.
పెంట పంచాయితీలు పెట్టడంలో సోషల్ మీడియాను మించింది లేదు… కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి… ‘‘నిత్యామేనన్‌కు జాతీయ అవార్డు రావడంపై సాయిపల్లవిలో అసహనం పెరిగింది… ఆమెలో ఆగ్రహం, అసంతృప్తి మొదలైంది… అందుకే సోషల్ మీడియాలో సాయిపల్లవి ఫ్యాన్స్ నిత్యామేనన్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు… సాయిపల్లవి ఫ్యాన్స్ చేస్తున్న ట్రోలింగ్ మీద నిత్యామేనన్ కూడా అసహనంగా ఉంది… పలు ఇంటర్వ్యూలలో ఆమె తన అసంతృప్తిని వెళ్లగక్కింది…’’
ఇలాంటి వార్తలు కనిపిస్తున్నాయి… ఆ ట్రోలింగ్ సారాంశం ఏమిటంటే..? ‘‘అసలు ఆమెకు అవార్డు రావడం ఏమిటి..? ఆశ్చర్యంగా ఉంది… తిరుచిత్రాంబలంలో నిత్యామేనన్ నటనకన్నా గార్గిలో సాయిపల్లవి నటనే ఉత్తమం… ఐనా జ్యూరీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సాయిపల్లవిని పక్కన పెట్టేసి నిత్యామేనన్‌కు అవార్డు కట్టబెట్టారు…’’
Ads
నిజానికి ఇక్కడ ఆలూలేదు, చూలూలేదు అన్న ముచ్చటే తప్ప … ఆ ఇద్దరి మధ్య పంచాయితీయే లేదు… అంతా సోషల్ మీడియా సృష్టి… దాన్ని పట్టుకుని మెయిన్ స్ట్రీమ్ మీడియా హంగామా… అంతే… ఎందుకంటే..? నిత్యామేనన్, సాయిపల్లవి ఇద్దరూ ఇండస్ట్రీలో డిఫరెంట్ కేరక్టర్లే… తమకు నచ్చిన పాత్రల్నే ఎంపిక చేసుకుంటారు… ఏ వివాదాల్లోకీ తలదూర్చరు… వాళ్ల పనేదో వాళ్లది… నిత్యామేనన్ అయితే అవార్డుల షోలకు కూడా హాజరు కాదు…
జాతీయ అవార్డుకు తిరుచిత్రాంబలం, గార్గి సినిమాల్లో నటించిన నిత్యామేనన్, సాయిపల్లవి పేర్లను జ్యూరీ పరిశీలనకు తీసుకోవచ్చుగాక… అంతిమంగా నిత్యామేనన్‌కే వోటేశారు… సహజం… వాళ్లిద్దరి పేర్లతో పాటు మరికొన్ని పేర్లనూ పరిశీలించింది జ్యూరీ… మెజారిటీ సభ్యులు నిత్యామేనన్‌కే టిక్ మార్కు పెట్టేసరికి ఆమెకు అవార్డు ఖరారైంది…
అయినంతమాత్రాన సాయిపల్లవికి అదేమీ చిన్నతనం కాదు, ఇలాంటి అవార్డులకు ఖచ్చితమైన కొలమానాలు కూడా ఏమీ ఉండవు… ఎవరో మొదలుపెట్టారు సోషల్ మీడియాలో… అవార్డు రావల్సింది గార్గిలో సాయిపల్లవికే తప్ప, తిరుచిత్రాంబలంలో నిత్యామేనన్‌కు కాదు అని… మరెవరో అందుకున్నారు… ఇంకెవరో ఇంకాస్త యాడ్ చేశారు… అలాంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సహజం… ఇదీ అంతే… ఇందులో సాయిపల్లవి ఫ్యాన్స్ కావాలని చేస్తున్న ట్రోలింగ్ కూడా ఏమీ కాదు…
(హీరోల ఫ్యాన్స్ అయితే ఒక హీరోకు వ్యతిరేకంగా మరో హీరో ఫ్యాన్స్ కావాలని ట్రోలింగ్ చేస్తుంటారు… సోషల్ మీడియాలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి… కానీ హీరోయిన్లకు సంబంధించి ఫ్యాన్స్ వార్ కనిపించదు పెద్దగా… మరీ నిత్యామేనన్, సాయిపల్లవి అయితే అలాంటి వాటికి అవకాశాలే ఇవ్వరు…)
నిత్యామేనన్‌ను ఏదో ఇంటర్వ్యూలో ఎవరో ‘సాయిపల్లవి ఫ్యాన్స్ నిన్ను ట్రోల్ చేస్తున్నారు, మీరేమంటారు..?’ అని గోకారు… ఆమె కూడా సింపుల్‌గా, స్ట్రెయిట్‌గా… ‘‘ప్రతి ఏటా అవార్డులు ఇస్తూనే ఉంటారు… అవార్డు తీసుకున్నాక నేను జ్యూరీ సభ్యులు ఒకరిద్దరిని కలిశాను, మీ సినిమాల్ని తరచూ చూస్తుంటాం అన్నారు… ఇదేమీ లైఫ్ మొత్తానికి ఒకేసారి దక్కే అవార్డు కూడా కాదు… ఇక ఎవరెవరో ఏదో రాస్తుంటే నేను పట్టించుకోను… నా పని నాది, నా పంథా నాది…’ అని లైట్ తీసుకుంది…
ఆమె సాయిపల్లవిని ఏమీ అనలేదు… అనడానికి సాయిపల్లవి చేసింది కూడా ఈ పంచాయితీలో ఏమీ లేదు… నిత్యామేనన్ అలా చెబితే… ‘అదుగో, సాయిపల్లవి విమర్శల మీద నిత్యామేనన్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది’ అని మళ్లీ మొదలుపెట్టారు… ఇంకో కొత్త పంచాయితీ మొదలు పెట్టేంతవరకూ దీన్ని గోకుతూనే ఉంటారు… అదంతే…!!
Share this Article