు 24 గంటలు ఏమాత్రం సరిపోని జీవితంతో బిజీగా ఉండే ఆయన చివరికి తీహార్ జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి వచ్చింది..
సహారా గ్రూప్ తెలియనిది ఎవరికి? చిన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నపుడు క్రికెటర్ల షర్టుల మీద సహారా అని కనిపించేది.. బండి చక్రం మాదిరిగా సహారా కంపెనీ లోగో ఇంట్రెస్టింగ్ గా కనిపించేది.. ఎంతోమంది సినిమా హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు ఆయన వల్ల లబ్ది పొందినవాళ్లే.. సహారా గ్రూప్ అన్ని వ్యాపారాల్లో అడుగుపెట్టింది.. కానీ చాలామంది మాదిరిగా కూడబెట్టిన డబ్బు విదేశాలకి తరలించి, తర్వాత తాము చెక్కేసి ఎంజాయ్ చేయడం బహుశా సుబ్రతొరాయ్ కి రాలేదనుకుంటాను..
Ads
జనాన్ని ముంచేసి కూడా పొలిటికల్ అండదండలతో దర్జాగా బతికేయడం కూడా సుబ్రతొరాయ్ కి రాలేదు.. తన కంపెనీలో డిపాజిట్ చేసిన ప్రతి రూపాయి తిరిగి చెల్లిస్తానని అనేకసార్లు సుబ్రతొరాయ్ ప్రకటించారు.. నిజానికి సహారా గ్రూప్ కి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి.. అయినా ఎక్కడో ఏదో మేనేజ్‌మెంట్ లోపంతో చివరకు ఆయన జీవితమే ముగిసిపోయింది..
గత దశాబ్దకాలంలో అటు సత్యం రామలింగరాజు, ఇటు సుబ్రతొరాయ్ ,అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు , కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ ఇలా చాలామంది జీవితాలు చివరి దశలో కొంత మంది జైలుకు వెళ్తే.. ఇంకొంతమంది చనిపోయారు.. ఒకప్పుడు వీళ్లందరూ ఆదర్శప్రాయులే.. పెద్దయ్యాక వీళ్ల మాదిరి గొప్పోళ్లు అవ్వాలని పిల్లలకు తల్లిదండ్రులు నూరిపోసేవాళ్లు.. కానీ ఇప్పుడు? మేం తోపులం, మేమిలాగే సూపర్ పవర్స్‌గా ఉంటాం, మాకు తిరుగులేదు అనుకునే చాలామంది గొప్పోళ్లు గమనించాల్సిన జీవితం సుబ్రతోరాయ్‌ది… డెస్టినీ డిసైడ్స్ ఎవరీ థింగ్…
Share this Article