28వ తేదీన ప్రసారం కాబోయే జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమో చూస్తే తీవ్రమైన భీకర హాహాశ్చర్యం వేసింది సుమీ… రోజా తన చిరకాల వాంఛ నెరవేర్చుకుంది… మంత్రి అయిపోయింది… అదేదో శాఖ కూడా అప్పగించారు… నాకు సర్వీస్ చేయడం అంటే ఇష్టం, ఇక జబర్దస్త్‌కు రాకపోవచ్చు, బై బై, ఇక సెలవు, వీడ్కోలు అంటూ బొటబొటా కన్నీళ్లు కార్చింది ఓరోజు జబర్దస్త్ షోలో… ఫాఫం, కమెడియన్లు అందరూ ఆ సంతోషాన్ని, సారీ, ఆ సంతాపాన్ని అంతులేని బాధతో షేర్ చేసుకున్నారు కూడా…
అనేకానేక సైట్లు, యూట్యూబర్లు కూడా బరువెక్కిన గుండెలతో భారీ భారీ కథనాలు రాసేసి… ఇకపై రోజా కేవలం ప్రజాసేవకే అంకితం అన్నట్టుగా తేల్చేశారు… మల్లెమాల టీం లోలోపల ఫీలింగ్ ఏమిటో తెలియదు గానీ… మధ్యమధ్యలో ఇన్వాల్వ్ అయిపోతూ, పంచ్ డైలాగులు తనే చెప్పేస్తూ, సగం జబర్దస్త్ షో ఆమే చేస్తుంటుంది, పండుగ స్పెషల్స్ అనగానే డాన్సులు చేస్తుంది, ఆమే స్కిట్లు చేస్తుంది, హమ్మయ్య, ఇక అవన్నీ పోయినట్టే అని కొత్త ఆశలతో సెలబ్రేట్ చేసుకున్నారని అంటారు మరి…
ఆమె ప్లేసులో ఎవరు..? నందితా శ్వేత బెటరా..? అబ్బే, ఆమనిని తెచ్చి కూర్చోబెడుతున్నారుగా, ఆమే ఉంటుందేమో… నో, నో, ఆల్‌రెడీ ఇంద్రజ పాపులర్ అయిపోయింది, ఆమెనే ఈ షోలకూ జడ్జీకరిస్తారని కూడా బోలెడు ఊహాగానాలు వినబడ్డయ్… ఎలాగూ మనో కూడా రావడం లేదు, పనిలోపనిగా ఇద్దరూ కొత్త జడ్జిలయితే సూపరెహె అని కూడా చాలామంది ఆశించబడ్డారు కూడా…
Ads
ఎలాగూ హైపర్ ఆది బైబై అనేశాడు, చిన్నాచితకా కమెడియన్లు కూడా జబర్దస్త్ యమర్జెంటుగా వదిలేసి సూపర్ స్పీడ్‌లో మాటీవీ వాడి కామెడీ స్టార్స్ క్యాంపులో తేలుతున్నారు… రాంప్రసాద్, సుడిగాలి సుధీర్ మాత్రమే ఇంకా ఎందుకో వేలాడుతున్నారు… ఏమో, అనసూయ, రష్మి కూడా ఉంటారో ఉండరో అని కూడా ట్యూబ్ చానెళ్లు మస్తు క్రియేటివ్ స్టోరీలకు పదును పెట్టసాగారు… కొత్త యాంకర్లు ఎవరైతే బెటరబ్బా అనీ పోల్ సర్వేలు కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్లు చేస్తున్నయ్…
తీరా చూస్తే ఏమైంది..? రాబోయే 28 నాటి షో ప్రోమో చూస్తే… అదే రోజా… అదే మనో… అదే అనసూయ… అవే కుళ్లు జోకులు… అవే పంచులు… అవే నవ్వులు… ప్చ్, అందరి ఆశలూ నీరుకారినట్టేనా..? హేమో… చూడబోతే అలాగే ఉంది అంటూ నిర్లిప్తంగా, నిరాశగా కొందరు… హేమిటోలే, ఇదేదో పాత రోజుల్లో షూటింగబడ్డ ఓ పాత ఎపిసోడ్ అయి ఉంటుందిలే, నో, నో, రోజా మాటమీద నిలబడే నాయకురాలు, ఒకసారి జబర్దస్త్‌కు రాను అన్నాక ఆ మాటకు కట్టుబడుతుంది అనుకునేవాళ్లు కూడా ఉన్నారులెండి…
ఏమాటకామాట… జబర్దస్త్ షో అంటే రోజాకు భలే ప్రేమ… అసలు తనను రాజకీయంగా కాపాడేది, తనను ఇంతదాకా, అనగా మంత్రి కుర్చీ దాకా లాక్కొచ్చిందీ ఆ ప్రోగ్రామేనని బలమైన గాఢ లోతైన నమ్మకం… పెద్దగా ఏపీ మంత్రులకు పనేముంటుంది..? సో, రామోజీ మార్క్ కామెడీ సేవలో (జగన్ పదే పదే తిట్టిపోసే ఆ మారీచ దుష్టచతుష్టయానికి లీడర్) కొనసాగవచ్చునని ఫాఫం వైసీపీ యంత్రాంగం కూడా డౌటించలేదు… ఏమో, రోజాకు అర్జెంటుగా ప్రధాని పదవి ఇచ్చినా సరే, జబర్దస్త్‌ను వదలకపోవచ్చుననీ, మరీ ఆ మారీచ శిబిరంలో ఇంకా వేలాడమేమిటనీ గుర్రుగా చూస్తున్నవాళ్లూ లేకపోలేదు…!!
Share this Article