సాయిపల్లవి అంటే రానాకు మస్తు లవ్వు… అపార్థం చేసుకోవద్దు, ఓ సహనటిగా మాత్రమే… తను వానలో గొడుగు పట్టగలడు, ఆమే ఈ సినిమాకు హీరో అని ఇగోలేకుండా ప్రకటించగలడు… మంచి గుణం… తెలుగు హీరోల నుంచి ఆ బిహేవియర్ విభిన్నం, విశిష్టం, విశేషం… సీన్ కట్ చేద్దాం… ఆమెది తదుపరి సినిమా గార్గి… దాన్ని సమర్పించేది రానా… సురేష్ ప్రొడక్షన్స్, అంత అభిమానాన్ని చూపిస్తున్నాడు రానా ఆమెపై… దాన్ని పొందడం ఆమె మంచి వ్యవహారశైలి… మళ్లీ సీన్ కట్ చేద్దాం…
విరాటపర్వాన్ని కూడా వదిలేయండి కాసేపు… ఆమె మెల్లిమెల్లిగా స్మితాపాటిల్ బాటలోకి వెళ్తోంది… తప్పు అని కాదు… అసలు తెలుగు సినిమాలకు సంబంధించి స్మితా పాటిల్‌తో ఎవరినీ పోల్చలేం… ఆమె ఓ యూనిక్… తను కూడా ఓ దశలో నమక్ హలాల్ సినిమాలో అమితాబ్‌తో కలిసి వాననీటిలో కిందామీదా పడింది… పాడింది, ఆడింది, సగటు హిందీ కమర్షియల్ కోణంలో అన్నీ చూపిస్తూ… కాస్త శృతితప్పి మరీ… (తరువాత నిద్రలేక తెల్లార్లూ ఏడ్చింది, అది వేరే సంగతి…)
Ads
స్మిత… పారలల్ సినిమాకు పట్టమహిషి… ఒక పాత్రను ఆవహించడం ఏమిటో ఆమెను చూసే అర్థం చేసుకోవాలి… సింపుల్, అంతకుమించి చెప్పలేం… ఆమెతో పోలిస్తే సాయిపల్లవి చిన్న పోరి… కాకపోతే అంతగా ఎదిగే ప్రతిభ ఉంది నటనపరంగా… కాకపోతే విరాటపర్వం చేశాక చాలా చాలా సినిమాయేతర వ్యాఖ్యానాలు చేస్తూ వివాదాల్లో జారిపోతోంది… అది వేరే కథ…
ఫిదా దగ్గర నుంచీ చూస్తే… ఆమె పాత్రలు భిన్నం… కాస్త ఆత్మగౌరవం కనబరిచే పాత్రలు… అయితే ఆయా పాత్రల కేరక్టరైజేషన్లలో బోలెడు లోపాలు… ప్రియుడికి చెప్పు ఫోటో పంపించే హైబ్రీడ్ పిల్ల… బొక్కలిరుగుతయ్ అంటూనే ఎవడెవడో వచ్చి దేహంపై చేయి వేసి శునకానందం పొందుతుంటే బేర్‌మంటుంది… లవర్ మీద కోపంతో మరో కోన్‌కిస్కా గాడికి ఎస్ చెబుతుంది… శ్యామ్ సింగరాయ్ సినిమాలో పునర్జన్మ పొందే ప్రియుడు వచ్చేదాకా బతికి ఉన్నట్టుగా ఉండి, వాడు రాగానే టపీమని టపా కట్టేస్తుంది… ఊఁ అంటే చాలు, దొడ్డితలుపు తెరుచుకుని వెళ్లినట్టు ప్రియుడితో షికార్లు పోతుంది…
పదహారేళ్ల వయస్సుకే కవితలు చదివి, నిన్ను ప్రేమిస్తున్నారోయ్ అని అడవుల్లోకి వెళ్తుంది… తనది ఏ టైపు ప్రేమో తనకే తెలియదు… ఆ మూర్ఖ ప్రేమికుడి దెబ్బకు గాలిలో కలిసిపోతుంది… అదీ కేరక్టరైజేషన్ లోపమే… ఇలా భిన్నమైన కథల్లోకి వెళ్తోంది ఆమె, కానీ ఆ పాత్రల చిత్రీకరణలో, ఆమె నటనను మరింత పిండుకోవడంలో, ఆమె మరింత ఎదిగేలా చేయలేని పాత్రలు అవి… పోనీ, కమర్షియల్ గురించి చెబుదామా..?
అదేదో నాని నటించిన ఎంసీఏ సినిమా… అందులో ఉత్త ఆటబొమ్మ సాయిపల్లవి… అప్పట్లో హీరో సూర్యతో ఏదో సినిమాలో నటించింది… అదీ జుజుబీ… మారి సినిమాలో ఆమె డాన్సిన ఒక్క పాట ఆమెను టాప్‌లోకి తీసుకుపోయింది… తరువాత కూడా పలు సినిమాల్లో ఆమె డాన్సులే ఆమెకు ప్రాణవాయువు… అవి లేకపోతే ఆమె పాత్రలు తేలిపోతున్నయ్… గార్గి సినిమా కూడా వ్యవస్థతో పోరాడే ఓ మహిళ కథ… మంచిదే… కానీ ఆమెను ఇక కట్టిపడేస్తున్నారు ఓతరహా పాత్రల్లో…
ఇప్పుడు సాయిపల్లవి అంటేనే తోటి హీరోలు వెనుకాడతారు… అసలే తెలుగు హీరోయిజం అంటేనే దైవాంశ సంభూతం కదా… మానవాతీతులు… అంటే మనుషులు కారు అని కాదు… అతీంద్రియ శక్తులతో పెట్టిపుట్టిన బాపతు… వాళ్లకు హీరోయిన్లు అంటే జస్ట్, తోలుబొమ్మలు… సో, ఆమె పక్కన నటించడానికి భయం… వెలవెలబోతామని… అందరూ రానాలు ఉండరు కదా… అప్పట్లో నాగశౌర్య కూడా సాయిపల్లవి మీద ఏడ్చాడు కదా… ఇకపై ఆమెకు ఇదే ప్రధాన ప్రతిబంధకం కాబోతోంది…
కీర్తిసురేష్ చూడండి సర్కారువారి పాటలో… సగటు రష్మిక, సగటు రాశి ఖన్నాలను మించి పాటల్లో రెచ్చిపోయింది… కారణం, తన మహానటి, ఇతర పాత్రల నుంచి బయటికి రావడానికి విశ్వప్రయత్నం చేస్తోంది… ఆ బాటలో వెళ్లడానికి సాయిపల్లవికి చాలా పరిమితులున్నయ్… ఐనాసరే, ఇండస్ట్రీలో నిలబడాలంటే స్మితాపాటిల్ ‘‘ఆజ్ రపట్ జాయేతే’’ తరహా మార్పు అవసరం… ఆ అగత్యమే వస్తే సాయిపల్లవి గుడ్‌బై అంటుంది… నాలుగు పారసిటమాల్ టాబ్లెట్ల ప్రిస్క్రిప్షన్లు రాసి బతికేస్తుంది… ఆమెకు ఇదొక సంధిదశ… గార్గి మరో ఉదాహరణ..!!
Share this Article