ఫస్ట్ పేజీలో (ఆంధ్ర ఎడిషన్) కనిపించలేదు… నా కళ్లేమైనా మోసం చేస్తున్నాయేమోనని అనిపించింది… మన రామప్ప గుడిని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తిస్తే, తెలుగు ప్రజానీకమే కాదు, భారత ప్రజానీకం మొత్తం ఆ వార్తలను ఆనందంగా చదివి, సంబరపడిపోతుంటే… ప్రత్యేకించి తెలుగు ప్రజలు పులకించిపోతుంటే… అది ఫస్ట్ పేజీ వార్త కాదా..? కాకుండా పోయిందా..? సాక్షి వేగంగా భ్రష్టుపడుతోంది అని అందరికీ తెలుసు జగన్కు తప్ప… కానీ మరీ ఇంతగా భ్రష్టుపట్టిపోవాలా..? అది తెలంగాణ వార్త అనుకున్నారా..? అంటే ఇక గొంగళిపురుగేనా అది..? పోనీ, లోపల వేశారేమో అనుకుని పేజీ తిప్పితే, రెండో పేజీలో దిక్కులేదు… మూడో పేజీలో ముచ్చటే లేదు… అయిదో పేజీలో రాష్ట్రీయం పేరిట అప్రధాన వార్తల్ని నింపేస్తూ ఉంటారు… అదుగో అక్కడ సంక్షిప్తంగా… క్లుప్తంగా అని శీర్షిక పెట్టి మరీ… ఓ సింగిల్ కాలమ్… ఇష్టముండీ లేనట్టుగా పబ్లిష్ చేశారు… ఇదుగో చూడండి ఈ సింగిల్ కాలమ్… అకాలం అనాలా ఈ ధోరణిని..?!
పోనీ, లోపల పేజీల్లో ప్రత్యేక కథనాలు ఏమైనా వేశారేమో… ఏ ఫ్యామిలీ పేజీలోనో, మరో లోపల పేజీలోనో… చివరకు ఎవరూ పెద్దగా చదవని సాక్షి ప్లస్ లోనో వేశారేమో అనుకుని పదిసార్లు తిరగేసినా… ఇంకేమీ కనిపించలేదు… పాఠకుడికి నిజంగానే ఓ విభ్రమ… రామప్ప వార్త అసలు వార్తే కాదా..? ప్రపంచం మన కట్టడాల్ని గుర్తిస్తే, అభినందిస్తే, అధికారిక ప్రపంచ వారసత్వ జాబితాలోకి ఎక్కిస్తే… అది ఆనందాన్ని షేర్ చేసుకోగల వార్త కాకుండా పోయిందా..? తెలంగాణ ఘనత నీ ఘనత కాదా..? ఒక్కసారిగా తెలంగాణ బొంతపురుగు అయిపోయిందా..? ఎందుకు..? ఈ గుడి తెలుగు ప్రజానీకం ఉమ్మడి ప్రాశస్త్యం కాదా..? అసలు తెలుగు కాదు, దేశమే గర్వించదగిన గుడి… ఆ నిర్మాణ కౌశలం, ఆ ఇంజనీరింగ్ నైపుణ్యం ఇంకెక్కడైనా గమనించామా..? ఆ శిల్పాల చెక్కణం, చక్కదనం మరెక్కడైనా చూశామా..? అసలు రామప్ప నీ వారసత్వ సంపద ఎందుకు కాకుండా పోయింది..? తెలంగాణలో ఉండటం వల్లా..? మరి తెలంగాణ జనం నిన్నెందుకు మోయాలి..? ఈ సంకుచిత, ఈ ఇరుకిరుకు మురికి గల్లీ తత్వాన్ని ప్రదర్శిస్తున్నందుకా..? మీరు పదే పదే తిట్టే ఆ యెల్లో పత్రికలే మంచి కవరేజీ ఇచ్చినయ్… ప్రత్యేకించి ఆంధ్రజ్యోతి ఆప్యాయంగా హత్తుకుంది… నీ సింగిల్ కాలమ్ వార్తలో నువ్వే చెప్పావు కదా… దేశంలో యునెస్కో ఇలా గుర్తించినవి కేవలం 38 కట్టడాలు, ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిది అన్నావు కదా… మరి ప్రాధాన్యం దక్కాల్సిన వార్త ఎందుకు కాకుండాపోయింది..? పత్రికలో ఎవరికైనా బాగా సిగ్గుపడాలని అనిపిస్తోందా..?
Ads
Share this Article