.
బాలు మరణించాక ఈటీవీ పాడుతా తీయగా, స్వరాభిషేకం ప్రోగ్రామ్స్‌ను కూడా వారసత్వంగా పొందాడు ఎస్పీ చరణ్… బాలు అనుభవం వేరు, చరణ్‌కు టీవీ ప్రజెంటేషన్ అప్పటివరకూ తెలియదేమో బహుశా…
మొదట్లో రెండు ప్రోగ్రామ్స్ గాడితప్పినట్టు అనిపించింది… కానీ స్వరాభిషేకం వదిలేస్తే, పాడుతా తీయగా మళ్లీ గాడిలో పడింది… వేరే టీవీ చానెళ్లు, ఓటీటీలు నిర్వహించిన మ్యూజిక్ కంపిటీషన్ ప్రోగ్రాములను చెడగొట్టడంతో మళ్లీ సంగీతాభిమానుల దృష్టి పాడుతా తీయగా మీద పడింది…
Ads
జడ్జిలుగా చంద్రబోస్, సునీత, విజయప్రకాష్… పర్లేదు, షోను ఎంతో కొంత తమ వ్యాఖ్యలతో, పరిశీలనలతో ప్రోగ్రామ్ క్వాలిటీ పెంచారు… ఇప్పుడు 25వ సీజన్ అట… రజతోత్సవ సీజన్ ప్రోమో ఒకటి కనిపించింది… కీరవాణి మరో జడ్జిగా వచ్చాడు విజయప్రకాష్ ప్లేసులో… (కీరవాణికి టీవీ షోలలో రెగ్యులర్ జడ్జిగా రావడం కొత్తేమో…)
ఖచ్చితంగా ఈ షోకు అదొక వాల్యూ యాడిషన్… చంద్రబోస్, పక్కనే కీరవాణి… రెండు ఆస్కార్లు పక్కపక్కనే కూర్చుని కనిపిస్తున్నారు… అఫ్‌కోర్స్, గాయనిగా సునీత సునీతే… పాడుతా తీయగాకు మొదటి నుంచీ ప్రధాన బలం బాలుకు సంబంధించిన ఆర్కెస్ట్రా టీమ్… పర్‌ఫెక్ట్ టీమ్…
ఐతే ఎటొచ్చీ నిరాశ కలిగించింది ఏమిటంటే..? గతంలో పలు మ్యూజిక్ కంపిటీషన్లలో పాల్గొన్నవాళ్లను తీసుకొచ్చి పాడించడం… ఉదాహరణకు… ఆహా ఓటీటీలోని తెలుగు ఇండియన్ ఐడల్‌లో పాడి, మంచి పేరు సంపాదించుకుని, అందరికీ పరిచయమైన శ్రీ ధృతి, రేణు కుమార్, ధరంశెట్టి శ్రీనివాస్, కార్తికేయ, జయరాం తదితరులు ఈ రజత పాడుతా తీయగా షోలో కనిపిస్తున్నారు…
ఒకరిద్దరు ఆ షోలో ఫైనలిస్టులు కూడా… పైన చెప్పిన వాళ్లంతా మంచి ప్రతిభ ఉన్నవాళ్లే, ప్రదర్శించినవాళ్లే… కానీ కొత్తవాళ్లు ఎవరూ దొరకడం లేదా..? అలా చేస్తేనే కదా, వైవిధ్యమైన గొంతులు తెరపైకి వచ్చేది… కొత్తవాళ్లకూ అవకాశం దక్కేది…
ఆడిషన్స్ ఖర్చు దేనికి, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న గొంతుల్ని పట్టుకొచ్చి పాడిస్తే సరి, అదే పాడుతా తీయగా షో అనుకున్నారా నిర్వాహకులు, నిర్మాతలు..? జీ సరిగమ నుంచి తెలుగు ఇండియన్ ఐడల్, ఐడల్ నుంచి పాడుతా తీయగా… ఇలా ఈ రెండుమూడు ప్రోగ్రాముల్లోనే ఎప్పుడూ ఆ పాత మొహాలే కనిపిస్తూ, ఆ పాత గొంతులే వినిపిస్తూ ఉంటే ఇక వైవిధ్యాన్ని ఏం ఆశించగలం..?
ఇంకా నయం… అదే సౌజన్య, అదే వాగ్దేవి, అదే మరో చిన్న వాగ్దేవి, అదే నజీరుద్దీన్, అదే అభిజ్ఞ ఎట్సెట్రా గత విజేతలను, సెకండ్, థర్డ్ రన్నరప్పులను కూడా తీసుకొచ్చి, ఓ టీమ్ చేసి, వాళ్లకే పోటీలు పెట్టి పాడించడం లేదు… అక్కడికి సంతోషం..!!
Share this Article